హైదరాబాద్ లో మరో చిరుత ప్రత్యక్షం
గత వారం బాలాపూర్ వద్ద సంచరించిన చిరుతేనా ? ల;
కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ లో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. చారిత్రాత్మక గోల్కొండ సమీపంలో ఓ చిరుత సోమవారం కనిపించింది. అడవుల్లో లేదా జూపార్క్ లో ఉండాల్సిన చిరుత సడెన్ గా ప్రత్యక్షం కావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే పోలీసులకు, ఆటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. అయితే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్న సమయంలో చిరుత అక్కడ్నుంచి మాయమైంది. చుట్టూ చెట్ల పొదలు ఉండటంతో చిరుత ఎక్కడ నక్కి ఉందో ఎవరూ చెప్పలేకపోతున్నారు.
గత వారం బాలాపూర్ లో రెండు చిరుతలు కనిపించిన సంగతి తెలిసిందే. ఇమ్మారత్ ప్రాంతంలో రెండు కుక్కలను చిరుత వేటాడి తినడంతో విషయం బయటకు పొక్కింది. ఇమ్మారత్ లో అమర్చిన సీసీటీవీలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు కనిపించడంతో వాచ్ మెన్ అధికారులకు సమాచారం ఇచ్చాడు. అధికారులు ఆటవీశాఖ అధికారులకు చిరుతలు సంచరిస్తున్న విషయం చేరవేయడంతో ఆటవీ అధికారులు ఇమ్మారత్ లో రెండుబోన్లు ఏర్పాటు చేసి ఎరగా మేకను కట్టేసారు. అయితే చిరుతలు మాత్రం బోనులో చిక్కలేదు. బోనులో చిక్కని చిరుతలు గోల్కొండ ప్రాంతంలో సంచరిస్తున్నట్టు ఆటవీ శాఖ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.