పవర్ పాయింట్ కోసం పట్టుబడుతున్న బీఆర్ఎస్

కేసీఆర్ ఇమేజిని డ్యామేజి చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రపన్నిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది;

Update: 2025-08-29 10:07 GMT
Telangana Speaker Gaddam Prasad Kumar with BRS MLAs

బీఆర్ఎస్ ఎంఎల్ఏలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో తమకు పవర్ పాయింట్ ప్రజంటేషన్(PPP) చేసేందుకు అవకాశం ఇవ్వాలని. రేపు అంటే 30వ తేదీనుండి తెలంగాణ అసెంబ్లీ(Telangana Assembly Session) సమావేశాలు జరగబోతున్న విషయం తెలిసిందే. ఈసమావేశాల్లోనే ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం రెండు కీలకమైన అంశాలను చర్చకు తీసుకురాబోతోంది. అవేమిటంటే కాళేశ్వరం రిపోర్టు(Kaleshwaram Report), బీసీలకు 42శాతం రిజర్వేషన్(BC Reservation). కాళేశ్వరం రిపోర్టును అసెంబ్లీలో ప్రవేశపెట్టేందుకు లేకుండా అడ్డుకోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR), మాజీమంత్రి హరీష్ రావు(Harish Rao) కోర్టు ద్వారా ప్రయత్నించారు. అయితే వీరి వాదనను హైకోర్టు పట్టించుకోలేదు. రిపోర్టుపై అసెంబ్లీలో జరిగే చర్చలోనే చెప్పుకోవాల్సింది ఏమన్నా ఉంటే చెప్పుకోండి తర్వాత చూద్దాం అని కేసును హైకోర్టు నాలుగు వారాలకు వాయిదావేసింది.

ఇపుడు బీఆర్ఎస్ ఎంఎల్ఏల భయం ఏమిటంటే అసెంబ్లీలో కాళేశ్వరం రిపోర్టుపై సభ్యులకు కాపీలు పంపిణీ చేయబోతున్నది ప్రభుత్వం. అలాగే రిపోర్టు అమలుపై సభ్యుల అభిప్రాయాలను సేకరించబోతోంది. తర్వాత మెజారిటి సభ్యుల అభిప్రాయాల ప్రకారం ఏమిచేయాలని అనుకుంటున్నదో రేవంత్ ప్రభుత్వం ప్రకటిస్తుంది. పనిలోపనిగా అసెంబ్లీలోనే రేవంత్ లేదా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కాళేశ్వరం రిపోర్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చే అవకాశాలున్నాయి. రిపోర్టులోని అంశాలతో రేవంత్ సభలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వబోతున్నారని బీఆర్ఎస్ ఎంఎల్ఏలు గట్టిగా నమ్ముతున్నారు.

ఎందుకంటే రిపోర్టును అడ్డంపెట్టుకుని కేసీఆర్ పై రేవంత్ బురదచల్లుతున్నారని, కేసీఆర్ ఇమేజిని డ్యామేజి చేసేందుకు రేవంత్ ప్రభుత్వం కుట్రపన్నిందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇవే ఆరోపణలను హైకోర్టులో వేసిన పిటీషన్లో కేసీఆర్ స్వయంగా వ్యక్తపరిచారు. అయితే వీటిని హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదు. అసెంబ్లీలో రేవంత్ లేదా ఉత్తమ్ కాళేశ్వరంపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే కేసీఆర్, హరీష్ టార్గెట్ గానే ఉంటుందనటంలో సందేహంలేదు. సో, ప్రభుత్వ వాదన అసెంబ్లీ వేదికగా ప్రజల్లోకి చాలా బలంగా వెళుతుంది. మరప్పుడు కేసీఆర్ లేదా బీఆర్ఎస్ చూస్తు ఊరుకోదు కదా ? అందుకనే తమ వాదన వినిపించేందుకు తమకు కూడా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాలని పట్టుబడుతున్నారు. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కారుపార్టీ ఎంఎల్ఏలు కేపీ వివేకానంద్ గౌడ్, సుదీర్ రెడ్డి తదితరులు కలిసి విజ్ఞప్తి చేశారు.

స్పీకర్ ఏమిచేస్తారు ?

చేసేందుకు ఏమీలేదు, ఎందుకంటే ప్రతిపక్షానికి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజంటేషన్ కు అవకాశాలు ఉండవు. కాబట్టి స్పీకర్ బీఆర్ఎస్ కు అవకాశం ఇవ్వరనే అనుకోవాలి. మరి రేవంత్ లేదా ఉత్తమ్ మాత్రం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఎలాగ చేస్తారు ? ఎలాగంటే అధికార పార్టీకి ఉన్న అవకాశం కాబట్టే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న పదేళ్ళు ఇలాగే వ్యవహరించింది. ప్రతిపక్షాలను అసెంబ్లీ సమావేశాల్లో నోరెత్తనీయకుండా తొక్కిపెట్టేసింది. కాబట్టి ఇపుడు రేవంత్ ప్రభుత్వం కూడా అదేచేస్తుంది అనటంలో సందేహంలేదు. అసెంబ్లీలో ప్రభుత్వం తరపునుండి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇస్తే బీఆర్ఎస్ తన పార్టీ ఆఫీసులో ఇచ్చుకోవాల్సిందే తప్ప వేరేదారిలేదు. కాకపోతే ఇదే విషయమై సభలో గలబా చేసేందుకు చాలా అవకాశాలున్నాయి. మరి సభలో ఏమి జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News