2 కోట్ల సిమ్‌ల రద్దుకు సర్కార్ ప్లాన్.. సైబర్ క్రైమే కారణం..

సైబర్ నేరాలను నియంత్రించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక మూల వీటి వలలో పడి సామాన్యులు సతమతమవుతున్నారు.

Update: 2024-09-30 12:38 GMT

సైబర్ నేరాలను నియంత్రించడానికి ఎంత ప్రయత్నిస్తున్నా.. ప్రతి రోజూ దేశంలో ఏదో ఒక మూల వీటి వలలో పడి సామాన్యులు సతమతమవుతున్నారు. ఎలాగైనా వీటిని అరికట్టాలని కేంద్రం కూడా తెగ కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగానే తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న సిమ్‌లపై కేంద్రం ఫోకస్ పెట్టింది. నకిలీ పత్రాలతో తీసుకున్న సిమ్‌లను, సైబర్ క్రైమ్‌లతో ప్రమేయం ఉన్న సిమ్‌లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తోంది. ఇలాంటి సిమ్‌లను త్వరితగతిన గుర్తించి వాటిని రద్దు చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ఈ చర్యలు అమల్లోకి వస్తే దేశవ్యాప్తంగా దాదాపు 2.17 కోట్ల సిమ్ కార్డులు రద్దు అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. దాంతో పాటుగా అనేక ఫోన్లను కూడా బ్లాక్ చేయాలని ప్రభుత్వం యోచిస్తోందట. దీంతో ప్రాథమిక అంచనా ప్రకారం 2.24 లక్షల ఫోన్లను రద్దు చేయాలని కేంద్రం భావిస్తోందని సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. ఇదే అంశంపై ఇటీవల జరిగిన హోం మంత్రిత్వశాఖ సమావేశంలో కూడా చర్చించారు అధికారులు.

అధికారులు గ్రీన్ సిగ్నల్..

దేశంలో పెరుగుతున్న సైబర్ నేరాలు, వాటిని అరికట్టడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల అంశంపై ఇటీవల హోంశాఖ సమావేశం నిర్వహించింది. ఇందులో ఇమిగ్రేషన్ బ్యూరో, ఆర్‌బీఐ, ఐటీ, ఎన్‌ఐఏ, సీబీఐ సహా పలుశాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశం సందర్భంగానే సిమ్‌ల రద్దు అంశానికి సంబంధించిన సమాచారాన్ని టెలికాం శాఖ వారి ముందు ఉంచినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పరిశీలించిన అనంతరం సిమ్‌ల రద్దుకు అధికారులు అంతా అంగీకారం తెలిపారని తెలుస్తోంది. అంతేకాకుండా కొత్త్ సిమ్‌ను జారీ చేసే సమయంలో సమర్థవంతమైన కేవైసీ నిర్వహించేలా పలు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు సూచించారు. ఈ అంశంపై లోటుపాట్లు అన్నీ పరిశీలించిన తర్వాత పక్కా ప్రణాళికతో చర్యలు చేపట్టాలని హోంశాఖ నిర్ణయించింది.

ఇదిలా ఉంటే ఇప్పటి వరకు సైబర్ నేరాలను అధ్యయనం చేయగా వాటిలో విస్తుబోయే నిజాలు వెల్లడయ్యాయి. సైబర్ నేరాల బాధ్యుల్లో అధికంగా ఉన్నత విద్యావంతులే ఉంటున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయెల్ చెప్పారు. సైబర్ నేరాలను తాము విశ్లేషించగా 48 శాతం మంది ఐటీ ప్రొఫెషనల్స్,ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, ఉన్నతవిద్యావంతులని తేలిందని ఆమె చెప్పారు. సైబర్ నేరాలు ఎక్కువగా నకిలీ డాక్యుమెంట్ల సాయంతో సిమ్ కార్డులు పొందిన వారు చేస్తున్నారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో దర్యాప్తులో తేలింది. దీంతో నకిలీ డాక్యుమెంట్లకు సిమ్ కార్డులు జారీ చేయవద్దని తాము టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు, టెలికాం రెగ్యులేట్ అథారిటీకి, టెలీ కమ్యూనికేషన్స్ విభాగాలకు లేఖలు రాశామని సైబర్ సెక్యూరిటీ పోలీసులు చెప్పారు. ఈ క్రమంలోనే అటువంటి సిమ్‌లపై కొరడా ఝులిపించడానికి సిద్ధమైనట్లు సమాచారం.

Tags:    

Similar News