సింగరేణి 2039 తర్వాత కనబడదా ?

బొగ్గుగనుల వేలంపాట సందర్భంగా భట్టి మాట్లాడుతు 2039కి సింగరేణి సంస్ధ మూతపడటం ఖాయమన్నారు.

Update: 2024-06-21 09:16 GMT
Singareni coal mine

సింగరేణి కంపెనీపై ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. బొగ్గుగనుల వేలంపాట సందర్భంగా భట్టి మాట్లాడుతు 2039కి సింగరేణి సంస్ధ మూతపడటం ఖాయమన్నారు. సింగరేణికి కొత్త బొగ్గుగనులను కేంద్రప్రభుత్వం కేటాయించకపోతే సంస్ధ మనుగడే కష్టమైపోతుందన్నారు. తెలంగాణాలోని థర్మల్ విద్యుత్ ఉత్పత్తి మొత్తం బొగ్గు ఆధారంగానే పనిచేస్తున్నట్లు భట్టీ గుర్తుచేశారు. ఇంతటి కీలకమైన సింగరేణి సంస్ధకు కేంద్రప్రభుత్వం బొగ్గును అందుబాటులో లేకుండా చేస్తోందని మండిపోయారు.

శుక్రవారం దేశంలోని 60 బొగ్గు గనుల వేలంపాటను కేంద్ర ప్రభుత్వం మొదలుపెట్టింది. బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్ రెడ్డి వేలంపాటలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి భట్టి కూడా హాజరయ్యారు. ఈ నేపధ్యంలోనే భట్టి మాట్లాడుతు బొగ్గు గనులను కేంద్రప్రభుత్వం సింగరేణి సంస్ధకు నామినేషన్ పద్దతిలో కేటాయించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటుసంస్ధలతో కలిసి వేలంపాటల్లో పాల్గొని బొగ్గు గనులను సొంతంచేసుకోవటం సింగరేణి సంస్ధకు సాధ్యంకాదన్నారు. ఇపుడు 40 గనుల్లో సింగరేణి బొగ్గు తవ్వకాలు జరుపుతున్న విషయాన్ని చెప్పారు. 40 గనుల్లో 22 అండర్ గ్రౌండ్ మైన్స్ అయితే మిగిలిన 18 ఓపెన్ క్యాస్ట్ మైన్స్ ఉన్నాయి.

ఇపుడున్న గనుల్లోని బొగ్గు సుమారు మరో 10 ఏళ్ళ వరకు ఉత్పత్తిని ఇస్తాయి. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో సింగరేణి 70 మిలియన్ టన్నుల బొగ్గును తవ్వకాలు జరిపింది. దేశంలోని స్టీల్, విద్యుత్ ఉత్పత్తి సంస్ధలకు అవసరమైన బొగ్గును చాలావరకు సింగరేణి సంస్ధే సరఫరా చేస్తోంది. సింగరేణికి కొత్త బొగ్గుగనులను కేటాయించకపోతే 2034కి తవ్వకాల సామర్ధ్యం 15 మిలియన టన్నులకు పడిపోతుంది. ఆ తర్వాత అదికూడా తగ్గిపోయి చివరకు సంస్ధ మూతపడటం ఖాయమని నిపుణులు కూడా హెచ్చరిస్తున్నారు. 2015లో నరేంద్రమోడి తీసుకొచ్చిన కమర్షియల్ మైనింగ్ యాక్ట్ పుణ్యామని సింగరేణి సంస్ధ పెద్ద సమస్యల్లో పడిపోతోంది. ఇపుడు మంచిర్యాలలోని శ్రావణపల్లి ఓపెన్ మైన్ ను కేంద్రం వేలంపాటకు పెట్టింది.

శ్రావణపల్లి గనిని సొంతంచేసుకునేందుకు ఎన్ని ప్రైవేటుసంస్ధలు పోటీపడతాయో తెలీదు. సింగరేణి యాజమాన్యం ఏమిచేస్తుందో తెలీదు. తెలంగాణా వ్యక్తే అయ్యుండీ, సింగరేణి గురించి బాగా తెలిసిన కిషన్ రెడ్డి కూడా సంస్ధ ఆయువును తీసేట్లుగా వ్యవహరిస్తున్నారంటు భట్టి మండిపోయారు. వేలంపాటలతో సంబంధంలేకుండా సింగరేణికి సొంతంగా గనులను కేటాయించాలని కోరుతు తొందరలోనే నరేంద్రమోడిని కలవబోతున్నట్లు భట్టి చెప్పారు. మరి మోడి ఏమంటారో, శ్రావణపల్లి గని వేలంపాట ఏమవుతుందో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. 

Tags:    

Similar News