పసుపు పారాణి ఆరకముందే నవవధువు మృతి

నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలంలో విషాదం

Update: 2025-10-30 09:08 GMT

పసుపు పారాణి ఆరకముందే నవ వధువు కాటికి చేరింది. పెళ్లయిన 12 రోజులకే నవ వధువు రోడ్డు ప్రమాదంలోమృతి చెందిన ఘటన పలువురిని కలచి వేసింది. నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలం చామలేడు గ్రామానికి చెందిన శిలువేరు నవీన్ నాంపల్లి మండలం దామెర గ్రామానికి చెందిన అనూష ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో గుడిలో పెళ్లి చేసుకున్నారు. తర్వాత పెద్దలను ఒప్పించి ఈ నెల 17న సాంప్రదాయబద్దంగా పెళ్లి చేసుకున్నారు. వృత్తి రీత్యా నవీన్ పెయింటర్. పెళ్లయి 12 రోజులే కావడంతో సరదాగా దంపతులు బయటికి బయలు దేరారు. అదే సమయంలో రేపాక లచ్చయ్య తన పిల్లలను తీసుకుని గుర్రంపోడు గ్రామ శివారుకు దగ్గర్లోని బ్రిడ్జి వాగు చూపించడానికి వచ్చాడు. వాగు చూపించి తిరుగుముఖం పట్టాడు. అదే సమయంలో అనూష, నవీన్ దంపతులు తమ బైక్ పై వేగంగా వచ్చి లచ్చయ్య ప్రయాణిస్తున్న బైక్ ను ఢీ కొట్టారు. నల్లగొండ, దేవరకొండ రహదారి ఎడమ వైపు రెయిలింగ్ మీద నుంచి వాగులోకి అనూష పడిపోయింది. ప్రత్యక్ష సాక్షులు అనూష పడిపోవటాన్ని గమనించి అక్కడికి చేరుకున్నారు. వాగులో వెతికితే ప్రవాహం అంచున ఉన్న గుంతలో అనూష పడిపోయి ఉంది. సమీపంలోనే పడి ఉన్న నవీన్ తలకు తీవ్రగాయాలతో కనిపించాడు. వీరిరువురిని 108 వాహనంలో నల్గొండ ప్రభుత్వాసుత్రికి తరలించారు. అప్పటికే అనూష చనిపోయినట్టు వైద్యులు నిర్దారించారు. మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్ కు నవీన్ ను తరలించారు. ఈ ఘటనపై ఇంత వరకు కేసు నమోదు కాలేదని పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News