రేవంత్ ఇలాకాలో మహిళా జర్నలిస్టులపై దాడి

గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది.

Update: 2024-08-22 10:21 GMT

గ్రౌండ్ రిపోర్ట్ కి వెళ్లిన ఇద్దరు మహిళా జర్నలిస్టులపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారన్న వార్త రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అవుతోంది. సీఎం సొంత ఊరిలో ఈ వివాదం చెలరేగడంతో రాజకీయ విమర్శలకు తావిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి అనుచరులు తమపై దాడి చేశారని ఆవుల సరిత, విజయారెడ్డి అనే మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు డీజీపీ జితేందర్ కి ఫిర్యాదు చేశారు. ఘటనకి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

మహిళా జర్నలిస్టులు తెలిపిన వివరాల ప్రకారం... రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీ పై జరుగుతోన్న ఆందోళనలపై న్యూస్ కవర్ చేసేందుకు వారిద్దరూ, తమ టీమ్ తో కలిసి కొండారెడ్డిపల్లి వెళ్లారు. అక్కడ జరుగుతోన్న ఆందోళనలు షూట్ చేస్తూ, స్థానికుల నుంచి బైట్స్ తీసుకోబోతుండగా కొందరు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. మహిళా జర్నలిస్టులను చుట్టు ముట్టి, వారి ఫోన్లు, కెమెరాలు, కెమెరాలలో చిప్స్ లాక్కున్నారు. వారి నుండి తమ పరికరాలు లాక్కునేందుకు మహిళా జర్నలిస్టులు ప్రయత్నించగా పెనుగులాట జరిగింది. ఇక్కడివరకు కెమెరాల్లో రికార్డ్ అయింది. ఆ తర్వాత కెమెరాలలో అక్కడ ఏం జరిగిందో సరిగా రికార్డ్ అవలేదు. ఆ సమయంలో తమపై రేవంత్ అనుచరులు దాడి చేశారని, బురదలోకి నెట్టేశారని మహిళా జర్నలిస్టులు సరిత, విజయారెడ్డి ఆరోపిస్తున్నారు. తెలంగాణలో మహిళా జర్నలిస్టులపై జరిగిన ఈ దాడిని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీరియస్‌గా తీసుకోవాలని మహిళా జర్నలిస్టులు కోరుతున్నారు.

హేయమైన చర్య -బీఆర్ఎస్ 

రాష్ట్రంలో రేవంత్ అధికారంలోకి వచ్చిన రోజు నుండి పాత్రికేయులపై వరుస దాడులు జరుగుతున్నాయని బీఆర్ఎస్ ఆరోపించింది. రైతు రుణమాఫీ అసలు వాస్తవాలను ప్రజలకు చూపించేందుకు రేవంత్ సొంత ఊరు కొండారెడ్డి పల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా యాదవ్, విజయా రెడ్డిపై రేవంత్ గూండాలు దాడి చేశారంటూ మండిపడింది. మహిళలని చూడకుండా, జర్నలిస్టులను బూతులు తిడుతూ, ఫోన్లు, కెమెరాలు లాక్కుని రేవంత్ అనుచరులు భౌతిక దాడికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేసింది. విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులపై దాడి చేయడం హేయమైన చర్య అని విమర్శించింది. మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిపై వెంటనే మహిళా కమిషన్ స్పందించి, కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

మండిపడ్డ సబిత, కవిత...

మహిళా జర్నలిస్టులపై దాడి ఘటనను బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ మాలోత్ కవిత తప్పుబట్టారు. ఇందిరమ్మ పాలనలో మహిళా జర్నలిస్టులకు రక్షణ లేదా అంటూ నిలదీశారు. విధి నిర్వహణలో భాగంగా సీఎం సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్లిన మహిళా జర్నలిస్టులు సరితా, విజయారెడ్డిపై సీఎం అనుచరులు దాడి చేయడాన్ని ఖండిస్తున్నట్లు తెలిపారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలి అని తెలంగాణ డీజీపీని కోరారు. మహిళా కమిషన్ కూడా సుమోటోగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అసభ్యంగా ప్రవర్తించారు...

కొండారెడ్డి పల్లిలో విజయా రెడ్డి, సరిత అనే ఇద్దరు మహిళా జర్నలిస్టులపై దాడులు చేస్తూ కాంగ్రెస్ గుండాలు అసభ్యంగా ప్రవర్తించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహించారు. "ముఖ్యమంత్రి రేవంత్.. నువ్వు నిజంగా రుణమాఫీ వంద శాతం పూర్తి చేస్తే ఎందుకు మహిళా జర్నలిస్టులపై దాడులు చేయిస్తున్నావు" అని సీఎంని నిలదీశారు. 

ఖండించిన హరీష్ రావు...

జర్నలిస్టులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ పాలనలో ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యాన్ని అణచివేయడం, వ్యతిరేక గొంతులను నొక్కేయడాన్ని బయటపెడుతున్నాయన్నారు. జర్నలిస్టులపై పెరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని హరీష్ రావు పేర్కొన్నారు.

Tags:    

Similar News