అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు..!
శుక్రవారం మధ్యాహ్నమే మంత్రివర్గ విస్తరణ జరగనుందంటూ జుగుతున్న ప్రచారం.
తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ అంశం ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. మంత్రివర్గాన్ని విస్తరించాలని ప్రభుత్వం నిశ్చయించుందని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఈ విస్తరణలో భాగంగా కాంగ్రెస్ సీనియర్ నేత అజహరుద్దీన్ కు మంత్రి పదవి ఇవ్వాలని కూడా ప్రభుత్వం డిసైడ్ అయినట్లు రెండు రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం కూడా ఫైనల్ అయినట్లు తెలుస్తోంది. తెలంగాణ క్యాబినెట్‌లో ఖాళీ ఉన్న మూడు మంత్రి పదవుల్లో ఒకదానికి అజహరుద్దీన్ కు అందించనున్నారని, శుక్రవారం మధ్యాహ్నం ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.
అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం కోసం రాజ్‌భవన్ హాలును రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రోటోకాల్‌లో భాగంగా అధికారులు ఇప్పటికే ప్రమాణ స్వీకారం జరిగే హాలును పరిశీలించినట్లు సమాచారం. అయితే ఈ మంత్రివర్గ విస్తరణను ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు మంత్రివర్గ విస్తరణ ఎలా చేస్తారని, ఇది ముమ్మాటికి ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అని వారు పేర్కొంటున్నారు. ఇప్పటికే అజహరుద్దీన్ కు మంత్రి పదవి అన్న వార్తలపై బీజేపీ నాయకులు.. ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు కూడా చేశారు. ఈ సమయంలో అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారానికి అంతా రెడీ అన్న చర్చ.. సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే నిజంగా మంత్రివర్గ విస్తరణ ఎలా జరుగుతుంది? అందుకు ఆస్కారం ఉందా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
15గా ఉన్న మంత్రుల సంఖ్య..
2023 డిసెంబర్ నెలలో రేవంత్ రెడ్డితో పాటు 11 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత మరో ముగ్గురికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు. ఈ మంత్రివర్గ విస్తరణలో అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్‌లకు అవకాశం లభించింది. కాగా ఇప్పటికే మరో మూడు మంత్రి పదవులు పెండింగ్‌లో ఉన్నాయి. వాటి విస్తరణపై కూడా ఇప్పటికే చర్చలు జరుగుతుండగా ఇప్పుడు వాటిలో ఒకదానిని అజహరుద్దీన్‌కు అందించాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ప్రచారం మొదలైంది. కాగా దీనిపై ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన లేకపోవడంతో.. తెలంగాణ పాలిటిక్స్‌లో ఇది ప్రస్తుతం హాట్ టాపిక్‌గా ఉంది.
అజహరుద్దీన్‌పై కుట్ర జరుగుతుంది: భట్టి
అజహరుద్దీన్‌కు మంత్రి పదవి అంశంపై ఎన్నికల అధికారికి ఫిర్యాదు ఇచ్చిన అంశాన్ని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమాన తప్పుబట్టారు. అజహరుద్దీన్‌కు మంత్రి పదవి రాకుండా చేయడానికి భారీ కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు. ‘‘అజహరుద్దీన్ ను కేబినెట్‌లోకి తీసుకోవద్దని లేఖలు రాస్తున్నారు. దేశానికి పేరు ప్రఖ్యాతు తీసుకొచ్చిన క్రీడాకారుడు అజహరుద్దీన్. ఆయనను కేబినెట్‌లోకి తీసుకుంటే స్వాగతించాలి. కానీ అజహరుద్దీన్‌కు వ్యతిరేకంగా లేఖలు రాస్తుండటం దురదృష్టకరం. ఉపఎన్నికలో బీఆర్ఎస్‌ను గెలిపించడం కోసమే బీజేపీ ఇలాంటి లేఖలు రాస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో కమళం పార్టీకి కారు సహకారం అందించింది. అందుకే ఇప్పుడు వాళ్లు జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్‌కు మద్దతుగా నిలుస్తున్నారు. అజహరుద్దీన్‌ను కేబినెట్‌లోకి తీసుకోకుండా గవర్నర్‌పై ఒత్తిడి తెస్తున్నారు’’ అని ఆయన వ్యాఖ్యానించారు.