మంత్రిగా ప్రమాణస్వీకారంచేసిన ‘ఒకే ఒక్కడు’ అజహర్
ఒక్కడి కోసమే ప్రత్యేకించి మంత్రివర్గ విస్తరణ జరగటం బహుశా తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారేమో.
ప్రముఖ క్రికెటర్, కాంగ్రెస్ సీనియర్ నేత మహమ్మద్ అజహరుద్దీన్ మంత్రిగా ప్రమాణస్వీకారంచేశారు. రాజ్ భవన్లో శుక్రవారం మధ్యాహ్నం 12.15 గంటలకు ప్రమాణస్వీకార కార్యక్రమం నిరాడబరంగా జరిగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ క్రికెటర్ తో మంత్రిగా ప్రమాణస్వీకారం చేయించారు. ఒక్కడి కోసమే ప్రత్యేకించి మంత్రివర్గ విస్తరణ జరగటం బహుశా తెలంగాణ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారేమో. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, మంత్రులు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ తో పాటు పార్టీ సీనియర్ లీడర్లు, కొందరు ఉన్నతాధికారులు హాజరయ్యారు.
జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక సందర్భంగా అజహర్ ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని రేవంత్ నిర్ణయం సంచలనంగా మారింది. రేవంత్ నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉపఎన్నికల్లో ముస్లింల ఓట్లకోసమే అజహర్ ను రేవంత్ మంత్రిగా తీసుకుంటున్నారంటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తంచేశారు. బీజేపీ నేతలైతే ప్రమాణస్వీకారం చేయకుండా చూడాలని చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ బీ సుదర్శనరెడ్డిని కలిసి అభ్యంతరం కూడా వ్యక్తంచేశారు.
అయితే వీళ్ళు అభ్యంతరం లేవనెత్తేసమయానికి ప్రభుత్వం నుండి మంత్రివర్గ విస్తరణపై అధికారికంగా ఎలాంటి ప్రకటన లేదు. సాయంత్రం ముఖ్యమంత్రి కార్యాలయం నుండి అదికారిక ప్రకటన వెలువడగానే చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ కేంద్ర ఎన్నికల ప్రధాన కమీషనర్ కు ఇదే విషయాన్ని తెలియజేస్తు లేఖ రాశారు. అయితే సుదర్శనరెడ్డి రాసిన లేఖకు ఏమని సమాధానం వచ్చిదో తెలీదు. అసలు సమాధానం వచ్చిందా అనే విషయంలో కూడా క్లారిటిలేదు. ఏదేమైనా ప్రతిపక్షాల అభ్యంతరాల మధ్య అజహర్ ముందుగా అనుకున్నట్లే మధ్యాహ్నం మంత్రిగా ప్రమాణస్వీకారం చేసేశారు. అజహర్ కు ఏ శాఖలు కేటాయిస్తున్నారో చూడాలి. హోంశాఖతో పాటు మైనారిటి సంక్షేమశాఖలు కేటాయించబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
అజహర్ కు ఇంత ప్రాధాన్యత ఎందుకు ?
అజహర్ కు కాంగ్రెస్ పార్టీ ఎందుకింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ? మామూలుగా ఎంతటి పెద్ద నేతైనా కూడా ఒక్కడి కోసమే మంత్రివర్గ విస్తరణ జరిగిన ఘటన గతంలో ఎప్పుడూ లేదు. అలాంటిది ఇపుడు కేవలం అజహర్ ఒక్కడి కోసమే మంత్రివర్గ విస్తరణ ప్రత్యేకంగా జరగటం నిజంగా ఆశ్చర్యమనే చెప్పాలి. ఎందుకిలా జరిగింది అంటే జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నిక అనేచెప్పాలి. నియోజకవర్గంలో మొత్తం 4.01 లక్షల ఓట్లున్నాయి. వీటిల్లో 1.20 లక్షలమంది ముస్లిం ఓటర్లే ఉన్నారు. ముస్లిం ఓటర్లలో కూడా మధ్య వయసు వారితో పాటు యువత ఎక్కువగా ఉన్నారు. వీరిలో అత్యధికులు అజహర్ కు అభిమానులు. అజహర్ రాజకీయ నేత మాత్రమే కాదు అంతకుముందు ప్రముఖ క్రికెటర్ కూడా. క్రికెటర్ గా దేశఖ్యాతిని ప్రపంచంలో చాటిచెప్పాడు. భారత క్రికెట్ చరిత్రలో అజహర్ ఎన్నో రికార్డులు తిరగరాశాడు. డెబ్యూలోనే వరుసగా మూడు సెంచిరీలు చేసిన అజహర్ ఘనత ఇంకా చెదరకుండా అలాగే ఉంది.
