‘రాజీవ్ స్ఫూర్తితో అభివృద్ధి చేస్తాం’

మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి నివాళులు అర్పించిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.;

Update: 2025-08-20 07:23 GMT

దేశం కోసం ప్రాణాలను అర్పించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన పాలనలో దేశం ఎన్నో సంస్కరణలను చూసిందని, అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిందని అన్నారు. దేశాన్ని టెక్నాలజీ పరంగా అభివృద్ధి చేసిన నాయకుడు రాజీవ్ అని రేవంత్ అన్నారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సచివాలయం ముందు ఉన్న రాజీవ్ విగ్రహానికి రేవంత్ నివాళులు అర్పించారు. ఈ సందర్బంగానే రాజీవ్ గాంధీ చేసిన సంస్కరణలు, ఆయన తీసుకొచ్చిన పథకాలను గుర్తు చేశారు. దేశంలో 18 సంవత్సరాల వయసు నిండిన వారికి ఓటు హక్కు కల్పించి, దేశ భవిష్యత్తును ఎన్నుకోవడంలో వారిని భాగస్వాములను చేసిన గొప్ప నాయకుడు రాజీవ్ గాంధీ అని చెప్పారు. యువత అంతా కూడా రాజీవ్‌ను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నతశిఖరాలను అందుకోవాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఆయన స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం కూడా రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుంచేలా పాలన కొనసాగిస్తోందని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తోందని చెప్పుకొచ్చారు.

‘‘దేశ యువతకు స్ఫూర్తి రాజీవ్ గాంధీ. దేశ సమగ్రతను కాపాడేందుకు ఆయన ప్రాణాలర్పించారు. పారదర్శక పరిపాలన అందించడానికి సాంకేతికతను జోడించాలని ఆనాడు రాజీవ్ గాంధీ ఆలోచన చేశారు. 18 ఏండ్లు నిండిన వారికి ఓటు హక్కును కల్పించి దేశ భవిష్యత్ ను నిర్ణయించే అవకాశం కల్పించారు. స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించిన దార్శనికుడు రాజీవ్ గాంధీ. కంప్యూటర్ ను దేశానికి పరిచయం చేసిన మహనీయుడు రాజీవ్ గాంధీ. టెలికాం రంగంతో దేశంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. రాజీవ్ స్ఫూర్తితో ఆనాడు హైదరాబాద్ లో హైటెక్ సిటీకి పునాది పడింది. రాజీవ్ స్ఫూర్తితో తెలంగాణను ఆర్థికంగా,సామాజికంగా ముందుకు తీసుకెళతాం. సంక్షేమం, అభివృద్ధితో పాటు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి సామాజిక సమస్యలకు పరిష్కారం చూపాం. రాజీవ్ గాంధీని దేశ యువత స్ఫూర్తిగా తీసుకోవాలి. రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకుని 21 ఏళ్లు నిండిన వారు శాసన సభకు పోటీ చేసేలా చట్టాన్ని సవరించేందుకు కృషి చేస్తాం. ఆ కలలన్నీ సాకారం కావాలంటే దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని కావాలి. రాజీవ్ స్ఫూర్తితో రాహుల్ గాంధీని ప్రధానిగా చేసే వరకు విశ్రమించబోం’’ అని అన్నారు.

Tags:    

Similar News