wine shops | ఎక్సైజ్ శాఖకు దరఖాస్తుల్లోనే వందల కోట్లు
ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయమే కీలకపాత్ర పోషిస్తోంది;
ఏప్రభుత్వమైనా ఎక్సైజ్ ఆదాయం మీద ఆధారపడక తప్పని పరిస్ధితులు వచ్చేసింది. ప్రభుత్వానికి ఆదాయార్జన మార్గాల్లో ఆబ్కారీ శాఖ ఆదాయం చాలా కీలకమైపోయింది. మిగిలిన శాఖలు అంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, టూరిజం, రియల్ ఎస్టేట్, రవాణ లాంటి శాఖల ద్వారా అనుకున్నంత ఆదాయాలు వచ్చినా రాకపోయినా ఏటికేడాది కచ్చితంగా ఆదాయాన్ని పెంచుకుంటు పోయేది మాత్రం ఎక్సైజ్ శాఖే. అందుకనే ప్రభుత్వాలు అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్సైజ్ శాఖ ఆదాయమే కీలకపాత్ర పోషిస్తోంది. ఇపుడీ విషయం ఎందుకంటే 2025-27 సంవత్సరాలకు ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వంలోని ఎక్సైజ్ శాఖ ఏ4 వైన్ షాపు(Wine shops)లను వేలంద్వారా కేటాయించేందుకు సిద్ధమైంది. ఇందుకు అవసరమైన ఉత్తర్వులను కూడా జారీచేసింది. ఆ ఉత్తర్వుల ప్రకారం షాపులను సొంతంచేసుకునేందుకు దరఖాస్తు ఫీజుల రూపంలోనే ప్రభుత్వానికి రు. 786 కోట్లు సమకూరబోతోంది.
రాష్ట్రంలో 2620 ఏ4 షాపులున్నాయి. ఏ4 షాపులంటే రీటైల్ వైన్ షాపులని అర్ధం. పైనచెప్పిన షాపులను ఈఏడాది డిసెంబర్ 1వ తేదీన వేలంపాటల ద్వారా వ్యాపారస్తులకు ప్రభుత్వం కేటాయిస్తుంది. ఆసక్తికలవారు షాపుల కోసం డిసెంబర్ 1వ తేదీకన్నా ముందే దరఖాస్తులు చేసుకోవాలి. వేలంపాటల్లో షాపులను సొంతంచేసుకున్న వారికి లైసెన్సు కాలపరిమితి 01-12-2025 నుండి 30-11-2027 వరకు ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు దరఖాస్తులు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజును ప్రభుత్వం రు. 2 లక్షల నుండి రు. 3 లక్షలకు ప్రభుత్వం పెంచింది. ఒకరు ఎన్ని దరఖాస్తులైనా చేయవచ్చు. దరఖాస్తుల ఫీజును ప్రభుత్వం వాపసుఇవ్వదు. ఇక్కడే ప్రభుత్వానికి రు. 786 కోట్లు రాబోతున్నట్లు అర్ధమవుతోంది. ఎలాగంటే 2620x3,00,000= 786 కోట్లు.
రు. 786 కోట్ల ఆదాయం కేవలం నాన్ రీఫండబుల్ దరఖాస్తుల ద్వారా మాత్రమే. షాపులు దక్కించుకున్న వారు విడిగా ఏడాది లైసెన్స్ ఫీజును చెల్లించాల్సుంటుంది. ఎస్సీ, ఎస్సీ, బీసీ(గౌడ్స్)కు కొన్ని షాపులను ప్రభుత్వం రిజర్వ్ చేసింది. గౌడ్లకు 15 శాతం, ఎస్సీలకు 10శాతం, ఎస్టీలకు 5శాతం షాపులను రిజర్వ్ చేసినట్లు ఎక్సైజ్ శాఖ ప్రకటించింది. రిజర్వ్ చేసిన షాపులు పోను మిగిలిన షాపులను ఓపెన్ కేటగిరీలో ప్రభుత్వం వేలంద్వారా కేటాయిస్తుంది. 5వేల జనాభా ఉన్న ప్రాంతంలో షాపుకు రీటైల్ షాప్ ఎక్సైజ్ ట్యాక్స్ ఏడాదికి రు. 50 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 5వేల నుండి 50వేల జనాభా ఉన్న ప్రాంతానికి రు. 55 లక్షలు, 50వేల జనాభా-లక్ష మధ్య జనాభా ఉన్న ప్రాంతానికి రు. 60లక్షలు, లక్ష నుండి 5లక్షల జనాభా ఉన్న ప్రాంతానికి రు. 65లక్షలు, 5లక్షల నుండి 20లక్షల మధ్య జనాభ ఉన్న ప్రాంతానికి రు. 85లక్షలు, 20లక్షల పైన జనాభా ఉన్న ప్రాంతానికి రు. 110 లక్షలుగా ప్రభుత్వం రుసుములు నిర్ణయించింది. వేలంపాటల్లో ఎన్ని షాపులను ఆసక్తి ఉన్నవారు సొంతంచేసుకుంటారు ? వేలంపాటల ద్వారా ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుందన్నది కొంతకాలం ఆగితే తెలుస్తుంది.