2023 ఎన్నికల్లో అజహర్ జూబ్లీహిల్స్ లో పోటీచేసి ఓడిపోయాడు. అయితే అప్పట్లో క్రికెటర్ కమ్ పొలిటీషియన్ గెలుపుకు ముస్లింల్లోని మధ్య తరగతితో పాటు యువత ఎక్కువగా కష్టపడ్డారు. ఇపుడు కూడా తనకే టికెట్ వస్తుందని చాలామంది అనుకున్నారు. అయితే అనేక కారణాల వల్ల అజహర్ ప్లేసులో వల్లాల నవీన్ యాదవ్ కు కాంగ్రెస్ అధిష్ఠానం టికెట్ ఇచ్చింది . నవీన్ కు టికెట్ కూడా మామూలుగా రాలేదు. టికెట్ రేసు నుండి అజహర్ ను తప్పించేందుకు అధిష్ఠానం ఎంఎల్సీ ఆఫర్ చేసింది. ప్రభుత్వం పంపిన ప్రతిపాదన గవర్నర్ దగ్గర పెండింగులో ఉంది. గవర్నర్ కోటాలో కాకపోతే అజహర్ ను ఎంఎల్ఏల కోటాలో భర్తీచేయటానికి అధిష్ఠానం రెడీగా ఉంది.
అందుకనే ఇపుడు క్రికెటర్ కు మంత్రిపదవి ఇచ్చేసింది. ఆరుమాసాల్లో ఏదో ఒక కోటాలో ఎంఎల్సీ అవుతాడు కాబట్టి టెక్నికల్ గా ఎలాంటి సమస్యలు ఉండవు. ఇపుడు అజహర్ చేయబోయేది ఏమిటంటే మంత్రి హోదాలో నవీన్ గెలుపుకు నియోజకవర్గంలో పర్యటించబోతున్నాడు. సీనియర్ నేతగా ప్రచారంచేయటానికి మంత్రిహోదాలో ప్రచారం చేయటానికి చాలా తేడా ఉంటుందని అందరికీ తెలుసు. తన మద్దతుదారులందరినీ అజహర్ పూర్తిగా నవీన్ గెలుపుకు రంగంలోకి దింపబోతున్నాడు. ముస్లింల్లో ఏమేరకు అజహర్ ప్రభావం చూపిస్తారో చూడాలి.
ముస్లింల ఓట్ల కోసమే : చలసాని
కాంగ్రెస్ గెలుపు కష్టమని ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా తెలిసిందని సీనియర్ జర్నలిస్టు చలసాని నరేంద్ర తెలిపారు. తెలంగాణ ఫెడరల్ తో మాట్లాడుతు ‘‘ఎంఐఎం మద్దతు, ముస్లింల మద్దతు కోసమే అజహర్ కు మంత్రిపదవి ఇచ్చార’’రని అన్నారు. ‘‘ముస్లింల్లో మెజారిటి బీఆర్ఎస్ కు మద్దతుగా నిలుస్తున్నారని తెలుసుకునే అధిష్ఠానం అర్జంటుగా అజహర్ కు మంత్రిపదవి ఇచ్చింద’’ని చెప్పారు. ‘‘అజహర్ కు మంత్రిపదవి ఇచ్చినంత మాత్రాన ముస్లింలందరు కాంగ్రెస్ కే ఓట్లేస్తారని గ్యారెంటీ లేద’’ని కూడా అన్నారు. ఏదో పద్దతిలో గెలవటం కోసమే అజహర్ కు మంత్రిపదవి ఇచ్చినట్లు చలసాని అభిప్రాయపడ్డారు.
ఇదే విషయాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతు ముస్లింల ఓట్ల కోసమే అజహర్ కు కాంగ్రెస్ మంత్రిపదవి ఇచ్చినట్లు ఆరోపించారు. ఉపఎన్నికల జరుగుతున్నపుడు ముస్లింల ఓట్ల కోసమే అజహర్ కు మంత్రిపదవి ఇవ్వటం ముస్లిం ఓటర్లను ప్రలోభానికి గురిచేయటమే అని మండిపడ్డారు. అజహర్ కు మంత్రిపదవి ఇవ్వటం పూర్తిగా అనైతికమని కేటీఆర్ ఆరోపించారు.