కేసీయార్ సెంటిమెంటునే ‘సిక్స్’ కొడుతున్న రేవంత్

సెంటిమెంటుతో పాటు వాస్తు, పూజలు, హోమాలు, యజ్ఞాలు పదేళ్ళల్లో చాలానే చేయించారు.

Update: 2024-07-06 06:09 GMT
BRS MLAs joined Congress

రాజకీయాలు, వ్యాపారాలు రంగం ఏదైనా కానీండి సెంటిమెంట్లు ఎక్కువగానే ఉంటాయి. అధికారం, డబ్బున్న ప్రతిచోటా సెంటిమెంట్లను జనాలు బాగా నమ్ముతారు. అయితే సెంటిమెంటుకు మించిన విషయం మరోటుందన్న విషయాన్ని అందరు మరచిపోతారు.. దాన్నే తలరాత అంటారు. ఎవరికైనా సరే ఎప్పుడు ఏది ఎలా జరగాలని రాసిపెట్టుంటే అలాగే జరుగుతుందన్నది వేదాంతం. నమ్మేవాళ్ళు తలరాతనూ నమ్ముతారు, మరికొందరు తలరాతతో పాటు సెంటిమెంట్లను కూడా నమ్ముతారు. ఇపుడిదంతా ఎందుకంటే తిరగబడిన కేసీయార్ తలరాత, సెంటిమెంట్ల గురించే.

కేసీయార్ కు సెంటిమెంటు రీత్యా బాగా అచ్చొచ్చిన సంఖ్య 6 అన్న విషయం అందరికీ తెలిసిందే. సెంటిమెంటుతో పాటు వాస్తు, పూజలు, హోమాలు, యజ్ఞాలు పదేళ్ళల్లో చాలానే చేయించారు. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సెక్రటేరియట్, పార్టీ ఆఫీసు, ప్రగతిభవన్ కు చేయించిన వాస్తు మార్పులు, ఫాం హౌస్ లో చేయించిన పూజలు, హోమాలు, యజ్ఙాలు ఏవి కూడా ఓటమినుండి కేసీయార్ను కాపాడలేకపోయాయి. దీన్నిబట్టి మనకు ఏమి అర్ధమవుతున్నదంటే తలరాత తిరగబడింది కాబట్టే ఏ సెంటిమెంటు కూడా వర్కవుట్ కాలేదని. తలరాత బాగుంది కాబట్టే పదేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేశారు. అధికారంలో ఉన్నపుడు ఏమిచేసినా చెల్లుబాటైపోయింది. అదే తలరాత తిరగబడింది కాబట్టే ఏ పూజలు, హోమాలు, వాస్తు మార్పులు ఏమిచేసినా ఓటమి తప్పలేదు. కేసీయార్ సెంటిమెంటుగా 6 సంఖ్యను బాగా నమ్ముతారు.

ఆ సెంటిమెంటు ప్రకారమే మొన్నటి ఎన్నికల్లో అభ్యర్ధుల జాబితాలో మొదట ఆరుగురి పేర్లను మాత్రమే ప్రకటించారు. బహిరంగసభలు ఆరోవతేదీనే మొదలుపెట్టారు. రాష్ట్రపర్యటనను 6వ తేదీన ప్రారంభించారు. అభ్యర్ధుల ప్రకటనకు కూడా కేసీయార్ 6వ తేదీనే చేశారు. ఏపనిచేసినా, ఏ కార్యక్రమం చేపట్టినా 6 ఉండేట్లుగా జాగ్రత్తలు తీసుకునే వారు. ఇపుడా సెంటిమెంటునే అస్త్రంగా రేవంత్ రెడ్డి రివర్సులో కేసీయార్ మీదకు ప్రయోగిస్తున్నారు. అంటే, మొన్నటి ఎన్నికల్లో కేసీయార్ ఓటమితో సెంటిమెంటు కూడా తిరగబడిందని అర్ధమవుతోంది. ఇప్పటికి బీఆర్ఎస్ కు చెందిన 6 మంది ఎంఎల్ఏలను కాంగ్రెస్ లో చేర్చుకున్నారు. ఒకేసారి 6 మంది ఎంఎల్సీలను కాంగ్రెస్ లోకి లాక్కున్నారు. రెండో విడతగా మరో 6మంది ఎంఎల్ఏలను చేర్చుకోబోతున్నారట. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఆరుగురు ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరటానికి రెడీగా ఉన్నారని మంత్రులు బహిరంగ ప్రకటనలు చేశారు.

ఇదంతా చూసిన తర్వాత కేసీయార్ సెంటిమెంటును రేవంత్ రెడ్డి ‘సిక్స్’ కొడుతున్నట్లు అర్ధమవుతోంది. రేవంత్ కొడుతున్న సిక్స్ లేదా ఫోర్ ను ఆపటానికి కనీసం బీఆర్ఎస్ లో ప్రయత్నాలు కూడా జరగటంలేదు. ఒకవైపు ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో కేసీయార్ సమావేశం జరుపుతునే ఉన్నారు మరోవైపు బీఆర్ఎస్ నుండి వెళ్ళిపోయి కాంగ్రెస్లో చేరిపోతునే ఉన్నారు. ఈనెల చివరలో మొదలవ్వబోయే అసెంబ్లీ, శాసనమండలి బడ్జెట్ సమావేశాల్లోగానే బీఆర్ఎస్ ను ఎంత వీలుంటే అంతా ఖాళీచేయాలని రేవంత్ టార్గెట్ పెట్టుకున్నారు. అందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. అందుకనే మొదట ఒకళ్ళిద్దరితో మొదలైన చేరికలు ఇపుడు గ్రూపులకు చేరుకున్నది. అసెంబ్లీ, మండలిలో బీఆర్ఎస్ ను నామమాత్రం చేసేయటమే రేవంత్ తక్షణ కర్తవ్యంగా పెట్టుకున్నారు. మొత్తంమీద కేసీయార్ నమ్ముకున్న సెంటిమెంటును రివర్సులో ప్రయోగించి దెబ్బతీయటమే లక్ష్యంగా రేవంత్ పావులు కదుపుతున్నారు. చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News