గల్లీ క్రికెట్ నుంచి గవర్నమెంట్ దాకా: అజ్జూభాయ్ యాత్ర

రాజకీయ గతుకుల టర్ఫ్ మీద స్టార్ అవుతాడా? ఫేడ్ అవుతాడా?

Update: 2025-10-31 10:18 GMT
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మలతో మంత్రి అజారుద్దీన్

గల్లీ క్రికెట్‌ బ్యాట్‌ నుంచి మంత్రిదాకా... ఇదే టీం ఇండియా మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్ అద్భుత ప్రయాణం.... క్రికెట్ మైదానంలో స్టైలిష్‌ షాట్లతో అభిమానులను మంత్ర ముగ్ధులను చేసిన అజార్, ఇప్పుడు రాజకీయ రంగంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించాడు. ఎన్నో విజయాలు, వివాదాలు, వ్యక్తిగత ఒడిదుడుకులు ఎదుర్కొంటూ చివరకు తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజార్ భాయ్‌ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించారు.


అజార్ భాయ్

టీం ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్‌గా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన ముహమ్మద్ అజారుద్దీన్ బాల్య దశలో హైదరాబాద్ నగరంలోని గల్లీ క్రికెట్ నుంచి తన క్రీడా ప్రస్థానాన్ని ఆరంభించారు. ఇటు క్రికెట్ రంగంలోనూ అటు వ్యక్తిగత జీవితంలోనూ ఎన్నెన్నో వివాదాలను చవి చూసిన అజారుద్దీన్ ను హైదరాబాదీలు అజార్ భాయ్ అని ప్రేమగా పిలుస్తుంటారు.
- బెట్టింగ్ ఆరోపణలపై సస్పెన్షన్ వేటు పడటంతో క్రికెట్ రంగానికి గుడ్ బై చెప్పిన అజార్ అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీలో చేరిక ద్వారా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేశారు. నాడు మొరాదాబాద్ లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగి విజయఢంకా మోగించి పార్లమెంటులోకి అడుగు పెట్టారు.
- గత 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనా గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకం కోసం రాష్ట్ర ప్రభుత్వం అజారుద్దీన్ పేరును గవర్నరుకు పంపింది. ఎమ్మెల్సీ ఎంపిక వ్యవహారం గవర్నర్ వద్ద పెండింగులో ఉండగానే అనూహ్యంగా అజారుద్దీన్ తెలంగాణ కేబినెట్ మంత్రిగా శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు.



 ఇదీ అజారుద్దీన్ ప్రస్థానం

హైదరాబాద్ నగరానికి చెందిన మహమ్మద్ అజీజుద్దీన్, యూసఫ్ సుల్తానా దంపతులకు అజారుద్దీన్ 1963 ఫిబ్రవరి 8 వతేదీన జన్మించాడు.ఈయన ఆబిడ్స్ లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్ లో పాఠశాల విద్య పూర్తి చేశారు. ఆ తర్వాత క్రికెట్ పై మక్కువతో గల్లీల్లో క్రికెట్ ఆడుతూ నిజాం కళాశాల నుంచి బికాం డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు.

