సుప్రీం కోర్టుకి కవిత కేసు.. ఢిల్లీలోనే కేటీఆర్, హరీష్

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Update: 2024-07-05 14:21 GMT

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత తీహార్ జైల్లో జుడీషియల్ కస్టడీలో ఉన్నారు. శుక్రవారం ఉదయం ఆమెని కలిసేందుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీ వెళ్లారు. తీహార్ జైల్లో ఉన్న కవితతో ములాఖత్ అయ్యారు. ఈడీ, సీఐడీ కేసుల్లో ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను హై కోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై కవిత కుటుంబసభ్యులు దృష్టి సారించారు.

సుప్రీం కోర్టులో బెయిల్ పిటిషన్ వేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టులో వేయనున్న బెయిల్ పిటీషన్ పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో కేటీఆర్, హరీష్ లు చర్చలు జరుపుతున్నారు. సుప్రీం కోర్టు సెలవులు ముగియగానే కవిత బెయిల్ పిటిషన్ వేయనున్నారు. సోమవారం పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అప్పటివరకు కేటీఆర్, హరీష్ రావులు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదులతో సమన్వయం చేసుకోనున్నారు. కాగా, ములాఖత్ లో కవితతో మాట్లాడిన ఇద్దరు నేతలు ఆమెని ధైర్యంగా ఉండాలని సూచించారు. న్యాయవ్యవస్థ పైన పూర్తి నమ్మకం ఉందని, త్వరలోనే బెయిల్ లభిస్తుందని ఇరువురు భరోసా వ్యక్తం చేశారు.

'కవిత నిస్సహాయ మహిళ కాదు'...

లిక్కర్ కేసులో అరెస్టైన కవిత దాదాపు నాలుగు నెలలుగా తీహార్ జైల్లోనే గడుపుతున్నారు. ఈడీ, సీబీఐ కేసుల్లో ఆమె వేసిన బెయిల్ పిటిషన్లను ఈ నెల 1 న ఢిల్లీ హైకోర్టు తోసిపుచ్చింది. అంతేకాదు, మహిళ అనే కారణంతో కవితపై సానుభూతి చెప్పలేమని తేల్చి చెప్పేసింది. విద్యావంతురాలిగా, పలుకుబడి కలిగిన మహిళగా ఆమె చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన విషయాన్ని గుర్తుంచుకోవాలంటూ చురకలంటించింది.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో కవితకి బెయిల్ ఇవ్వాలా? వద్దా? అనే అంశం ఆమెకు వ్యతిరేకంగా ఉన్న సాక్ష్యాలపై ఆధారపడి ఉంటుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈ కేసులో ప్రధాన కుట్రదారుల్లో కవిత కూడా ఒకరని, మరికొందరు నిందితులు కూడా ఆమె తరపునే పని చేసినట్లు తేలిందని కోర్టు వెల్లడించింది. ఈ క్రమంలో ఆమెని నిస్సహాయ మహిళగా భావించలేమంటూ... కవిత బెయిల్ పిటిషన్లను న్యాయస్థానం రిజెక్ట్ చేసింది.

Tags:    

Similar News