భానుడి భగ భగలు..పెరిగిన ఉష్ణోగ్రతలతో జర జాగ్రత్త

దేశంలో భగ భగ మండుతున్న సూర్యుడితో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణలో వడదెబ్బ వల్ల 11మంది మృతి చెందారు. ఏపీలోనూ వడగాలులు వీస్తున్నాయి.

Update: 2024-06-01 05:26 GMT
మండుతున్న ఎండలు...

వేసవికాలం ముగియనున్న నేపథ్యంలో దేశంలో పలు ప్రాంతాల్లో ఎండలు మండిపోతున్నాయి.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి.

- శుక్రవారం తెలంగాణలోని మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రత 47.1 డిగ్రీలకు పెరిగింది. తెలంగాణలోని భానుడి ప్రతాపంతో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 46 డిగ్రీలకు పైగా నమోదైంది. శుక్రవారం ఒక్క రోజే వడదెబ్బతో తెలంగాణలో 11మంది మరణించారు.
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కావలి, ఒంగోలు పట్టణాల్లో శనివారం 45డిగ్రీల సెల్సియస్ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని పలు ప్రాంతాలు శనివారం వేడిగాలులతో ప్రజలు అల్లాడిపోయాయి.

హై అలర్ట్ జారీ
దేశంలో మండుతున్న ఎండలతో ఐఎండీ అధికారులు హైఅలర్ట్ జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 15 జిల్లాలను ఐఎండీ అధికారులు రెడ్‌జోన్‌ కింద ప్రకటించారు. తెలంగాణ అంతటా ఉష్ణోగ్రతలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. రుతుపవనాల రాక పోవడంతో, శనివారం హైదరాబాద్‌లో తీవ్రమైన వేడి పరిస్థితులు కొనసాగాయి.

హైదరాబాద్ లో పెరిగిన ఎండ వేడిమి
హైదరాబాద్ నగరంలోని అన్ని ప్రాంతాల్లో 40 నుంచి 43 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉప్పల్ లో 43.3 డిగ్రీల సెల్సియస్‌తో అగ్రస్థానంలో ఉంది. బాలానగర్, అంబర్‌పేట్, కూకట్‌పల్లి 43 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. మంచిర్యాల,భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రమైన ఉష్ణోగ్రత నమోదైంది.

మోస్తరు వర్షాలు కురిసే అవకాశం
జూన్ 1వతేదీన హైదరాబాద్‌తో సహా తెలంగాణ అంతటా పొడి వాతావరణం ఉంటుందని, దీనివల్ల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని ఐఎండీ అధికారి మల్లికార్జున్ రెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. జూన్ 1వతేదీ తర్వాత రాష్ట్రం అంతటా హీట్‌వేవ్ నుంచి ఉపశమనం లభిస్తుందని ఐఎండీ అధికారులు తెలిపారు. నైరుతి ఋతుపవనాలు మే నెల 31వ తేదీన కేరళలోని కొన్ని ప్రాంతాల్లో, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలోని కొన్ని ప్రాంతాలలో ప్రవేశించడానికి పరిస్థితులు అనుకూలంగా మారాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

ఏపీలో మళ్లీ వడగాలులు
బాపట్లలో 44.8 డిగ్రీలు, అమరావతిలో 44.2 డిగ్రీల సెల్సియస్, నందిగామలో 44.1, నెల్లూరు 44.1, తిరుపతి 43.9, నంద్యాలలో 42.5డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రుతుపవనాలు ప్రారంభమైన తర్వాత తేమ స్థాయి తగ్గుతుందని భావిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వేడి వాతావరణం ఉంటుందని ఐఎండీ అధికారులు పేర్కొన్నారు. నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, లక్షద్వీప్, కేరళ, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలు,నైరుతి బంగాళాఖాతంలో మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ కార్యాలయం తెలిపింది.

నాగపూర్ లో రికార్డు ఉష్ణోగ్రత నమోదు
నాగపూర్ నగరంలో శుక్రవారం ఉష్ణోగ్రత 56 డిగ్రీల సెల్సియస్ కు చేరింది. నాగపూర్ రామదాస్ పేటలోని వెదర్ స్టేషనులో ఈ మేరకు ఉష్ణోగ్రత నమోదైంది. నాగ్ పూర్ ఉష్ణోగ్రత ప్రపంచ రికార్డుకు చేరువకు చేరింది. 1913వ సంవత్సరం జులై 13వతేదీన కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీలో 56.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఇదే ప్రపంచ రికార్డు ఉష్ణోగ్రత. మరోవైపు ఢిల్లీలో ధూళి తుపానుతో పాటు ఎండలు మండుతున్నాయి. ఢిల్లీలోని ముంగేశ్ పూర్ లో శుక్రవారం ఉష్ణోగ్రత 52.9 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.

సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ జనరల్ హెచ్చరిక జారీ
దేశంలో క్యుములస్ మేఘాల కారణంగా చాలా ప్రాంతాల్లో రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీల నుంచి 55 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని సివిల్ డిఫెన్స్ డైరెక్టరేట్ జనరల్ హెచ్చరిక జారీ చేశారు. విపరీతమైన వేడి సమయంలో మాత్రమే ఎయిర్ కండిషనర్‌లను ఉపయోగించుకోవాలని కోరారు.ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల మధ్య బయటకు వెళ్లకండి అని సూచించారు.గ్యాస్ సిలిండర్‌లను ఎండలో ఉంచవద్దని కోరారు. ఉష్ణోగ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు మంచినీరు అధికంగా తాగాలని డీజీ కోరారు.


Tags:    

Similar News