బీజేపీ ఎంఎల్ఏది సేమ్ సైడ్ గోలేనా ?
ఏలేటి ఇపుడు బీజేఎల్పీ నేత. పార్టీ లైనును దాటి వెళుతున్న కారణంగా పార్టీని ఇరకాటంలో పడేయాలని ఏలేటి అనుకుంటున్నట్లుగా ఆరోపణలు మొదలయ్యాయి.
ఎంఎల్ఏ ఏలేటి మహేశ్వరరెడ్డి వెళుతున్న స్పీడు చూసిన తర్వాత సేమ్ సైడ్ గోల్ వేయటం ఖాయమనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇంతకీ విషయం ఏమిటంటే పదేపదే మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) మీద ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. సుంకిశాల ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న రీటైనింగ్ వాల్ ఈమధ్యనే కూలిపోయింది. దాన్ని అడ్డంపెట్టుకున్న ఎంఎల్ఏ ప్రతిరోజు నిర్మాణ సంస్ధపై ఆరోపణలు, విమర్శలు చేస్తున్నారు. కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలని, కంపెనీపై సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేయటమే కాకుండా కంపెనీ నిర్మాణాల తీరుపై సుప్రింకోర్టులో కేసు వేస్తానని హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం కంపెనీ మీద యాక్షన్ తీసుకోకపోతే తానే కోర్టులో కేసు వేస్తానని బెదిరిస్తున్నట్లుగా మాట్లాడుతున్నారు. ప్రతిరోజు కంపెనీకి వ్యతిరేకంగా మీడియా సమావేశాలు నిర్వహించటమే కాకుండా మంగళవారం సుంకిశాల ప్రాజెక్టును కూడా సందర్శించారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే కంపెనీకి వ్యతిరేకంగా ఏలేటి ఎంత మాట్లాడినా, ఎన్ని ఆరోపణలు చేసినా ఎలాంటి ఉపయోగముండదు. ఎందుకంటే కంపెనీ యాజమాన్యానికి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల్లో చాలా గట్టి పట్టుంది. అలాగే పార్టీ పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. బీజేపీకి వచ్చిన రు. 6500 కోట్ల ఎలక్టోరల్ బాండ్లలో మేఘా యాజమాన్యం ఇచ్చిందే రు. 540 కోట్లు. కేంద్రంతో పాటు పార్టీ పెద్దలతో ఇంతటి ఘనమైన ఆర్ధిక సంబంధాలున్న కంపెనీకి వ్యతిరేకంగా ఎంఎల్ఏ ఏమి మాట్లాడినా ఏమి ఉపయోగం ఉంటుంది ? ఇక్కడ మరో విషయం ఏమిటంటే తెలంగాణా బీజేపీ మొత్తంమీద మేఘా కంపెనీకి వ్యతిరేకంగా ప్రతిరోజు మాట్లాడుతున్నది ఒక్క ఏలేటి మాత్రమే.
కేంద్రమంత్రులు జీ. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో పాటు మిగిలిన ఆరుగురు ఎంపీలు, ఏడుగురు ఎంఎల్ఏల్లో ఎవరూ నోరిప్పటంలేదు. రాజ్యసభ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ తో పాటు పార్టీలోని సీనియర్ నేతల్లో ఎవరూ కంపెనీ గురించి ఎక్కడా మాట్లాడటంలేదు. అలాంటిది ఏలేటి మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారో అర్ధంకావటంలేదు. యాజమాన్యంతో ఉన్న సంబంధాల కారణంగా ఎవరూ కంపెనీకి వ్యతిరేకంగా ఎక్కడా నోరిప్పవద్దని పార్టీ పెద్దల నుండి ఆదేశాలు వచ్చిన కారణంగానే ఎవరూ మాట్లాడటంలేదని పార్టీలో ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆదేశాలను ఇంతమంది నేతలు పాటిస్తున్నపుడు ఏలేటి మాత్రం ఎందుకు లెక్కచేయటంలేదో అర్ధంకావటంలేదు.
ఇక్కడే ఎంఎల్ఏ సేమ్ సైడ్ గోల్ వేసుకోవటం ఖాయమనే ప్రచారం పార్టీలో పెరిగిపోతోంది. ఏలేటి ఇపుడు బీజేఎల్పీ నేత. పార్టీ లైనును దాటి వెళుతున్న కారణంగా పార్టీని ఇరకాటంలో పడేయాలని ఏలేటి అనుకుంటున్నట్లుగా ఆరోపణలు మొదలయ్యాయి. మేఘా కంపెనీకి తెలంగాణాలో మాత్రమే కాదు బీజేపీ పాలిత రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్ లాంటి చాలా రాష్ట్రాల్లో కాంట్రాక్టులున్నాయి. పైగా వీటిల్లో అత్యధికం కేంద్రప్రభుత్వ శాఖల్లోని పనులే. ఇంతేకాకుండా ఈమధ్యనే రక్షణ రంగానికి చెందిన తుపాకుల తయారీ కాంట్రాక్టు కూడా మేఘాకు వచ్చింది. దీంతోనే కంపెనీ యాజమాన్యానికి కేంద్రప్రభుత్వంతో పాటు పార్టీ పెద్దలతో ఉన్న సాన్నిహిత్యం అర్ధమవుతోంది.
మామూలు జనాలందరికీ తెలిసిన ఈ విషయాలు ఏలేటికి తెలీకుండా ఎందుకుంటుంది. ఎంఎల్ఏ వ్యవహారం చూస్తుంటే ఉద్దేశ్యపూర్వకంగానే కంపెనీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నట్లు అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇదే విషయమై కంపెనీ యాజమాన్యం కూడా గట్టిగా ఒక చూపుచూస్తే ఎంఎల్ఏ ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ఏలేటి మీద పార్టీలో చాలామంది మండిపోతున్నారు. కాబట్టి ఇంతమంది వ్యతిరేకిస్తున్న కారణంగా ఎంఎల్ఏపైన పార్టీ పెద్దలు యాక్షన్ తీసుకోవటం పెద్ద కష్టమే కాదు. అయితే ఈలోగా ఎంఎల్ఏ చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో పార్టీని కూడా వివాదంలోకి లాగేయటం ఖాయమనే ప్రచారం పెరిగిపోతోంది. మరి చివరకు కంపెనీ-ఏలేటి వ్యవహారం ఎలా ముగుస్తుందో చూడాలి.