హరీష్ కు బిగ్ రిలీఫ్

హరీష్ పైన నమోదైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టేసింది;

Update: 2025-03-20 07:22 GMT
Big relief for Harish in High Court

మాజీమంత్రి, బీఆర్ఎస్ కీలకనేత తన్నీరు హరీష్ రావుకు బిగ్ రిలీఫ్ దొరికింది. హరీష్ పైన నమోదైన టెలిఫోన్ ట్యాపింగ్ కేసును హైకోర్టు కొట్టేసింది. పిటీషనర్ ఆరోపిస్తున్నట్లుగా హరీష్ కు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు కనిపించలేదని చెప్పి కేసును కొట్టేసింది. ఇంతకీ విషయం ఏమిటంటే పోయిన ఏడాది సిద్ధిపేటకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ లోకల్ పోలీసుస్టేషన్లో ఒక ఫిర్యాదుచేశాడు. ఏమనంటే హరీష్ రావు(Harish Rao), ప్రస్తుతం టెలిఫోన్ ట్యాపింగ్ విచారణలో ఉన్న పోలీసు అధికారి రాధాకిషన్ రావు తన మొబైల్ ఫోన్ ను ట్యాప్(Telephone Tapping) చేసినట్లు చెప్పాడు. తన మొబైల్ ను ట్యాపింగ్ చేయటమే కాకుండా తనను బెదిరించినట్లు ఫిర్యాదులో చెప్పాడు. దాంతో పోలీసులు వెంటనే హరీష్, రాధాకిషన్ తో పాటు మాజీమంత్రి పీఏ వంశీకృష్ణ తదితరులపై కేసులు నమోదు చేశారు.

కేసులు నమోదుచేయటమే కాకుండా వంశీని అరెస్టు కూడా చేశారు. హరీష్ ను విచారణకు రమ్మని నోటీసులు జారీచేయగానే మాజీమంత్రి కోర్టును ఆశ్రయించారు. తనపైన పోలీసులు తప్పుడు కేసు నమోదుచేసి టెలిఫోన్ ట్యాపింగ్ కేసులో ఇరికించేందుకు కుట్ర చేస్తున్నట్లు పిటీషన్లో పేర్కొన్నారు. కేసులో ఇరువైపల వాదనలు విన్న న్యాయమూర్తి గురువారం హరీష్, రాధాకిషన్ పైన నమోదైన కేసులను కొట్టేశారు. హరీష్ కు వ్యతిరేకంగా పిటీషనర్ చక్రధర్ ఎలాంటి ఆధారాలను చూపించలేకపోయినట్లు కోర్టు అభిప్రాయపడింది. అందుకనే కేసును కొట్టేసింది.

తనపైన నమోదైన కేసును కోర్టు కొట్టేయటంతో హరీష్ కు బిగ్ రిలీఫ్ దొరికిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ హయాంలో జరిగిన టెలిఫోన్ ట్యాపింగ్ అంశం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ట్యాపింగ్ లో కీలకంగా వ్యవహరించిన కొందరు పోలీసు ఉన్నతాధికారులను ఇప్పటికే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్(సిట్) అరెస్టుచేసి విచారణ చేస్తోంది. ట్యాపింగ్ లో కీలకపాత్రధారి, అమెరికాకు పారిపోయిన మాజీ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ టీ ప్రభాకరరావును ఎలాగైనా ఇండియాకు రప్పించాలని సీఐడీ, సిట్, సీబీఐ శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి. ఇందులో భాగంగానే సీబీఐ(CBI) రిక్వెస్టు ప్రకారం ఇంటర్ పోల్(Inter pol) అధికారులు ప్రభాకరరావుపై రెడ్ కార్నర్ నోటీసు జారీచేశారు.

ట్యాపింగ్ లో కీలక పాత్రధారి ప్రభాకరరావు అరెస్టయి, విచారణలో పాల్గొంటే ట్యాపింగ్ అసలు సూత్రధారి ఎవరనే విషయం బయటపడుతుంది. మంత్రుల ఆరోపణల ప్రకారం ట్యాపింగ్ అసలు సూత్రధారి కేసీఆరే(KCR). అయితే ఆరోపణలతో పోలీసులు ఎవరిమీదా కేసులు నమోదుచేయలేరు, అరెస్టూ చేయలేరు. అందుకనే ప్రభాకరరావును ఇండియాకు రప్పించేందుకు గట్టిప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలోనే హరీష్ మీద కూడా టెలిఫోన్ ట్యాపింగ్ కేసు నమోదవ్వటంతో పార్టీలో కలకలం రేగింది. ట్యాపింగ్ కేసులో హరీష్ అరెస్టయి, కోర్టు విచారణలో నిర్ధారణ అయితే మాజీ మంత్రికి గట్టి దెబ్బపడుతుందనే అనుకున్నారు. అయితే సరైన సాక్ష్యాలు లేవన్న కారణంతో కేసును కొట్టేయటం హరీష్ కు బిగ్ రిలీఫనే చెప్పాలి.

Tags:    

Similar News