తెలంగాణలో బీహార్ పరిస్థితులు,పర్సంటేజీలతో కూలిపోయిన 4 వంతెనలు

బీహార్ రాష్ట్రంలో వంతెనల పరిస్థితులు తెలంగాణలోనూ పునరావృతమవుతున్నాయా? అంటే అవునని చెప్పవచ్చు.తెలంగాణలో పర్సంటేజీలు,నాణ్యతాలోపాల వల్ల నాలుగు వంతెనలు కూలిపోయాయి.

Update: 2024-07-04 08:00 GMT
గాలి దుమారానికే కుప్పకూలిపోయిన ఓడేడ్ వంతెన గడ్డర్లు...నాణ్యతకు తిలోదకాలు

బీహార్ రాష్ట్రంలో కేవలం గత 15 రోజుల్లో నిర్మాణంలో ఉన్నవి, పాతవి, కొత్తవి తేడా లేకుండా తొమ్మిది వంతెనలు కూలిపోయాయి. బుధవారం ఒక్క రోజే మూడు వంతెనలు కూలాయి. నిర్మాణంలో నాణ్యతా లోపాల వల్ల బీహార్ రాష్ట్రంలో వరుసగా వంతెనలు కూలిపోతున్నాయి.

- వంతెనలు కూలిపోతున్న బీహార్ రాష్ట్రం జాడ్యం తెలంగాణ రాష్ట్రానికి కూడా వ్యాపించింది. నాణ్యత లోపాలు, ఇంజినీరింగ్ అధికారుల పర్సంటేజీలు, కాంట్రాక్టరు నిర్లక్ష్యం కారణంగా పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం ఓడేడ్ గ్రామంలో మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన కుప్పకూలిపోయింది.
- జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం గర్మిళ్లపల్లి - పెద్దపల్లి జిల్లా ఓడేడ్ గ్రామాల మధ్య దూరాన్ని తగ్గించేందుకు మానేరు నదిపై నిర్మిస్తున్న వంతెన కేవలం మూడు నెలల కాలంలోనే రెండు సార్లు కూలిపోయింది.

గాలి దుమారానికి కూలిన ఐదు గడ్డర్లు
జులై 2వతేదీ మంగళవారం రాత్రి ఈ వంతెన ఐదు గడ్డర్లు పెద్ద శబ్ధంతో కూలిపోయాయి.గర్మిళ్లపల్లి వైపు వంతెన 17,18 నంబరు పిల్లర్లపై ఉన్న ఐదు గడ్డర్లు కూలిపోయినపుడు రాత్రి కావడంతో ఎవరూ జనం లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. గాలి దుమారానికి వంతెన గడ్డర్లు కూలిపోయాయని ఇంజినీర్లు చెబుతున్నారు. గాలి దుమారానికే వంతెన గడ్డర్లు కూలిపోతే వాగులో వరద నీటి మట్టం పెరిగితే వంతెన పరిస్థితి ఏమిటని ఓడేడ్, గర్మిళ్లప్లి గ్రామాల ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నీటి ప్రవాహంతో కూలిన గడ్డర్లు
ఈ ఏడాది ఏప్రిల్ 22వతేదీన అర్దరాత్రి గాలిదుమారానికి ఓడేడ్ వంతెన 1,2 పిల్లర్లలో మూడు మూడు గడ్డర్లు కిందపడ్డాయి. మానేరు వాగు ఉద్ధృతంగా ప్రవహించడంతో గడ్డర్లకు సపోర్టుగా ఉన్న చెక్కలు దెబ్బతిన్నాయి. దీంతో మూడు గడ్డర్లు కూలిపోయాయి. వంతెన నిర్మాణంలో నాణ్యతా లోపం వల్లనే గడ్డర్లు కూలిపోతున్నాయని స్థానిక ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

ఎనిమిదేళ్లుగా వంతెన నిర్మాణ దశలోనే...
మానేరు వాగుపై రూ.49 కోట్లతో వంతెన నిర్మాణానికి 2016లో అప్పటి మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఈటెల రాజేందర్ శంకుస్థాపన చేశారు. వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఎనిమిదేళ్లు గడిచినా పనులు పూర్తి కాలేదు.పెదపల్లి జిల్లాలో మూడు నెలల్లో నిర్మాణంలో ఉన్న వంతెన రెండోసారి కూలిపోయింది. ఓడేడ్ సమీపంలో మానేరు నదిపై నిర్మిస్తున్న హైలెవల్ వంతెన రెండో సారి కూలిపోవడంతో దీనిపై ఇంజినీరింగ్ అధికారులు దృష్టి సారించారు.2016లో వంతెనకు పునాది వేసినా ఎనిమిదేళ్లు గడుస్తున్నా పనులు నత్తనడకన సాగుతున్నాయి.

ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన గంగాపూర్ వంతెన

ప్రారంభానికి ముందే కొట్టుకుపోయిన వంతెనలు
గతంలో ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో కడెం వాగుపై నిర్మించిన రెండు వంతెనలు వరదలకు కొట్టుకుపోయాయి. గంగాపూర్ -సోమవార్ పేట్ గ్రామాలను కలిపేలా కడెం నదిపై నిర్మించిన గంగాపూర్ బ్రిడ్జి చిన్న వర్షానికే కొట్టుకుపోయింది. కడెం నదిపై పసుపుల- పెంబి గ్రామాలను కలిపేలా నిర్మించిన పసుపుల వంతెన ప్రారంభించక ముందే వరదనీటికి కొట్టుకుపోయింది. రెండు వంతెనలు నిర్మాణం అయినా ప్రారంభించక ముందే కొట్టుకుపోయాయంటే ఆయా వంతెనలను ఎంత నాణ్యతగా నిర్మించారో విదితమవుతుందని ఖానాపూర్ ప్రాంత సోషల్ యాక్టివిస్టు బుర్రా రమేష్ గౌడ్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గతంలో ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పర్సంటేజీల వల్లనే కాంట్రాక్టరు వంతెనల నిర్మాణ పనులు నాణ్యతగా చేయనందువల్ల అవి కూలిపోయాయని రమేష్ గౌడ్ ఆరోపించారు.

నిర్మించిన మూడు నెలలకే వరదనీటికి కొట్టుకుపోయిన పసుపుల బ్రిడ్జి

వంతెన నిర్మాణంలో నాణత్యతకు తిలోదకాలు
గత సంవత్సరం వరదల్లో వంతెన బీమ్‌లు, పిల్లర్లు కొట్టుకుపోవడంతో పనుల నాణ్యతపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంజినీరింగ్ అధికారుల నిర్వాకం, కాంట్రాక్టరు నిర్లక్ష్యం, నాణ్యతా లోపాల వల్లనే వంతెన పిల్లర్లు కొట్టుకుపోయాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ, ఇంజినీరు అయిన సోమ శ్రీనివాసరెడ్డి ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు.ఓడేడ్‌ సమీపంలో మానేరు నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కుప్పకూలడానికి కాంట్రాక్టర్‌ నాసిరకం పనులు, ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. అందువల్లనే మూడు నెలల వ్యవధిలో రెండోసారి వంతెన కూలిపోయిందన్నారు.

ప్రభుత్వ నిర్మాణ పనుల్లో 20 శాతం పర్సంటేజీలు
తెలంగాణ రాష్ట్రంలో రోడ్లు భవనాలశాఖ, పంచాయితీరాజ్, ఇతర ప్రభుత్వ శాఖల ఇంజినీర్లు చేపట్టిన వంతెనలు, రోడ్లు, భవనాల నిర్మాణ పనుల్లో 20 శాతం ప్రజాప్రతినిధులు, ఇంజినీరింగ్ అధికారుల పర్సంటేజీలకే పోతున్నాయని హైదరాబాద్ కుచెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి, ఇంజినీరు సోమ శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. వివిధ ప్రభుత్వ పనుల అంచనా వ్యయంలో 20 శాతం పర్సంటేజీలకే పోతే కాంట్రాక్టర్లు పనులను నాణ్యతగా ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. పనులు పూర్తి అయ్యాక బిల్లులు ఇవ్వాలంటే 8 శాతం పర్సంటేజీని కాంట్రాక్టర్లు ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమర్పించుకోవాల్సి వస్తుందని ఆయన వివరించారు. దీనివల్లనే నాణ్యత లోపాల వల్ల వంతెనలు కూలిపోతున్నాయని చెప్పారు.

విచారణ జరపాలి : స్థానికులు
కూలిపోయిన ఓడేడ్ వంతెనను స్థానికులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు బుధవారం పరిశీలించారు. నాసిరకం పనుల వల్లే వంతెన కూలిపోయిందని వారు ఆరోపించారు. కాంట్రాక్టర్ నిర్మాణాలకు నాసిరకం మెటీరియల్‌ను ఉపయోగించారని స్థానిక ప్రజలు తెలిపారు. ఈ వంతెన కూలిపోవడానికి ఇంజినీర్లు, రోడ్డు భవనాల శాఖ అధికారుల నిర్లక్ష్యం కూడా ఉందన్నారు. అధికారులు నిర్మాణంపై నిఘా ఉంచి నాణ్యతతో పనులు త్వరితగతిన పూర్తి చేసి ఉంటే ఈ దుర్ఘటన జరిగేది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కాంట్రాక్టర్‌, ప్రభుత్వ ఇంజినీరింగ్ అధికారులపై విచారణ జరిపి, వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్‌ చేశారు.


Tags:    

Similar News