రేవంత్ ‘పాజిటివ్’ ప్రచార వ్యూహంలో ప్రతిపక్షాలు చిత్తయ్యాయా ?
తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఎక్కువగా రేవంత్, మంత్రులు ప్రచారం చేస్తున్నారు
మామూలుగా ఎన్నికలంటే పార్టీలు ఒకదానిపై మరొకటి దుమ్మెత్తిపోసుకోవటమే మనకు తెలుసు. అయితే ఇపుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికలో(Jubilee Hills by poll) ప్రచారం కాస్త పాజిటివ్ గా జరుగుతోంది. బీఆర్ఎస్(BRS) ప్రచారంలో నేతలు కాంగ్రెస్-బీజేపీల మీద విరుచుకుపడుతున్నారు. అలాగే బీజేపీ(Telangana BJP) ప్రచారంలో కాంగ్రెస్-బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారు. కాని కాంగ్రెస్ ప్రచారంలో ఎక్కడా బీఆర్ఎస్ గురించి ప్రస్తావన కూడా ఉండటంలేదు. స్టార్ క్యాంపెయినర్ గా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) లేదా మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh), ఎంఎల్ఏలు, ఎంపీలు, ఎంఎల్సీలు ప్రచారం చేస్తున్నారు. తమ ప్రచారంలో ఇటు బీజేపీ అటు బీఆర్ఎస్ గురించి ఎక్కడా ప్రస్తావించటంలేదు. తన ప్రచారాన్ని పూర్తిగా ప్రభుత్వం అములుచేస్తున్న సంక్షేమపథకాలపైనే దృష్టిపెట్టారు.
ఇదేసమయంలో బీఆర్ఎస్, బీజేపీలు మాత్రం రేవంత్ ప్రభుత్వాన్ని పదేపదే ఆరోపణలతో దుమ్మెత్తిపోస్తున్నాయి. కాంగ్రెస్+ఏఐఎంఐఎం పార్టీలు రెండింటిపై తీవ్రస్ధాయిలో ఆరోపణలను గుప్పిస్తున్నాయి. మామూలుగా అయితే కాంగ్రెస్ కూడా ప్రతిపక్షాలపై అంతేస్ధాయిలో ఆరోపణలతో విరుచుకుపడాలి. కాని ఆశ్చర్యంగా ప్రతిపక్షాలు ఊసు ఎత్తకుండా ముఖ్యంగా బీఆర్ఎస్ అభ్యర్ధి మాగంటి సునీత, బీజేపీ అభ్యర్ధి లంకల దీపక్ రెడ్డి గురించి కనీసమాత్రంగా కూడా ఎక్కడా ప్రస్తావించటంలేదు. తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపైనే ఎక్కువగా రేవంత్, మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి పాజిటివ్ ప్రచారం వెనుక పెద్ద కథే ఉంది.
మామూలుగా రేవంత్ స్ట్రాటజీ ఎలాగుంటుందంటే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఈపాటికే నానా మాటలు అనుండాలి. ఎందుకంటే పార్టీ అధినేత అయ్యుండి కూడా ఇప్పటివరకు అభ్యర్ధి మాగంటి సునీత తరపున ఒక్కసారి కూడా ప్రచారంచేయలేదు. మిగిలిన పదిరోజుల్లో ప్రచారానికి వస్తారన్న సూచనలు కూడా లేవు. ఎందుకంటే వచ్చేనెల 9వ తేదీ సాయంత్రంతో ముగియబోతున్న ప్రచారంలో రోడ్డుషోలకు కేటీఆర్ షెడ్యూల్ ను పార్టీ విడుదలచేసిందే కాని ఎక్కడా కేసీఆర్ ఊసులేదు. అభ్యర్ధిగా నిలబెట్టి సునీతను కేసీఆర్ గాలికొదిలేశారంటు ఈపాటికి రేవంత్ నానా గోలచేసుండాలి. అయితే ఆశ్చర్యంగా రేవంత్ ఎక్కడా కేసీఆర్ ప్రస్తావనే తేవటంలేదు. ఇందుకు మూడు కారణాలు కనబడుతున్నాయి. మొదటిది తాను అనవసరంగా పేరు ప్రస్తావించి కేసీఆర్ కు ప్రచారం చేయటం ఎందుకని ఆలోచించుండాలి. రెండో కారణం దివంగత ఎంఎల్ఏ మాగంటి గోపీనాధ్ తో రేవంత్ కు బాగా సన్నిహితముంది. మూడో కారణం ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారంచేసుకుని జనాలతో ఓట్లు వేయించుకోవాలని అయ్యుండచ్చు.
పార్టీల దిగజారుడు రాజకీయాలతో, ఆరోపణలు, ప్రత్యారోపణలతో తెలంగాణ రాజకీయాలు రోతగా తయారయ్యాయి. ప్రభుత్వంచేస్తున్న మంచిలో కూడా చెడే వెదకటానికి ప్రతిపక్షాల నేతలు అలవాటుపడిపోయారు. అందుకనే సగటు జనాలకు రాజకీయాలంటేనే కంపుకొడుతున్నాయి. పార్టీలన్నీ పెయిడ్ బ్యాచులను పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ఘోరంగా బురదచల్లేసుకుంటున్నాయి.
