చిరంజీవి 'పులకింత'.. నెట్టింట రచ్చంట!

చిరంజీవి బలహీనతేమిటో గాని సినిమా వాళ్లను చూడడంతోనే పులకించి పోతుంటారట. మనసులో ఏదీ దాచుకోలేరు. ఆయనకు తెలియకుండానే బయటికి వచ్చేస్తుంది.ఇప్పుడదే జరిగింది..;

Update: 2025-02-13 08:16 GMT
చిరంజీవి
ప్రముఖ నటుడు, మెగాస్టార్ చిరంజీవి మరోసారి నెటిజన్ల నోళ్లకు చిక్కారు. జనాంతికంగా మాట్లాడిన ఓ మాట ఇప్పుడాయన్ని ట్రోలింగ్ బాట పట్టించింది. చిరంజీవి బలహీనతేమిటో గాని సినిమా వాళ్లను చూడడంతోనే పులకించి పోతుంటారనేది జగమెరిగిన సత్యం. రాజకీయాల్లో ఉన్నా ఆయన మనసంతా సినిమా వైపే లాగిందనేది నిజం. చిరంజీవి ఏదీ మనసులో దాచుకోలేరు. ఆయనకు తెలియకుండానే బయటికి వచ్చేస్తుంది. ఆయన పుట్టి పెరిగిన కాలం, ఆలోచనలు అలాంటివి. పల్లెటూరి వాసనలు పోగొట్టుకోని మనుషుల్లో ఒకరిగా ఆయన కనిపిస్తుంటారు. లో లోపల ఉన్న భావాలు, నమ్మకాలు, ఆలోచనలు సంఘర్షణకు గురి అయి బయటపడతాయంటుంటారు మానసిక శాస్త్రవేత్తలు.
అలా చిరంజీవి మొన్నీమధ్య ఓ సినిమా ఫంక్షన్ కి వెళ్లి యాంకర్ సుమ ఆడిన ఆటలో చిక్కారు. ఇప్పుడు రకరకాల వ్యాఖ్యానాలతో సతమతం అవుతున్నారు. ఈ వ్యాఖ్యల పై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కొంతమంది చిరంజీవి పితృ స్వామ్య వ్యవస్థకు వత్తాసు పలుకుతున్నాడని అభిప్రాయం చెప్పగా, మరికొంతమంది చిరంజీవికి ఆడ పిల్లలంటే అంత అలుసా అని ఆవేశపడిపోయారు. ఇంకొంతమంది ఒక సెలబ్రిటీ అయి ఉండి కూడా చిరంజీవి పబ్లిక్ లో అలా మాట్లాడటం ఏం బాలేదు అని అభిప్రాయ పడ్డారు. చాలామంది జోకులు సెటైర్లతో చిరంజీవిని ఎగతాళి చేశారు.
సుమ అడిగిందేమిటంటే...
ప్రముఖ హస్యనటుడు బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్‌ తాత- మనవళ్లుగా నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’ (Brahma Anandam). ఫిబ్రవరి 14న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) హాజరయ్యారు. తాత-మనవడి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కడంతో ఈ ఈవెంట్‌లో బ్రహ్మానందం, చిరంజీవి వారి తల్లిదండ్రులు, తాతయ్యల గురించి యాంకర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
‘‘మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన చాలా దానధర్మాలు చేసేవారు. ఆ మంచి బుద్ధి నాకు కొంచెం వచ్చింది. ఇక రామ్ చరణ్ తాతయ్య అంటే మా నాన్న విషయానికొస్తే చాలా అందగాడు. ఆయన గ్లామర్‌ మాకెవ్వరికీ రాలేదు. ఆయన మా హీరో. అలాగే క్లీంకార తాతయ్య (చిరంజీవి) గురించి చెప్పాలంటే.. ఇంట్లో ఉన్నప్పుడు నాకు మనవరాళ్లతో ఉన్నట్లు ఉండదు. ఏదో లేడీస్ హాస్టల్‌ వార్డెన్‌లా ఉంటుంది. చుట్టూ ఆడపిల్లలే. అందుకే అబ్బాయిని కనమని చరణ్‌ను అడుగుతుంటాను. మన వారసత్వం కొనసాగాలని అంటుంటా’’ అని సరదాగా చెప్పారు.
వైరల్ అయిన చిరంజీవి వ్యాఖ్యలు...
ఈ కామెంట్లు వైరల్ అయ్యాయి. చిరంజీవి పురుషాధిక్య మనస్తత్వం కలిగిన వారని కొందరు, లింగ వివక్ష చూపిస్తున్నారని మరికొందరు, పాతపడ్డ, బూజుపట్టిన భావజాలానికి ఆయన ప్రతినిధి అని ఇంకొందరు రకరకాల కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. చిరంజీవి ఓ తన్మయత్వంలో చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన చుట్టూ వివాదాన్ని రేపాయి.
