రాష్ట్రానికి 50 వేల టన్నుల యూరియా కేటాయించిన కేంద్రం
తెలంగాణ యూరియా కొరతకు పరిష్కారం ఏమిటి?;
-జి. రాం మోహన్
యూరియా కొరతతో సతమతమవుతున్న తెలంగాణకు కేంద్రం 50,000 మెట్రిక్ టన్నుల యూరియా ను కేటాయించింది. ఈ విషయాన్ని వ్యవసాయ మంత్రి తుమ్మల తెలిపారు.
యూరియ సమస్య తీవ్రమయింది
తెలంగాణలో యూరియా కొరత చాలా తీవ్రస్థాయికిచేరుకుంది. యూరియా దక్కించుకునేందుకు రైతులు రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు గాయడం మీద మీడియాలో ఎన్నోకథనాలు వచ్చాయి. అక్కడి క్యూలో తమ వంతుకోసం వేచివుండటానికి చెప్పులు వుంచిన దృశ్యాలు టీవి ఛానెల్స్ లో ప్రసారం అయ్యాయి. దాని కొరత ఎంత తీవ్రంగా ఉందోతెలిసి వచ్చివంది. యూరియా కొరత మూలంగా రైతుల ఎదుర్కొంటున్న కష్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య రాజకీయ రగడ కు దారి తీసింది. కాంగ్రెస్ ప్రభుత్వం మీద అక్కసుతోనే కేంద్రం తగినంత యూరియా సరఫరా చేయడం లేదని పార్లమెంటు వద్ద రాష్ట్ర కాంగ్రెస్ ఎంపీ లు నిరసన తెలిపారు. కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా వారికి మద్దతు తెలిపారు.
అయితే, బిజెపి నాయకులు దీనిని ఖండించారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు దేశంలో ఎక్కడాలేని యూరి యా కొరత తెలంగాణలోఎందుకు ఉంది, గత ఏడాది కంటే ఎక్కువ యూరియా తెలంగాణ కు ఇచ్చారు, అదెక్కడ పోయిందో చెప్పాలని అన్నారు.
కేంద్రం ఆగస్టు 13 తారీఖు వరకు సరఫరా చేయాల్సిన 8.30 లక్షల మెట్రిక్ టన్నుల లో కేవలం 5.18 లక్షల టన్నుల యూరియా మాత్రమే పంపిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. ఏప్రిల్ సెప్టెంబర్ నెలల మధ్య కేంద్రం పంపాల్సిన 9.8 లక్షల టన్నుల కంటే 3.12 లక్షల టన్నులు తక్కువ. ఈ విషయం గురించి సిఎం రేవంత్ రెడ్డి వ్యవసాయ మంత్రి తుమ్మల కేంద్ర మంత్రులను కలిసిన విషయన్ని ఒక లేఖ ద్వారా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడికి రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ తెలియచేసింది.
సరఫరా లో ఎలాంటి లోపం లేదని రాష్ట్ర ప్రభుత్వమే యూరియాను దారి మళ్లించిన వారిపైన మెతక వైఖరితో వుందని బిజెపి అధ్యక్షుడు రామచందర్ రావు ఆక్షేపించారు. దీని పైన నిజ నిజాలు తేల్చటానికి సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని ఆయన అన్నారు.
కాగా ఎరువుల సరఫరా లో భాగంగా మన రాష్ట్రానికి వచ్చిన యూరియా మొదట మార్కఫెడ్ గోడౌన్ ల కు చేరుకుంటుంది. అక్కడి నుండి అవి ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటిలకు (PACS), ఆరోగ్య రైతు సేవ కేంద్రాలు (ARSK), హైదరాబాద్ అగ్రికల్చర్ సహకార అసోసియేషన్ (HACA) కేంద్రాలకు వెళ్తుంది. వీటికి స్థానికంగా వుండే ప్రైవేట్ డీలర్ లకు 60:40 శాతం ప్రకారం వాటిని అందుబాటులో వుంచుతారు.
రైతులు అవసరాని కంటే ఎక్కువగా ఎరువులు వాడుతారని వ్యవసాయ అధికారులు అంటున్నారు. ఇప్పుడు కొరత వున్న పరిస్థితి వలన మరింత ఎక్కువ గా కొంటున్నారు అంటారు.
“మొక్కలకు యూరియా వేసి ఆకులు పచ్చగా మారటం చూసి అవి ఆరోగ్య కరంగా వున్నాయి అనుకుంటారు రైతులు. ఎకరా వరి పంటకు రెండు 45 కేజీల యూరియా బ్యాుగులు చాలు. కాని 6 నుండి 7 బ్యాగులు కూడా వాడుతారు. యూరియా ఎక్కువ వాడితే వాటికి చీడల పీడ ఎక్కువ అవుతుంది. యూరియా పైన సబ్సిడీ ఉండటం, దానికి తోడు కేవలం 267 రూపాయలకు వస్తున్నది. పొటాష్ 1,750 రూపాయలు. పొటాష్ చెట్ల ఎదుగుదలకు, ఎక్కువ పూలు పూయటానికి, కాండం బలపడటానికి తోడ్పడుతుంది. తద్వారా దిగుబడి పెరుగుతుంది. రైతులు నత్రజని తో పాటు ఇతర పొటాష్, సల్ఫర్ వుండే మిశ్రమ ఎరువులను వినియోగించాలి,” అని ఒక మండల స్థాయి అధికారి చెప్పారు. కానీ ఎంత చెప్పిన రైతులు యూరియా ఎక్కువ వాడి తప్పుచేస్తారని ఆయన చెప్పారు.
