బీఆర్ఎస్, బీఎస్‌పీ పొత్తు.. కీలక వ్యాఖ్యలు చేసిన ఆర్ఎస్ ప్రవీణ్

సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయనున్న బీఆర్ఎస్, బీఎస్‌పీ. ప్రకటించిన ఆర్ఎస్ ప్రవీణ్, కేసీఆర్. స్థానాల కేటాయింపుపై రేపే నిర్ణయం.

Update: 2024-03-05 12:16 GMT
ఆర్ఎస్ ప్రవీణ్, కేసీఆర్


లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాలు కీలక మలుపు తిరిగాయి. జాతీయ స్థాయిలో ఒంటరి పోరాటమే చేస్తామని చెప్పుకుంటున్న బీఎస్‌పీ తెలంగాణలో మాత్రం బీఆర్ఎస్‌తో జతకట్టింది. మంగళవారం బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌తో బీఎస్‌పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ భేటీ అయ్యారు. ఇందులో రాష్ట్రంలోని రాజకీయ పరిస్థితులు, ప్రజలు పడుతున్న అవస్థలు సహా పలు కీలక అంశాలపై చర్చించారు. అనంతరం రాబోతున్న లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్‌పీ కలిసి పోటీ చేసే ప్రస్తావన రావడంతో దీనిపై ఇరువురు నేతలు సుముఖత వ్యక్తం చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్‌లో నందినగర్‌లోని నివాసంలో వీరు భేటీ అయి తమ పొత్తును అధికారికంగా ప్రకటించారు.

కాంగ్రెస్ కోరల నుంచి తెలంగాణను కాపాడటానికే తాము పొత్తు ఖరారు చేసుకున్నామని ఆర్ఎస్ ప్రవీణ్ వెల్లడించారు. పొత్తు అంశంపై ఇప్పటికే తమ పార్టీ జాతీయ అధ్యక్షురాలు మాయావతితో చర్చించామని, ఆమె కూడా ఓకే అనడంతోనే కేసీఆర్‌ దగ్గర పొత్తు ప్రస్తావన తెచ్చానని ఆయన వ్యాఖ్యానించారు. త్వరలోనే పొత్తు విధివిధానాలను వెల్లడిస్తామని, లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తమను తప్పకుండా ఆశీర్వదిస్తారని ప్రవీణ్ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను సంపాదించుకున్న ప్రభుత్వం రేవంత్‌ది తప్ప మరేదీ ఉండదేమోనంటూ కాంగ్రెస్ పార్టీకి చురకలంటించారు.

కలిసి పని చేస్తాం: కేసీఆర్

తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి, తెలంగాణ ప్రజల గళాన్ని ఢిల్లీ వినిపించాలన్న తాపత్రయంతోనే ఈ పొత్తు పెట్టుకున్నామని కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ప్రస్తుతానికి ఆర్‌ఎస్ ప్రవీణ్‌తో మాత్రమే మాట్లాడా. మాయావతితో కూడా త్వరలో భేటీ అవుతా. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రెండు పార్టీలు సమన్వయంతో పోటీ చేస్తాయి. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్నదానిపై రేపు నిర్ణయం తీసుకుంటాం’’

రాజ్యాంగాన్ని రద్దు చేసే కుట్ర జరుగుతుంది: ఆర్ఎస్ ప్రవీణ్

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయాలని, రాజ్యాంగాన్ని రద్దు చేయాలని కుట్ర పన్నుతోందని ఆర్ఎస్ ప్రవీణ్ మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎవరూ తమ భావాలను స్వేచ్ఛగా వెల్లడించలేకున్నారని, ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ రోజుల్లోనే కరెంటు కోతలు మొదలయ్యాయని, రైతులకు సాగు నీరు కరువు మళ్ళీ మొదలైందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

పార్లమెంటే టార్గెట్

అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలవడంతో నెక్స్ట్ పార్లమెంటే టార్గెట్‌గా బీఆర్ఎస్ సుప్రీం కేసీఆర్ పావుతు కదుపుతున్నారు. అందుకే ఇప్పుడు బీఎస్‌పీతో పొత్తు అనగానే వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పొత్తు ద్వారా సార్వత్రిక ఎన్నికల్లో గెలిచి పార్లమెంటులో పాదం పెడితే ఢిల్లీ నుంచి తన జాతీయ రాజకీయాలను సాగించాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.


Tags:    

Similar News