రేవంత్ కలిశారు... అమిత్ షాపై కేసు కొట్టేశారు..!!
పార్లమెంటు ఎన్నికల సమయంలో హైదరాబాద్ పర్యటనకి వచ్చిన అమిత్ షా పై కేసు నమోదైంది.
పార్లమెంటు ఎన్నికల సమయంలో హైదరాబాద్ పర్యటనకి వచ్చిన అమిత్ షా పై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో ఆయన కోడ్ ఉల్లంఘించారంటూ పాతబస్తీలో కేసు నమోదైంది. శనివారం మొఘల్ పురా పోలీసులు ఈ కేసుని ఉపసంహరించారు. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని, అందుకే కేసు కొట్టేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అమిత్ షా కేసు కొట్టేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు విమర్శలు కురిపిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఉన్న బంధానికి ఇది మరొక ఉదాహరణ అంటున్నారు.
'కాంగ్రెస్, బీజేపీ చీకటి పొత్తు'..
మరోసారి కాంగ్రెస్, బీజేపీల అక్రమసంబంధం బయటపడిందని బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ వేదికగా తమ అధికారిక ఖాతాలో పోస్టు పెట్టింది. "రేవంత్ ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే అమిత్ షా పై పాతబస్తీలో నమోదైన కేసు ఉపసంహరణ చేశారు. సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ తమ చీకటి పొత్తును కొనసాగిస్తూనే ఉంది. మొన్న సింగరేణి బొగ్గు గనులు వేలంకు బీజేపీకి మద్దతు, రాష్ట్రంలో కాంగ్రెస్ చేస్తున్న అరాచక పాలనను ప్రశ్నించకుండా బీజేపీ మౌనం వహిస్తోంది. ఇప్పుడు కేసు కొట్టివేత. ఇలా కాంగ్రెస్, బీజేపీ ఒకరికొకరు సహకరించుకుంటూ తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు" అంటూ బీఆర్ఎస్ విమర్శించింది.
అమిత్ షా పై కేసు ఎందుకు నమోదైంది?
పార్లమెంటు ఎన్నికల సమయంలో అమిత్ షా తెలంగాణ పర్యటనకి వచ్చారు. మే 1న హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతకి మద్దతుగా ఓల్డ్ సిటీలో ప్రచారంలో పాల్గొన్నారు. ప్రచార సభలో మాధవీలత మాట్లాడుతుండగా వేదికపైకి ఇద్దరు బాలికలు వచ్చారు. ఆ ఇద్దరినీ అమిత్ షా దగ్గరకి రమ్మని సైగ చేశారు. చిన్నారులు ఇద్దరూ షా వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఇద్దరు బాలికల్లో ఒకరి చేతిలో కమలం గుర్తు ఉన్న బ్యానర్, మరొకరి చేతిలో అబ్ కీ బార్ 400 అని రాసి ఉన్న ప్లకార్డులు ఉన్నాయి. ఈ ఘటనపై సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
ఈ నేపథ్యంలో అమిత్ షా ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారంటూ బీజేపీ నేతలపై కాంగ్రెస్ పీసీసీ ప్రెసిడెంట్ జీ.నిరంజన్ ఎన్నికల కమిషన్ కి కంప్లైంట్ చేశారు. పరిశీలించిన ఈసీ విచారణ జరపాలంటూ హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కి ఆదేశాలు జారీ చేసింది. దీంతో పోలీసులు మొఘల్ పుర పోలీస్ స్టేషన్లో సెక్షన్ 188 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు. యమాన్ సింగ్ A1, మాధవీ లత A2, అమిత్ షా A3, కిషన్ రెడ్డి A4, రాజాసింగ్ A5 లతో పాటు పలువురిపై కేసు నమోదైంది. ఉద్దేశపూర్వకంగా కోడ్ ఉల్లంఘించలేదని శనివారం ఈ కేసుని కొట్టేశారు.