టీం ఇండియా కెప్టెన్ గా...
గల్లీ క్రికెట్ ఆడుతూనే టీంఇండియాలో స్థానం సంపాదించాడు.ఇంటర్-యూనివర్శిటీ టోర్నమెంట్లలో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించాడు. ఆంధ్రతో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో సెంచరీలు సాధించాడు. అజార్ తన మొదటి మూడు టెస్ట్ మ్యాచ్‌లలో ప్రతిదానిలోనూ సెంచరీలు సాధించడం ద్వారా సంచలనం సృష్టించాడు తరువాత 1989లో భారత జట్టుకు నాయకత్వం వహించాడు.16 సంవత్సరాల క్రికెట్ కెరీర్‌లో అజారుద్దీన్ భారతదేశం తరపున 99 టెస్టులు,334 వన్డే ఇంటర్నేషనల్స్ ఆడాడు. అతని కాలంలో అత్యంత స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడు అయ్యాడు.కుడిచేతి వాటం మిడిల్ ఆర్డర్ బ్యాటర్ గా, మీడియం ఫాస్ట్ బౌలరుగా అజార్ 99 టెస్ట్ మ్యాచ్ లు, 334 వన్డే ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లు ఆడారు. టీం ఇండియా కెప్టెన్ గా 1990-91,1995 ఆసియా కప్ లలో జట్టుకు విజయం చేకూర్చారు. 1996 క్రికెట్ ప్రపంచ కప్‌లో సెమీ ఫైనల్‌కు జట్టును చేర్చాడు. ఇతను ప్రపంచంలోని అత్యుత్తమ వన్డే బ్యాట్స్‌మెన్‌లలో ఒకరిగా నిలిచారు.1990లలో భారతదేశానికి మూడు క్రికెట్ ప్రపంచ కప్‌లకు నాయకత్వం వహించాడు. 1985 ప్రపంచ క్రికెట్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న భారత జట్టులో అజార్ ఒకరు.

మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు
2000 వ సంవత్సరంలో అజార్ దక్షిణాఫ్రికా కెప్టెన్ హ్యాన్సీ కోన్నేకి బుకీలను పరిచయం చేశారని సీబీఐ తన నివేదికలో ఆరోపించింది. సీబీఐ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఐసీసీ, బీసీసీఐ అజారుద్దీన్ ను జీవితకాలం క్రికెట్ ఆడకుండా నిషేధించాయి.దీంతో 2000 వ సంవత్సరంలో అజార్ క్రికెట్ ప్రస్థానం ముగిసింది. అయితే 2012వ సంవత్సరంలో హైదరాబాద్ డివిజనల్ కోర్టు న్యాయమూర్తులు అశుతోష్ మొహంతా, కృష్ణ మోహన్ రెడ్డిలు అజార్ పై విధించిన నిషేధం అక్రమమని తీర్పు చెప్పారు. నిషేధం తర్వాత అజార్ క్రికెట్ మైదానంలోకి అడుగు పెట్టలేదు. కోర్టు తీర్పు తర్వాత ఇటీవల జమ్మూకశ్మీరులో యువకులకు క్రికెట్ నేర్పారు.

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా...
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అజార్ పై జీవిత కాల నిషేధం ఎత్తివేశాక 2019వ సంవత్సరం సెప్టెంబరు 4వతేదీన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఐపీఎల్ మ్యాచ్ టికెట్ల కుంభకోణంలోనూ అజార్ పై అరోపణలు వచ్చాయి. ఆ తర్వాత హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా వైదొలిగిన అజార్ ఏకంగా మంత్రి అయ్యారు.

భార్య నౌరీన్ కు విడాకులు
మొహమ్మద్ అజారుద్దీన్ క్రికెట్ రంగంలోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ పలు ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. ఈయన 1987వ సంవత్సరంలో హైదరాబాద్ కు చెందిన నౌరీన్ ను వివాహం చేసుకున్నాడు. వారికి మొహమ్మద్ అసదుద్దీన్, మొహమ్మద్ అయాజుద్దీన్ లు అనే ఇద్దరు కుమారులు. ఇద్దరు పిల్లలు పుట్టాక అజార్ 1996వ సంవత్సరంలో తన భార్య నౌరీన్ కు విడాకులు ఇచ్చాడు. అతని చిన్న కుమారుడు అయాజుద్దీన్ 2011 సెప్టెంబరు 11వ తేదీన ఔటర్ రింగ్ రోడ్డుపై పుప్పాలగూడ వద్ద బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మరణించాడు.

బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీతో వివాహం
భార్య నౌరీన్ కు విడాకులిచ్చిన అజార్ బాలీవుడ్ ప్రముఖ సినీనటి సంగీతా బిజ్లానీని వివాహమాడారు. అజార్ పై పలు పుకార్లు రావడంతో ఆమె రెండో భార్య సంగీతా బిజ్లానీ 2010వ సంవత్సరంలో అతనికి విడాకులిచ్చి తన స్వస్థలమైన ముంబయికు వెళ్లిపోయారు.