ఈనేపధ్యంలో రేవంత్ మూడో స్ట్రాటజీ బాగా వర్కవుటవుతున్నట్లు అనిపిస్తోంది. రేవంత్ ప్రచారం పూర్తిగా పాజిటివ్ గానే సాగుతోంది. బహుశా గెలుస్తామన్న భరోసా కూడా రేవంత్ తో పాజిటివ్ ప్రచారం చేయిస్తుండచ్చు. ఎలాగంటే పార్టీవర్గాల సమాచారం ప్రకారం నియోజకవర్గంలో వివిధ పథకాల లబ్దిదారులు సుమారు లక్ష కుటుంబాలున్నాయి. 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ పథకం అందుకుంటున్న కుటుంబాలు 25,925 ఉన్నాయి. రు. 500కే గ్యాస్ అందుకుంటున్న కుటుంబాలు 19,658 ఉన్నాయి. ఇక ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణంగురించి చెప్పాల్సిన అవసరమే లేదు. హైదరాబాదు నుండే ఇప్పటివరకు సుమారు కోటిన్నర మంది మహిళలు ప్రయాణంచేసుంటారు. నియోజకవర్గం పరిధిలో ఉచితంగా మహిళలు ప్రయాణంచేయటం వల్ల రు. 120 కోట్లు ఆదా అయినట్లు ప్రభుత్వం లెక్కకట్టింది. రు. 120 కోట్లు ఆదా అయ్యిందంటే ఎంతమంది ప్రయాణంచేసుంటారు ? ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణంచేసేదంతా మధ్య, దిగువతరగతి, పేద మహిళలే కదా.
ఇదేసమయంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ఇప్పటివరకు ప్రభుత్వం నియోజకవర్గంలో 14,197 కొత్త రేషన్ కార్డులు మంజూరుచేసింది. అలాగే ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో అదనంగా 8,123 మందిని యాడ్ చేసింది. ప్రతి రేషన్ కార్డుకు ప్రభుత్వం ఆరు కిలోల చొప్పున సన్నబియ్యాన్ని ఇస్తోంది. సన్నబియ్యాన్ని రేషన్ లబ్దిదారులే ఇపుడు వాడుకుంటున్నారు. సన్నబియ్యం పంపిణీలో ప్రభుత్వానికి పేదల్లో మంచి ఇమేజి వచ్చింది. అలాగే ఆరోగ్యశ్రీని రు. 10 లక్షల నుండి రు. 25 లక్షలకు పెంచింది. ఈ పథకం కూడా పేదలను ఉద్దేశించి అమలుచేస్తున్నదే.
నియోజకవర్గంలో ఎక్కువ ప్రాంతం బస్తీలనే చెప్పాలి. బస్తీల్లో నివసించేవారిలో అత్యధికులు పేదలే. అందుకనే రేవంత్ కూడా తన ప్రచారంలో ఎక్కువగా సంక్షేమ పథకాల గురించే మాట్లాడుతున్నారు. మంత్రులు, ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతల ప్రచారంలో కూడా సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించే ప్రచారం చేయమని పదేపదే చెబుతున్నారు. పాజిటివ్ ప్రచారం వల్ల చాలా ఉపయోగాలుంటాయని రేవంత్ కు ఇప్పటికైనా అనిపించటం సంతోషమే కదా. ప్రభుత్వం చేస్తున్న మంచిని, అభివృద్ధిని ప్రచారం చేసి జనాలను ఓట్లడగాలని రేవంత్ స్పష్టంగా అందరినీ ఆదేశించాడు. పాజిటివ్ ప్రచారం అభ్యర్ధి వల్లాల నవీన్ యాదవ్ గెలుపుకు ఏ మేరకు దోహడపడుతుందో చూడాల్సిందే.
గెలుపుకు రేవంత్ కు చాలెంజ్ : చలసాని
అధికారంలోకి వచ్చి రెండేళ్ళవుతోంది కాబట్టి తాము అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధిని ప్రజలకు చెప్పటం కోసమే పాజిటివ్ గా ప్రచారం చేయటం మంచి పరిణామమే అని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర అబిప్రాయపడ్డారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ప్రచారంలో రేవంత్ కొత్త ప్రయోగం చేస్తున్నాడ’’ని అన్నారు. ‘‘తనదైన స్టైల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించి సీటును గెలుచుకోవాలనే వ్యూహంలో రేవంత్ ఉన్నాడ’’ని చలసాని అనుమానం వ్యక్తంచేశారు. ‘‘వ్యూహం ఏదైనా ప్రత్యర్ధులపై బురదచల్లకుండా పాజిటివ్ ప్రచారం మంచి పరిణామమే’’ అని చలసాని అభిప్రాయపడ్డారు.