అజహర్ మంత్రిపదవికి బ్రేక్ ?

క్రికెటర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ముస్లిం ఓటర్లను ప్రలోభానికి గురిచేసినట్లవుతుంది

Update: 2025-10-30 08:14 GMT
Mohammed Azharuddin

ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయానికి బ్రేక్ పడిందా ? ఈనెల 31వ తేదీన అజహర్ను మంత్రివర్గంలోకి తీసుకునేందుకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిర్ణయించారనే విషయం బుధవారం రాత్రి మీడియా, సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటం ఖాయమనే ప్రచారం అంతా అనధికారికమే. అయితే గురువారం మధ్యాహ్నానానికి క్రికెటర్ ను మంత్రివర్గంలోకి తీసుకునే విషయం వాయిదాపడిందనే ప్రచారం మొదలైంది.

తాజా ప్రచారానికి కారణం ఎన్నికల కోడ్ అమల్లో ఉండటమే. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఉపఎన్నిక జరుగుతోంది కాబట్టి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. కోడ్ అమల్లో ఉన్నపుడు అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటం కుదరదు. ఎందుకంటే క్రికెటర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటే ముస్లిం ఓటర్లను ప్రలోభానికి గురిచేసినట్లవుతుంది. ఎన్నికల్లో గెలుపుకు ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం ఎన్నికల కోడ్ రీత్యా నేరం. ఇపుడు అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించటం నియోజకవర్గంలోని 1.20 లక్షల ముస్లిం ఓట్లను కాంగ్రెస్ కు పడేట్లు చేయటం కోసమే అనే ఆరోపణలు మొదలైపోయాయి.

ముస్లింల ఓట్లకోసమే అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవటం అంటే ఒకవర్గం ఓటర్లను గంపగుత్తగా ప్రలోభాలకు గురిచేయటమే అనే ఆరోపణలు పెరుగుతున్నాయి. అయితే ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలన్న విషయం పూర్తిగా ముఖ్యమంత్రి నిర్ణయం. ఎప్పుడు తీసుకోవాలనే విషయం కూడా సీఎం ఇష్టమే అనటంలో సందేహంలేదు. అయితే గతంలో ఇదే పరిస్ధితి ఎదురైనపుడు గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఏమిచేశారు ? అన్న విషయంపై ఇపుడు చర్చ మొదలైంది. ఉపఎన్నిక జరుగుతున్నపుడు మంత్రివర్గ విస్తరణ చేసే విషయమై కేంద్ర ఎన్నికల సంఘం మాజీ కమీషనర్ అశోక్ లావాసా మాట్లాడారు.

అశోక్ ఏమిచెప్పారు ?

అశోక్ మాటల్లోనే, గోవాలో కూడా ఒక అసెంబ్లీ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరిగింది. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న మనోహర్ పారికర్ గెలుపుకోసం నియోజకవర్గంలో ఎక్కువ ఓటర్లున్న సామాజికవర్గానికి చెందిన ఒక వ్యక్తిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని అనుకున్నారు. వెంటనే ఇదేవిషయాన్ని ప్రకటించారు. అయితే పారికర్ ప్రకటనపై కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ స్పందించారు. పారికర్ తో మాట్లాడి మంత్రివర్గ విస్తరణకు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఎందుకంటే ఎన్నికలకోడ్ అమల్లో ఉండగా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే ఉద్దేశ్యంతో మంత్రివర్గ విస్తరణ చేయకూడదని ప్రధాన ఎన్నికల కమీషనర్ పారికర్ కు స్పష్టంగా చెప్పారు. అయితే పారికర్ వినిపించుకోలేదు. మంత్రులనియామకంలో రాజ్యాంగం తనకిచ్చిన అధికారాలను ఉపయోగించుకుంటున్నట్లు పారికర్ స్పష్టంచేశారు.

అప్పుడు ప్రధాన కమీషనర్ బదులిస్తు గంపగుత్తగా ఒక సామాజికవర్గం ఓట్లను పొందటానికి అదే సామాజికవర్గానికి చెందిన వ్యక్తిని మంత్రిగా చేయటం ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటమే అనిచెప్పారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయటం ఎన్నికల కోడ్ ప్రకారం నేరమవుతుందని పారికర్ కు ప్రధాన కమీషనర్ నచ్చచెప్పారు. అప్పుడు పారికర్ కన్వీన్సయి మంత్రివర్గ విస్తరణను వాయిదా వేసుకున్నారు.

ఇక్కడ కూడా అదే సూత్రం వర్తిస్తుంది అనటంలో సందేహంలేదు. కాకపోతే అజహర్ ను క్యాబినెట్లోకి తీసుకునే విషయంలో ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి ఎన్నికల కమీషన్ జోక్యం చేసుకోలేదు. అధికారిక ప్రకటన జారీ అయితే అప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం ఏమిచేస్తుందో చూడాలి.

ప్రతిపక్షాల అభ్యంతరాలు

ఉపఎన్నిక జరుగుతున్నపుడు అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రతిపక్షాలు బీఆర్ఎస్, బీజేపీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఎన్నికల కమీషనర్ సుదర్శనరెడ్డిని బీజేపీ ఎంఎల్ఏ పాయల్ శంకర్, మాజీమంత్రి మర్రి శశిధర్ రెడ్డి గురువారం కలిశారు. ముస్లిం ఓటర్లను ప్రలోభానికి గురిచేయటం కోసమే అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు అభ్యంతరం వ్యక్తంచేశారు.

ఇదే విషయమై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ట్విట్టర్లో స్పందించారు. మాజీ క్రికెటర్ అజహరుద్దీన్ ను క్యాబినెట్లోకి తీసుకోవటం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక కోసమే అని మండిపడ్డారు.

పూర్తిగా దిగజారిన పరువును కాపాడుకోవటానికి కాంగ్రెస్ అడ్డుగోలు ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు.

Tags:    

Similar News