చిరంజీవి ఇంటినిండా అమ్మాయిలు ఉన్నారు గనుక కొంతమంది అబ్బాయిలు ఉంటే బాగుంటుందన్నది బహుశా ఆయన మనసులో మాటై ఉండవచ్చు. అబ్బాయిని ఇవ్వు, మన లెగసీని కొనసాగించాలి అనే మాట అమ్మాయి- అత్తవారిల్లు వారసత్వం గురించి చెప్పిన మాటగా తప్పుబడుతున్నారు. ఇది మంచిదా కాదా అనేది భావజాలానికి సంబందించిన విషయం.
రకరకాల ట్రోల్స్.. అవేమింటంటే..
సోషల్ మీడియాలో వస్తున్న ట్రోల్స్ ను ది ఫెడరల్ పాఠకులకు అందించాలన్నదే మా ఉద్దేశం. మాకు ఎటువంటి దురుద్దేశాలు లేవు.
చిరంజీవి వ్యాఖ్యపై ఓ వర్గం చేస్తున్న వాదన ఇలా ఉంది. "ఇక్కడ సమస్య ఏమిటంటే..వీళ్ళందరూ డబ్బు, పేరు ప్రఖ్యాతులు సంపాదించారు కాబట్టి గొప్పవాళ్ళు మహానుభావులు అని నమ్మేవాళ్లు ఉంటారు. వాళ్ళు అర్థం చేసుకోలేనిది ఏంటంటే- వాళ్ళ డబ్బు పేరు వేరు, వాళ్ళ వ్యక్తిత్వం, భావజాలం, ఆలోచనలు వేరు- అనేది తెలుసుకోలేకపోవడం. వీళ్లంతా బయటికి కనిపించేది ఒకటి లోపల ఒకటి గా జీవిస్తారు. అప్పుడప్పుడు వాళ్లేంటో వాళ్లకు తెలియకుండా బయటపెడతారు అంతే" అని వాదిస్తోంది. పెద్ద వాళ్లు చెప్పారు గనుక మనమూ మగపిల్లల్నే కనమని భార్యల్ని హింసించే వాళ్లు ఉంటారని, ఆ విషయంలో చిరంజీవి లాంటివాళ్లు జాగ్రత్తగా కామెంట్లు చేస్తే బాగుండేదన్నది వీరి ఉద్దేశం.
ఎప్పటికీ మగ పిల్లలే వారసులు....
చిరంజీవి కామెంట్లను సపోర్ట్ చేసే వాదన మరోలా ఉంది. "మనది పితృస్వామ్య వ్యవస్థ. కాబట్టి మగ పిల్లలే వారసులు అవుతారు. ఇంటి పేరుని మగ పిల్లలు మాత్రమే వారసత్వంగా కొనసాగిస్తారు. పెళ్ళి అయ్యాక ఆడపిల్లలు భర్త ఇంటి పేరు పెట్టుకున్నా, పెట్టుకోకపోయినా... ఆడపిల్లల పిల్లలకు భర్త ఇంటి పేరు, భర్త కులమే వర్తిస్తుంది. ఒక వేళ కోర్టులు తల్లి ఇంటిపేరు, తల్లి కులం పెట్టుకోవచ్చని తీర్పులిచ్చినా గానీ చట్టపరంగా చెల్లుతుందేమో గానీ .. మనది పితృస్వామ్య కుటుంబ వ్యవస్థ కాబట్టి మత పరంగా మగ పిల్లలే వారసులు. ఆస్తులు పంచుకోవడానికి మాత్రం. ఆడపిల్లలకు, మగ పిల్లలకు సమాన హక్కు ఉంటుంది.
ఇటీవల కుల సంఘాల సమావేశాలకు వేరే కులాల అబ్బాయిలను పెళ్ళి చేసుకున్న అమ్మాయిలు వారి భర్తలతో బాటు, వారి పిల్లలను కూడా తీసుకు వస్తున్నారు. వారు ఎప్పటికీ వేరే కులస్థులే కదా. అదే ఒక అబ్బాయి వేరే కులపు అమ్మాయిని పెళ్ళి చేసకుంటే కుల సంఘ సమావేశాలకు తన భార్యా పిల్లలను తీసుకు రావచ్చు. ఎందుకంటే వారికీ తండ్రి ఇంటిపేరు, తండ్రి కులమే వర్తిస్తుంది కాబట్టి. ఏ విధంగా చూసినాగానీ చిరంజీవి గారు మాట్లాడిన దాన్లో తప్పేముంది?" అని ఈ వర్గం వాదిస్తోంది.
