ప్రాంతీయ పార్టీల వల్ల, కాంగ్రెస్ వల్ల బిసిలకు రాజ్యాధికారం రాదు...’
బిసిల ‘తెలంగాణ బంద్’ నుంచి ‘బిసి కోటా కోసం ఐక్యపోరాటాలు చేద్దాం’ అని ఈటల రాజేందర్ పిలుపు
వెనకబడిన కులాలు రాజ్యాధికారం చేపట్టేదాకా ఐక్య ఉద్యమాలు చేయాలని బిజెపి ఎంపి ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలుచేయాలని కోరుతూ జరుగుతున్న బిసి తెలంగాణ బంద్ ఆయన పాల్గొన్నారు. సికిందరాబాద్ జూబిలీ బస్ స్టేషన్ దగ్గిర ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
‘తెలంగాణ రాష్ట్రం ఎలా సాధ్యం అయిందో బీసీ రాజ్యాధికారం కూడా సాధ్యం అవుతుంది. ఆ ఆశయాన్ని ముద్దాడే వరకు ఐక్య ఉద్యమాలు చేద్దాం,’ అని ఈటల పిలుపునిచ్చారు.
బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీ చెప్పారు. అన్నీ తెలిసి కూడా బీసీలను మోసం చేస్తున్నారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసింది. పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయి. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9 వ షెడ్యూల్ లో చేర్చారు. తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వేచేశారు. బీసీ కమీషన్ వేశారు. ఎన్ని వేసినా నిజాయితీ లేదు కాబట్టి అమలు కాలేదు,’ అని ఆయన అన్నారు.
ఈ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేసింది తప్ప నిజాయితీ లేదని చెబుతూ ‘లెక్కలు తీశారు.. కానీ అవన్నీ తప్పుల తడక. 52 శాంతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెప్తున్నారు. నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంట. నేను మాట్లాడిన మాటలపై ఎక్కడైనా చర్చకు సిద్ధం,’ అని ఆయన అన్నారు.
బిసి కొండ సురేఖ , పొన్నం ప్రభాకర్ లను కేబినెట్ నుండి తొలగించాలని చూస్తే బీసీల తడాఖా ఏంటో చూపిస్తామని కూడా ఆయన హెచ్చరించారు.
ఆయన ప్రాంతీయ పార్టీల తీరును కూడా తీవ్రంగా విమర్శించారు."ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్నంత కాలం ఆ కుటుంబం వారికే అధికారం దక్కుతుంది. కుటుంబమే ఏలుతుంది. కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా.. స్వతంత్రం వచ్చినప్పటినుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారు. ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురున్నారు. ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు చిన్నవి. బీసీల పట్ల ముసలికన్నీరు కాకపోతే నామినేటెడ్ పోస్ట్లలో ఎందుకు బీసీలకు స్థానం కల్పించలేదు," అని ఈటల అన్నారు.
తెలంగాణలో బీసీను సీఎం చేస్తా అని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రకటనను గుర్తు చేస్తూ మోడీ గారి క్యాబినెట్ లో 27 మంది OBC మంత్రులు ఉన్నారని, బీజేపీ నిజాయితీని ఎవరు శంకించలేరని ఆయన అన్నారు.
"మాదిగ రిజర్వేషన్ చేస్తామని మాట ఇచ్చి ప్రధాని నరేంద్ర మోదీ అమలు చేశారు. తమిళనాడులో ఏ పద్ధతి ప్రకారం చేశారో అదే పద్ధతిలో చేశారో ఇక్కడ కూడా చెయ్యాలి. ఈ బంద్ కి పిలుపు ఇచ్చింది బీసీ జెఎసి. అనివార్యంగా అన్ని పార్టీలు పాల్గొనాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ ఉద్యమం ఇక్కడితో ఆగదు. బీసీ బంద్ విజయవంతం కావడం తొలిసారి.
42 శాతం రిజర్వేషన్ల స్థానిక సంస్థలలో మాత్రమే కాదు.. చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వచ్చే వరకు ఆగదు. మాది యాచన కాదు, పాలించే శక్తి మాకు ఉంది. మేమెంతో మాకంత కావలసిందే," అని ఈటల అన్నారు.