ఆర్మీ వాహనంపై నక్సలైట్ల దాడి.. 9మంది మృతి..
ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరుగుతూనే ఉంటున్నాయి.;
ఛత్తీస్‌గఢ్‌లో ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య కాల్పులు జరుగుతూనే ఉంటున్నాయి. కొన్ని నెలలుగా ఈ ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఈ దాడుల్లో ఒక్కోసారి నక్సలైట్లు భారీగా మరణిస్తే కొన్ని సందర్భాల్లో జవాన్లు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు. కాగా అదును దొరికిన ప్రతిసారీ నక్సలైట్లు.. ఆర్మీ జవాన్లు ప్రయానించే వాహనాపై ఐఈడీ దాడులకు తెగబుడుతున్నారు. ఈ రోజు కూడా ఛత్తీస్‌గఢ్ బిజాపూర్ ప్రాంతంలో జవాన్ల వాహనంపై నక్సలైట్లు దాడి చేశారు. ఐఈడీ పెట్టి వాహనాన్ని పేల్చారు. ఈ ఘటనలో దంతేవాడ డీఆర్ఎస్ జవాన్లు ఎనిమిది మంది, ఒక డ్రైవర్ అక్కడిక్కడే అసువులు బాసారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఉన్నతాధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. జవాన్ల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ప్రాంతమంతా కూడా దాడికి పాల్పడిన నక్సలైట్ల కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు.
కొద్ది రోజు కిందటే బస్తర్ ప్రాంతంలో భద్రతా బలగాలు, నక్సలైట్ల మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ దాడుల్లో నలుగురు నక్సలైట్లు ప్రాణాలు కోల్పోయారు. ఒక డీఆర్‌జీ కానిస్టేబుల్ కూడా మరణించారు. ఆ ఘటన జరిగిన రోజుల వ్యవధిలోనే నక్సలైట్ల ఎదురు దాడి జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నక్సలైట్ల కోసం జోరుగా గాలింపులు ప్రారంభించారు. కాగా సోమవారం జవాన్లపై నక్సలైట్లు చేసిన దాడిపై ఛత్తీస్‌గఢ్ డిప్యూటీ సీఎం అరున్ స్పందించారు. ‘‘బిజాపుర్‌లో పిరికిపందల్లా నక్సలైట్లు చేసిన దాడి గురించి తెలిసింది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన జవాన్ల మరణాలపై తీవ్ర సంతాపం తెలిపారు. నక్సలైట్లను ఎలిమినేట్ చేయడం కోసం పనిచేస్తున్న జవాన్లపై దిక్కుతోచని స్థితిలో నక్సలైట్లు ఇటువంటి పిరికి చర్యలకు పాల్పడ్డారు. జవాన్లు చేసిన త్యాగాలు వృధా కానివ్వం’’ అని అరున్ అన్నారు.
మార్చి 2026 నాటికి దేశంలో నక్సలిజాన్ని నిర్మూలిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రతినబూనింది. దాంతో నక్సలైట్ల ఏరివేత ప్రక్రియను భద్రతా బలగాలు ప్రారంభించాయి. వాటిలో భాగంగానే ఇప్పటికే ఛత్తీస్‌గఢ్‌లోని పలు ప్రాంతాల్లో నక్సలైట్ల స్థావరాలపై దాడులు చేశారు జవాన్లు. ఈ క్రమంలోనే సోమవారం ఈ దాడి జరిగింది. గత నెలలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఛత్తీస్‌గఢ్‌లో పర్యటించి.. ఏడాది కాలంలో భద్రతా దళాలు 287 మంది నక్సల్స్‌ను హతమార్చాయని, 1,000 మందిని అరెస్టు చేశాయని, 837 మందిని లొంగిపోయారని వెల్లడించారు. ఇదిలా ఉంటే కేంద్రంతో పాటుగా ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కూడా నక్సలైట్లను లొంగిపోయేలా ప్రోత్సహించే విధానాలను అమలు చేసింది. ఈ కార్యక్రమాలు నక్సలైట్లకు పునరావాసం కల్పించడంతో పాటు సమాజంలో మమేకం కావడానికి అవకాశం కల్పిస్తాయి. ప్రజల్లో తిరుగుబాటును తగ్గించడమే లక్ష్యంగా ఈ పాలసీలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో స్థానిక కమ్యూనిటీలు, లా ఎన్‌ఫోర్స్‌మెంట్ మధ్య నమ్మకాన్ని పెంచడం కోసం కమ్యూనిటీ పాలిసింగ్ అనే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.