‘ఆ ఇద్దరు’ ఎవరో తెలీక టెన్షన్ పెరిగిపోతోందా ?
ఆది శ్రీనివాస్ మాట్లాడుతు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ఎంఎల్ఏలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెప్పారు.
గులాబీ పార్టీకి రేవంత్ రెడ్డి ఊపిరి ఆడనీయటంలేదు. ఎంఎల్ఏల్లో రోజుకొకళ్ళని, ఒక్కోరోజు గ్రూపును కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. దాంతో ఏరోజు ఏ ఎంఎల్ఏ, ఏ ఎంఎల్సీ బీఆర్ఎస్ ను వదిలేసి కాంగ్రెస్ లో చేరుతారో తెలీక పార్టీ అధినేత కేసీయార్లో టెన్షన్ పెరిగిపోతోంది. తాజా సమాచారం ఏమిటంటే మరో ఆరుగురు ఎంఎల్ఏలు కారుదిగి హస్తంగూటికి చేరటానికి రెడీగా ఉన్నారట. మూడురోజుల క్రితమే ఆరుగురు ఎంఎల్సీలు కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆరుగురు ఎంఎల్ఏలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతు ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాలతో పాటు గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ఎంఎల్ఏలు తొందరలోనే కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు చెప్పారు.
ఇపుడు విషయం ఏమిటంటే ఆది శ్రీనివాస్ చెప్పింది నిజమే అయితే ఎంఎల్ఏలపై చాలావరకు క్లారిటి వచ్చినట్లే. ఎలాగంటే ఆదిలాబాద్, మహబూబ్ నగర్ జిల్లాల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచింది ఇద్దరేసి ఎంఎల్ఏలే. ఆదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్ ఎంఎల్ఏగా కోవా లక్ష్మి, బోథ్ ఎంఎల్ఏగా అనీల్ జాదవ్ ఉన్నారు. అలాగే మహబూబ్ నగర్ జిల్లాలో గద్వాలలో బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, అలంపూర్ ఎంఎల్ఏ విజయుడు ఉన్నారు. కాంగ్రెస్ ఎంఎల్ఏ ఆది పై జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు అన్నారు కాబట్టి నలుగురు ఎంఎల్ఏలు కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు కారుపార్టీ నేతలకు క్లారిటి వచ్చింది. అయితే ఇదే సమయంలో గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ఎంఎల్ఏలని చెప్పారు. ఇక్కడే గులాబీ నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఎందుకంటే గ్రేటర్ పరిధిలోని 24 అసెంబ్లీ సీట్లలో బీఆర్ఎస్ 16 సీట్లను గెలిచింది. ఇందులో ఖైరతాబాద్ ఎంఎల్ఏ దానం నాగేందర్ ఇప్పటికే కాంగ్రెస్ లో చేరారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలిచింది. కాబట్టి బీఆర్ఎస్ బలం 14కి పడిపోయింది. 14 మందిలో కాంగ్రెస్ లో చేరబోయే ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరనే విషయమై బీఆర్ఎస్ పార్టీలో చర్చలు మొదలయ్యాయి. ఏ ఎంఎల్ఏ అయినా కాంగ్రెస్ కండువా కప్పుకునేంతవరకు తాను బీఆర్ఎస్ లోనే ఉంటాననే చెబుతారు. ఇప్పటివరకు కాంగ్రెస్ లో చేరిన ఎంఎల్ఏలు చెప్పింది ఇదే. మెదక్ జిల్లాలోని సునీతా లక్ష్మారెడ్డి, మాణిక్ రావు, కొత్తా ప్రభాకరరెడ్డి, రాజేంద్రనగర్ ఎంఎల్ఏ ప్రకాష్ గౌడ్, పటాన్ చెరు ఎంఎల్ఏ గూడెం మహిపాల్ రెడ్డితో పాటు కొందరు ఇప్పటికే రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. వీరిలో ఎంతమంది కాంగ్రెస్ లో చేరుతారో పార్టీ పెద్దలకు అర్ధంకావటంలేదు. అలాగే ఎల్బీనగర్ ఎంఎల్ఏ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, కుకట్ పల్లి ఎంఎల్ఏ మాధవరం కృష్ణారావు, శేరిలింగంపల్లి ఎంఎల్ఏ ఆరెకపూడి గాంధీ, గోషామహల్ ఎంఎల్ఏ ముఠా గోపాల్, చేవెళ్ళ ఎంఎల్ఏ సబితా ఇంద్రారెడ్డి కూడా కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది.
రేవంత్ తో భేటీ అయిన వాళ్ళను, ప్రచారంలో ఉన్న వాళ్ళలో ఎవరిని అనుమానించాలో తెలీక, ఎవరిపై నిఘా ఉంచాలో తెలీక కేసీయార్ అవస్తలు పడుతున్నారు. పై ఎంఎల్ఏల్లో ఎవరిని కదిలించినా తాము కాంగ్రెస్ లో చేరటంలేదని బీఆర్ఎస్ లోనే ఉంటామని గట్టిగా చెబుతున్నారు. కానీ వీళ్ళంతా రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులన్న విషయం తెలిసిందే. పైగా అందరికీ రియల్ ఎస్టేట్ తో పాటు రకరకాల వ్యాపారాలున్నాయి. కాబట్టి తమ వ్యాపారాలను రక్షించుకోవటానికైనా వీళ్ళంతా కాంగ్రెస్ లో చేరటం ఖాయమనే చర్చ కారుపార్టీలో జరుగుతోంది. సరే ఈ విషయాలు ఎలాగున్నా తొందరలో కాంగ్రెస్ లో చేరబోయే ఆరుమంది ఎంఎల్ఏల్లో గ్రేటర్ పరిధిలోని ఇద్దరు ఎంఎల్ఏలు ఎవరనే విషయంలో కారుపార్టీలో టెన్షన్ పెరిగిపోతోందట. మరీ విషయంలో ఎప్పటికి క్లారిటి వస్తుందో చూడాలి. కొసమెరుపు ఏమిటంటే గ్రేటర్ మున్సిపాలిటి సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు పార్టీకి ఆఫీసులో గురువారం మీటింగ్ జరిగింది. ఈ మీటింగ్ చాలా ఇంపార్టెంట్ అని పార్టీ నుండి ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, కార్పొరేటర్లందరికీ సమాచారం అందింది. తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కీలకమైన సమావేశానికి ఏడుగురు ఎంఎల్ఏలు, 8మంది కొర్పొరేటర్లు డుమ్మాకొట్టారు. దీంతో వీళ్ళంతా ఎందుకు గైర్హాజరయ్యారో కేసీయార్ కు అర్ధంకావటంలేదు.