గ్రీన్‌కో కంపెనీపై ఏసీబీ సోదాలు
ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలో గ్రీన్-కో సంస్థ పేరు తెరపైకి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కోట్ల రూపాయలు బీఆర్ఎస్‌కు ముట్టజెప్పిందని కాంగ్రెస్ ఆరోపించింది.;
ఫార్ములా ఈ-కార్ రేసు విషయంలో గ్రీన్-కో సంస్థ పేరు తెరపైకి వచ్చింది. ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో కోట్ల రూపాయలు బీఆర్ఎస్‌కు ముట్టజెప్పిందని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ క్రమంలోనే మాదాపూర్‌లోని గ్రీన్‌కో కార్యాలయంలో ఏసీబీ సోదాలు నిర్వహించింది. మంగళవారం ఉదయం నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. గ్రీన్‌కో అనుబంధ సంస్థ ‘ఏస్ నెక్స్ట్ జెన్’ లో కూడా తనిఖీలు చేశారు అధికారులు. ఫార్ములా-ఈ ఒప్పందానికి ముందే ఎలక్టోరల్ బాండ్ల రూపంలో బీఆర్ఎస్‌కు రూ.41కోట్లు ఇవ్వడంపై ఏసీబీ దృష్టి సారించింది. 25 అక్టోబర్ 2022న రేసు నిర్వహణ కోసం త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. దానికన్నా ముందే ఏప్రిల్‌లో రూ.31కోట్లు, అక్టోబర్‌లో రూ.10 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను గ్రీన్ అనుబంధ సంస్థలు సమకూర్చాయి. ఈ అంశంపై ఏసీబీ ఆరా తీస్తోంది.
ఫార్ములా ఈ-కార్ రేసు చర్చలు మొదలైనప్పటి నుంచే గ్రీన్ కో సంస్థ ఎన్నికల బాండ్లను కొనుగోలు చేయడం ప్రారంభించాయని, 8 ఏప్రిల్ 2022 నుంచి అదే ఏడాది అక్టోబర్ 10 మధ్యలో సదరు సంస్థ పదిసార్లు ఎన్నికల బాండ్లు కొన్నదని సమాచారం. అయితే ఈ అంశాన్ని బీఆర్ఎస్ పార్టీ మాత్రం తీవ్రంగా ఖండిస్తోంది. రేస్‌తో గత ప్రభుత్వానికి, బీఆర్ఎస్‌కు ఎటువంటి సంబంధిం లేదని కేటీఆర్ ఇప్పటికే పలుసార్లు చెప్పారు. ఏసీబీ కార్యాలయానికి చేరుకుని తన తరపు న్యాయవాదిని లోపలికి అధికారులు అనుమతించకపోవడంతో కేటీఆర్ వెనుదిరిగిన కొద్దిసేపటికే కాంగ్రెస్ ఈ వివరాలు బహిర్గతం చేసింది. దీంతో కేటీఆర్ మెడకు ఫార్ములా ఈ-కార్ రేసు ఉచ్చు మరింత బిగుస్తోంది. కానీ కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ తీవ్రంగా తోసిపుచ్చుతోంది. కాంగ్రెస్, బీజేపీలకు కూడా గ్రీన్‌కో ఎన్నికల బాండ్లు ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
‘‘గ్రీన్ కో సంస్థ 2022లో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. 2023లో ఫార్ములా ఈ-రేసు జరిగింది. కాంగ్రెస్, బీజేపీకి కూడా గ్రీన్ కో ఎన్నికల బాండ్లు ఇచ్చింది. ఫార్ములా రేసు ద్వారా గ్రీన్ కో నష్టపోయింది. అందుకే మరుసటి ఏడాది స్పాన్సర్‌షిప్ నుంచి తప్పుకుంది. అది క్విడ్ ప్రోకో ఎలా అవుతుంది? ఇది రేవంత్ రెడ్డి టీమ్ చేస్తున్న దుష్ప్రచారమే. పార్లమెంటులో ఆమోదం పొందిన ఎన్నికల బాండ్లు అవినీతి ఎలా అవుతుంది. దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు ఇచ్చిన బాండ్లపై చర్చలకు మేము సిద్ధం’’ అని కేటీఆర్ వెల్లడించారు.