 సానియా మీర్జా కుటుంబంతో అజారుద్దీన్ వియ్యం

మాజీ క్రికెట్ కెప్టెన్ అయిన నేటి మంత్రి మొహమ్మద్ అజారుద్దీన్,మాజీ టెన్నిస్ స్టార్ సానియామీర్జా కుటుంబంతో వియ్యం అందుకున్నారు. అజారుద్దీన్ కుమారుడు మొహమ్మద్ అసదుద్దీన్ సానియా మీర్జా చెల్లెలు ఆనంమీర్జాతో వివాహం జరిగింది. ఆనం మీర్జాకు అసద్ తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో అజార్, సానియా కుటుంబాలు వారిద్దరికీ వివాహం జరిపించారు. ఈ పెళ్లితో హైదరాబాద్ నగరానికి చెందిన క్రికెట్ మాజీ కెప్టెన్ అజార్, మాజీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కుటుంబాల మధ్య బంధుత్వం ఏర్పడింది.

క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి...

క్రికెట్ నుంచి నిషేధానికి గురైన అజారుద్దీన్ 2009 ఫిబ్రవరి 19వతేదీన రాజకీయాల్లోకి ప్రవేశించి, కాంగ్రెస్ పార్టీలో చేరారు. అదే సంవత్సరం ఆయన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి 40,107 ఓట్ల ఆధిక్యతతో లోక్‌సభకు ఎన్నికయ్యారు. అయితే ఆ తర్వాత 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజస్థాన్‌లోని టోంక్ సవాయీ మాధోపుర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి బీజేపీ అభ్యర్థి సుఖ్‌బీర్ సింగ్ జౌనపురియా చేతిలో 1,35,506 ఓట్ల తేడాతో ఓడిపోయాడు. క్రికెట్ రంగంలోనూ, వ్యక్తిగత జీవితంతోపాటు రాజకీయ రంగంలోనూ వివాదాస్పదుడిగా అజార్ నిలిచారు.



 ఎమ్మెల్యేగా ఓడిపోయి...మంత్రి పదవి చేజిక్కించుకొని...

ముహమ్మద్ అజహరుద్దీన్ 2019 లోక్‌సభ ఎన్నికలకు దూరంగా ఉన్నారు. 2018లో కాంగ్రెస్ ఆయనను తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించింది.దీంతో తన సొంత రాష్ట్రమైన తెలంగాణ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన రెండో జాబితాలో ఆయనను జూబ్లీహిల్స్‌ కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రకటించింది.ఆయన ఈ ఎన్నికలలో తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపినాథ్ చేతిలో 16,337 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.

ముస్లిం సామాజిక వర్గంలో సంతోషం
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో ఆలస్యంగానైనా ముస్లిం మైనారిటీ అయిన అజారుద్దీన్ కు స్థానం కల్పించడం పట్ల ముస్లింలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని హైదరాబాద్ ఓల్డ్ సిటీకి చెందిన ఇస్లాం రచయిత ముహమ్మద్ ముజాహిద్ వ్యాఖ్యానించారు. ముస్లిం మంత్రి ఆధ్వర్యంలో మైనారిటీ సంక్షేమ పథకాలను ముమ్మరం చేయాలని ఆయన సూచించారు. అజారుద్దీన్ కు మంత్రి పదవి పోకుండా గవర్నర్ కోటా ఎమ్మెల్సీని సకాలంలో ఇప్పించేలా కాంగ్రెస్ నేతలు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

అమాత్య పదవి వరించించింది...
కీలకమైన జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ముందు అజారుద్దీన్ ను మంత్రి పదవి వరించింది. నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్న ముస్లిం ఓటర్లలో కాంగ్రెస్ ఆకర్షణను పెంచే ప్రయత్నంలో భాగంగా అజార్ కు అమాత్య పదవి వరించిందని కాంగ్రెస్ పార్టీకి చెందిన 23 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో మైనారిటీ ప్రాతినిధ్యం లేకపోవడం, హైదరాబాద్ జిల్లా నుంచి మంత్రి లేకపోవడం అనే రెండు ప్రధాన సమస్యలను పరిష్కరించే వ్యూహాత్మక రాజకీయ నిర్ణయంగా అజారుద్దీన్ ను మంత్రివర్గంలోకి తీసుకున్నారని భావిస్తున్నారు.

