అక్షర చైతన్య గ్రంథాలయం..గ్రామీణ యువతకు ఉపాధి మార్గం

సిరిసిల్లకు చెందిన నాగుల పూర్ణచందర్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరుగా ఎదిగారు. తాను ఎదగడమే కాదు తన ప్రాంత నిరుద్యోగుల కోసం అక్షర చైతన్య గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు.

Update: 2024-08-06 11:32 GMT
అక్షర చైతన్య గ్రంథాలయం

సిరిసిల్ల పట్టణంలోని పేద కుటుంబానికి చెందిన నాగుల పూర్ణచందర్ బీసీఏ చదివి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడ్డారు. హైదరాబాద్ నగరంలో ఉంటూ ఉద్యోగం చేస్తున్న పూర్ణచందర్ నిత్యం తన స్వగ్రామమైన సిరిసిల్ల ప్రాంత గ్రామీణ నిరుద్యోగ యువత గురించి ఆలోచించే వారు.సిరిసిల్ల ప్రాంత గ్రామీణ యువత డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు సిద్ధమవ్వాలంటే హైదరాబాద్ కు రావాలి. పేద విద్యార్థులకు హైదరాబాద్ వచ్చి, హాస్టల్ లో ఉండి చదువుకునే ఆర్థిక స్థోమత లేనివారెందరో ఉన్నారు. అలాంటి వారికి సిరిసిల్లలోనే పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యేందుకు వీలుగా ఏమైనా చేయాలని నిర్ణయించుకున్నారు. అంతే అక్షర చైతన్య ఉచిత గ్రంథాలయాన్ని పూర్ణచందర్ ప్రారంభించారు. ఒక వైపు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూనే తన గ్రామీణ ప్రాంత నిరుద్యోగ యువత చదువుకునేందుకు ఉచితంగా గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి వారికి మార్గదర్శిగా నిలిచారు. వీకెండ్స్ లో సిరిసిల్ల వెళ్లి నిరుద్యోగ యువతకు కెరీర్ గైడెన్స్ అందించడంతోపాటు వారు చదువుకునేందుకు 3వేల పుస్తకాలను సమకూర్చారు.


చదువు, ఉద్యోగాల్లో నాగుల రామస్వామి కుటుంబం ఆదర్శం
సిరిసిల్లకు చెందిన నాగుల రామస్వామి కోర్టులో స్టాంపు వెండరుగా పనిచేశారు. పేదరికంలో ఉన్నా తన నలుగురు కుమారులకు చదువు చెప్పించి వారు ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడేందుకు తోడ్పడ్డారు. తన నలుగురు కుమారుల్లో ఇద్దరు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగాలు సాధించారు. మరో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లుగా స్థిరపడ్డారు. సిరిసిల్లలో ఎందరో విద్యార్థులకు రామస్వామి కెరీర్ గైడెన్స్ ఇచ్చారు.అలా చిన్న కుమారుడైన నాగుల పూర్ణచందర్ సాఫ్ట్ వేర్ ఇంజినీరుగా పనిచేస్తూ తండ్రి రామస్వామి ఇచ్చిన స్ఫూర్తితో తన ప్రాంత నిరుద్యోగ యువతను ఉపాధి బాటలో నడిపించేందుకు తోడ్పాటు అందించాలనుకున్నారు.

కెరీర్ గైడెన్స్ వర్క్ షాప్
డిగ్రీ దాకా చదివి సరైన గైడెన్స్ లేక గ్రామాలకే పరిమితమైన యువతకు కెరీర్ గైడెన్స్ అందించాలనే లక్ష్యంతో నాగుల పూర్ణచందర్ వివిధ రంగాల్లో నిష్ణాతులను సిరిసిల్లకు తీసుకువచ్చి కెరీర్ గైడెన్స్ వర్క్ షాప్ నిర్వహించారు.దీనికోసం సెలవురోజుల్లో సిరిసిల్లకు వచ్చి కళాశాల విద్యార్థులతో మాట్లాడి పరిస్థితులను తెలుసుకున్నారు. నిరుద్యోగ యువతకు తాను బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు.

