'చంద్రబాబును చూడండి, ఎంత చక్కగా పనిచేస్తున్నారో....
సిఎం రేవంత్ కు బిజెపి ఎంపి ఈటల రాజేందర్ సలహా
మోంథా తుఫాన్ సహాయచర్యలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపడుతున్న తీరును మల్కాజ్ గిరి పార్లమెంటు సభ్యుడు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ఈటలరాజేందర్ ప్రశంసిచారు. దీనిని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గమనించాలని ఆయన సూచించారు.
"ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, ఆ ప్రభుత్వ యంత్రాంగం ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేపడుతున్నారు. రైతులతో మాట్లాడి ధైర్యం చెప్తున్నారు. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంది. ఉమ్మడి కరీంనగర్, వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో లక్షల ఎకరాలలో పంట అక్కరకు రాకుండా పోయింది. కార్లు కొట్టుకు పోయాయి మనుషులు కొట్టుకుపోయి భయానక వాతావరణం ఉంది. భీమదేవరపల్లి మండలంలో 41 సెం.మీ వర్షం పడింది అంటే ఎంత విధ్వంసం సృష్టించిందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ సగం పట్నం 6 ఫీట్ల నీళ్లలో ఉంది. రైతులు ఏడుస్తున్నారు.గ్రామాల్లో విషాదం ఉంది,’ అని రాజేందర్ చెప్పారు.
‘పరిస్థితి ఇంతఘోరంగా ఉంటే రాష్ట్రంలో కాంగ్రెస్ మంత్రులు కొట్లాడుకుంటున్నారు. మిగతాా వాళ్లంతా జూబిలీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో నిమగ్నమై పోయినారు. మంత్రుల మధ్య ఉన్న వైరుధ్యాలు, కొట్లాటలు, పంపకాలు, దందాలతో సరిపోతుంది తప్ప ప్రజలను పట్టించుకునే పాపాన పోవడం లేదు,’ అని ఆయన విమర్శించారు. ముఖ్యమంత్రికి తీవ్ర హెచ్చరిక చేశారు.
‘ముఖ్యమంత్రిని ఒక్కటే డిమాండ్ చేస్తున్నా. మీ అంతర్గత కుమ్ములాటలు పక్కనపెట్టండి. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టి పరిష్కరించాలని కోరుతున్నాను. ప్రజలు ఇప్పుడు మిమ్మల్ని ఏమీ అనకపోవచ్చు కానీ సందర్భం వచ్చినప్పుడు కర్ర కాల్చి వాత పెడతారు. కెసిఆర్ కి అదే చేశారు,’ అని అన్నారు.
‘కెసిఆర్ కూడా ఇలానే అందర్నీ వారి శక్తి ఎంత, కథ ఎంత అని సప్రెస్ చేసే ప్రయత్నం చేశారు. వేలకోట్ల రూపాయలు ఖర్చుపెట్టినా కూడా కేసీఆర్ పార్టీని ప్రజలు ఎలా బొంద పెట్టారో చూసాము. రేవంత్ రెడ్డి ఈ అధికారం మీకు శాశ్వతం కాదు. మీకు అధికారం ఇచ్చింది ప్రజల మీద దాడులు చేయించడానికి, దోచుకోవడానికి కాదు. వెంటనే భూమి మీదకు వచ్చి ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను. తుఫాను నష్టంపై మాట్లాడుతూ 35 శాతం అధిక వర్షపాతంతో రైతులు అపారంగా నష్టపోయారని. పత్తిచేలు జాలు పట్టాయి, మక్క వరి పంటలు ఎదగలేదు,’ అని అన్నారు.