కంపెనీలు ఎరువుల డీలర్ లను యూరియా తో పాటు యితర ఎరువులు సరుకులు కొనాలని వత్తిడి చేస్తాయి. కింద వున్న రైతు వాటిని కొనే వరకు కూడా అదే వత్తిడి వుంటుంది.
యూరియా అందుబాటు గురించి ఆరా తీయగా కరీంనగర్ జిల్లాలోని చర్లబోవతకురు రైతులు జి. అనిల్ రెడ్డి , జి. రవీందర్ రెడ్డి లు తమకు అందిందని అయితే విరివిగా దొరకడం లేదని చెప్పారు.
‘మేము ప్రాధమిక వ్యవసాయ సహకార సొసైటి ల లో యూరియా కొన్నాము. ప్రైవేట్ దుకాణాలలో దొరకడం లేదు,’ అని చెప్పారు. సాధారణ యూరియా అందుబాటులో లేకపోవటం తో నానో యూరియా వాడాలని అధికారులు రైతులను ప్రోత్సాహిస్తున్నారు.
“రైతులకు నానో యూరియా పైన యింకా నమ్మకం కలగ లేదు. ఇప్పుడు ఉన్నపరిస్థితి లో నేను నానో యూరియా వాడాల్సి వస్తున్నది,” అని రైతు రవీందర్ రెడ్డి అంటారు.
‘రాష్ట్రం తన వద్ద ఉన్న 7 లక్ష ల టన్నుల నిల్వ ల వలన ఈ మేరకైనా సరఫరా చేయగలిగాము. కేంద్రం యూరియా యివ్వటం లేదు. నిజానికి దాని వాడకం తగ్గింది కానీ పంట విస్తీర్ణం పెరగటం తో సరిపోవటం లేదు, అని అభిప్రాయ పడ్డారు రాష్ట్ర విత్తన కార్పొరేషన్ ఛైర్మన్, ఎస్. అన్వేష్ రెడ్డి.
పెరిగిన వరిపంట విస్తీర్ణం
రాష్ట్రంలో యిప్పటికే 45,20,974 ఎకరాలు ల లో వరి వేశారు. పోయిన సంవత్సరం వరి పంట విస్తీర్ణం కేవలం 31,60,699 ఎకరాలు. ఈ పంట కాలం లో దాని సాధారణ విస్తీర్ణం 62,47,868 ఎకరాలు. మొక్కజొన్న 5,96,892 ఎకరాలకు చేరింది. ఇది నిరుటి సంవత్సరం 4,21,310 ఎకరాల కంటే ఎక్కువ. సాధారణ విస్తీర్ణం 5,21,206 ఎకరాలు. పత్తి నేటికి 44,63,517 ఎకరాలలో వేశారు. యిది నిరుటి సంవత్సరం కంటే ఎక్కువే. ఈ పంట సాధారణగా 48,93,016 ఎకరాలలో పండుతుంది.
యూరియా కొరత రబీ లో ఉండే అవకాశం తక్కువ. అప్పుడు పత్తి వుండదు. వరి, మొక్కజొన్న కూడా విస్తీర్ణం తగ్గుతుంది.
డీలర్ లు కూడా ఎరువుల వాడకం గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైరా లో ఒక డీలర్, “యూరియా ధరలు గత 30 సంవత్సరాలుగా పెరగలేదు. దాని పైన వున్న సబ్సిడీ పొటాష్ లాంటివి ఉండే మిశ్రమ ఎరువులకు మళ్లించాలి. కొంత యూరియా పక్కదారి పడుతోంది. కంపెనీలు దుకాణం వరకు ఉచితంగా నిజానికి సరకు చేర్చాలి కానీ చేయటం లేదు. ఆ ఖర్చులు మా పైన వేస్తున్నారు. మేము వాటిని రైతుల పైన వేయక తప్పటం లేదు. అందుకే యూరియా కొందరు రు. 310 కి కూడా అమ్ముతున్నారు,” అన్నారు.
నానోయూరియా వాడకం పెరగాలి
ప్రభుత్వ అధికారులు నానో యూరియా గురించి రైతులలో అవగాహన కోసం కృషి చేయాలి. అర్ధ లీటర్ నానో యూరియా 225 రూపాయలకు దొరుకుతుంది. ఇది మొక్క బాగా పీల్చుకుంటుంది, అని ఆయన చెప్పారు.
ఈ మొత్తం సంక్షోభానికి కారణం కేంద్రం ఎరువుల పైన సబ్సిడీ తగ్గింపు అంటారు అఖిల భారత్ కిసాన్ సంఘ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి.
ఎరువుల పైన సబ్సిడీ 2022-23 లో రు. 2,51,339 కోట్లు కాగా అది 2023-24 కు రు.1,85,292, 2024-25 కు రు.1,71,299 కోట్లు, 2025-26 కు రు.1,67,887 తగ్గింది. తదను గుణంగానే యూరియా మీద కూడా 2023-24 కు రు 1,23,092 కోట్లు, 2024-25 కు రు. 1,19,000 కోట్ల, 2025-26 కు రు.1,18,900 కోట్ల కు తగ్గించారని చెప్పారు.