మైనార్టీ ఓట్ల కోసమే : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మైనార్టీ ఓట్ల కోసమే ఎమ్మెల్యే కాని అజారుద్దీన్‌ని కాంగ్రెస్‌ ప్రభుత్వం మంత్రిని చేస్తోందని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు కాంగ్రెస్‌ మంత్రి వర్గాన్ని విస్తరించడంపై ప్రజలు ఆలోచించాలన్నారు.అజారుద్దీన్ పై కేసులుంటే ఎలా మంత్రిని చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి, నైతిక విలువలను పక్కన బెట్టి ఉప ఎన్నికల సమయంలో అజారుద్దీన్ కు మంత్రి పదవి కట్టబెట్టారని బీజేపీ ఎమ్మెల్యే పాయల శంకర్ ఆరోపించారు. పాయల శంకర్ ‘ఫెడరల్ తెలంగాణ’ ప్రతినిధితో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషనరును కలిసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో కోడ్ ఉల్లంఘించి మంత్రి పదవి కట్టబెట్టడం ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడమేనని ఆయన చెప్పారు.



 మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు మాత్రమే : అజారుద్దీన్

తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అజారుద్దీన్ మొదటి సారి మీడియాతో మాట్లాడారు. తనపై బీజేపీ, బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ఆరోపణలు మాత్రమేనని, అవి వాస్తవం కాదని అజారుద్దీన్ చెప్పారు. తనపై నమోదైన ఒక్క కేసు కూడా నేరం రుజువు కాలేదని ఆయన పేర్కొన్నారు. తనకు మంత్రిగా అవకాశం కల్పించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్జతలు తెలిపారు. మంత్రిగా తనకు ఏ శాఖ అప్పగించినా సమర్ధవంతంగా పనిచేస్తానని చెప్పారు.

అజారుద్దీన్ ఇంటి వద్ద అభిమానుల సందడి
టీం ఇండియా మాజీ కెప్టెన్ ముహ్మద్ అజారుద్దీన్ శుక్రవారం తెలంగాణ రాష్ట్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేయడంతో ఆయన అభిమానులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ముస్లిం నేతలు ఆయన ఇంటికి తరలివచ్చారు. పలువురు అభిమానులు శాలువలు కప్పి, స్వీట్లు తినిపించి అజార్ భాయ్ కంగ్రాచ్యు లేషన్స్ అంటూ నినాదాలు చేశారు. కొందరు అభిమానులైతే పుష్పగుచ్చాలు అందజేసి, పండ్ల బుట్టలను బహుమతిగా అందించి అభినందించారు.

మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి బ్యాటింగ్ చేసేనా?
గల్లీ క్రికెట్‌ నుంచి టీం ఇండియా కెప్టెన్‌గా, అక్కడి నుంచి రాజకీయ రంగంలోని కీలక మంత్రిగా అజారుద్దీన్ ప్రయాణం నిజంగా అసాధారణం. ఆటగాడిగా అభిమానుల హృదయాలను గెలుచుకున్న అజార్, ఇప్పుడు ప్రజాసేవలో కొత్త పుటను ప్రారంభించారు. ఎన్నో ఆరోపణలు, ఎత్తుపల్లాలు, వ్యక్తిగత నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆయన తిరిగి నిలబడగలిగాడు. క్రీడలోనూ, రాజకీయాల్లోనూ తన ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న అజార్ భాయ్‌ ఇప్పుడు మంత్రిగా తెలంగాణ అభివృద్ధికి బ్యాటింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు.


Tags:    

Similar News