అక్షర చైతన్య గ్రంథాలయం
సిరిసిల్లలో ఉన్న ప్రభుత్వ గ్రంథాలయాలు సరిగా పనిచేసేవి కావు.దీంతో నిరుద్యోగ యువత చదువుకునేందుకు వీలుగా తన దగ్గర ఉన్న డబ్బుతో 300 పుస్తకాలు కొని చిన్నగదిలో తన తండ్రి నాగుల రామస్వామి స్మారకార్థం అక్షర చైతన్య గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత కొందరు దాతల సహకారంతో 3వేల పుస్తకాలు కొని నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేందుకు వీలుగా సిరిసిల్లలోనే గ్రంథాలయాన్ని విస్తరించారు. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల దాకా తెరిచి ఉంచుతున్న ఈ గ్రంథాలయాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా హైదరాబాద్ లో నుంచే మానిటరింగ్ చేస్తున్నానని నాగుల పూర్ణచందర్ చెప్పారు.

గ్రంథాలయంలో డిజిటల్ క్లాస్ రూం
‘‘ఫిలడెల్ఫియా తెలంగాణ అసోసియేషన్ 1000 డాలర్లు విరాళంగా అందించడంతో ఆ డబ్బుతో నేను డిజిటల్ క్లాస్ రూం ఏర్పాటు చేయించాను. నిరుద్యోగ యువత మనటీవీలో వచ్చే ఆన్ లైన్ పాఠాలను డిజిటల్ క్లాస్ రూంలో వినేవారు. అలా గ్రంథాలయానికి వచ్చే నిరుద్యోగుల సంఖ్య పెరిగింది. తెలంగాణ గ్రూపు పరీక్షలు, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారు గ్రంథాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న పుస్తకాలు చదివే వారు. అలా చాలామంది నిరుద్యోగులు ఉద్యోగాలు సాధించారు.యువ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేసి నిరుద్యోగులకు కెరీర్ గైడెన్స్ అందిస్తున్నాం. పోటీ పరీక్షల్లో తెలంగాణ గ్రామీణ విద్యార్థులు ముందడుగు వేయాలంటే వారికి అందుబాటులో ఉండేలా గ్రంథాలయాలు ఏర్పాటు చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాను. దీంతో స్పందించిన ప్రభుత్వం పలు పట్టణాల్లో కొత్త గ్రంథాలయాలను ఏర్పాటు చేసింది.’’ అని పూర్ణచందర్ వివరించారు.

పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నాం...
సిరిసిల్లలో ఇంటి వద్ద ఉండి అక్షర చైతన్య గ్రంథాలయంలో గత అయిదేళ్లుగా చదువుకున్నానని, దీనివల్లనే తాను టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షల్లో ఉత్తీర్ణుడయ్యానని వినయ్ మల్యాల అనే విద్యార్థి చెప్పారు. తాను ఎస్జీటీ పరీక్ష కోసం ఈ గ్రంథాలయంలోనే చదువుకుంటున్నానని హరీష్ దాసరపు చెప్పారు. ఇలా ఎందరో నిరుద్యోగ అభ్యర్థులకు ఈ గ్రంథాలయం ఎంతగానో ఉపయోగపడుతోంది.

స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు నా కల
‘‘ ప్రస్థుతం అక్షర చైతన్య గ్రంథాలయం ఏర్పాటు చేయడం ద్వారా వందలాదిమంది నిరుద్యోగ యువకులకు సేవలు చేస్తున్నాను. భవిష్యత్ లో సిరిసిల్లలో స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలనేదే నా జీవిత కల. దీనికోసం నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. చదువుకున్న యువత సాంకేతిక నైపుణ్యం సాధించి ఉద్యోగాలు సాధించేందుకు తోడ్పడాలనేదే నా ఆశయం’’ అంటూ నాగుల పూర్ణచందర్ వివరించారు.


Tags:    

Similar News