"ఒక ఆడబిడ్డా పుట్టాక ఆ తర్వాత బాబు పుట్టాలి అని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు, కాని చిరంజీవి లాంటి వ్యక్తీ దాన్ని బహిరంగంగా చెప్పకూడదు, చెబితే? అసలు ఆడబిడ్డే వద్దు, కొడుకు కావాలి అని అబార్షన్స్ చేయించే వాళ్ళు కూడా ఉండవచ్చు" అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. ఆడబిడ్డలు దేవతలు అంటూనే, నీ పాపాలకు ఆడబిడ్డలే పుడతారు అని శపించేవాళ్ళు ఇంకొందరు!
ఎక్కడన్నా మంచిగా రెడీ అయిన పాపను చూస్తే, ఇంట్లో ఇద్దరు మగపిల్లలు ఉన్నా ఓ అమ్మాయి ఉంటే బాగుండేది కదా అని ఆ భార్య భర్తల మధ్య తరచూ డిస్కషన్ నడుస్తుంది. మొన్నటి మెగాస్టార్ వ్యాఖ్యల్నీ అలాగే చూడాలనే మధ్యేవాదులూ లేకపోలేదు. ఆడపిల్లల మాత్రమే ఉంటే... అబ్బా, ఒక బాబు ఉంటే భలే ఉండేది.. అక్క/ తమ్ముడు, అన్న/చెల్లి వాళ్ళ కొట్లాటలు భలే ఉంటాయి అనుకునే పేరెంట్స్ చాలామందే ఉంటారు. భార్య, భర్త, బాబు, పాప - ఒక కంప్లీట్ ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతారు.
అదొక ముచ్చట..
"ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే అని ఓ సందర్భంలో అన్నారు పీవీ నరసింహారావు. వెండి తెరకు మెగాస్టార్ అయినా కుటుంబానికి మాత్రం చిరంజీవి- కొణిదల వర ప్రసాదే. చిరంజీవిలో కూడా ఓ కుటుంబ పెద్ద ఉంటాడు. తండ్రి ఉంటాడు. తాతా ఉంటాడు. తన కుటుంబం ఎలా ఉండాలో నిర్ణయించుకునే స్వేచ్చ చిరంజీవికి ఉంటుంది. ఇప్పటికే ఇంటినిండా మహాలక్ష్ములు ఉన్నారు కాబట్టి ఈసారి కొడుకుని కనమని తన కొడుక్కి మనవి చేసుకున్నాడు. మనసులో మాట ఎటువంటి దాపరికాలు లేకుండా పదిమందిలో చెప్పాడు. ఈ కోణంలో చిరంజీవిలో నాకైతే మెగాస్టార్ కనిపించలేదు. ఒక సాధారణ తండ్రి మాత్రమే కనిపించాడు" అన్నారు ఒకప్పటి రాజకీయ నాయకుడు, చిరంజీవి అభిమాని.
ఆయన చెప్పిన దాని ప్రకారం.."వరసగా మగ పిల్లలు ఉన్న ఇంట్లో ఒక్క ఆడ పిల్ల ఉంటే బాగుండు అని ఎంతమంది తల్లితండ్రులు అనుకోరు చెప్పండి? అలాగే వరసగా ఆడ పిల్లలు ఉన్న ఇంట్లో ఒక్క మగపిల్లాడైనా ఉంటే బాగుండు అని అనుకునే తల్లి తండ్రులు కూడా ఉంటారు. రామ్ చరణ్ దంపతులకు మొదటి కాన్పులో ఆడ పిల్ల పుడితే ఇదే చిరంజీవి తన ఇంట్లో మహాలక్ష్మి పుట్టిందని పొంగిపోయాడు కదా? ఆ పిల్లను గుండెల మీద పెట్టుకుని మురిసిపోయాడేగాని గుండెల మీద కుంపటి అనుకోలేదు కదా? ఊరంతా పిలిచి సంబరాలు చేసుకున్నాడు కదా? ఇందులో పితృస్వామ్య వ్యవస్థ ఏముంది? స్రీ ద్వేషం ఎక్కడుంది? ఎంతో ఎత్తుకు ఎదిగినా ఈ రోజుకీ తల్లిని ఎక్కడో వదిలేయకుండా తన ఇంట్లోనే ఉంచుకుని సేవలు చేస్తున్నాడు కదా. రాఖీ నాడు తోబుట్టువులను ఇంటికీ పిలిపించుకుని ప్రేమగా పండుగ చేసుకుంటున్నాడు కదా?
నాకు చిరంజీవి మెగాస్టార్ గా కన్నా ఒక ఫ్యామిలీ బాండింగ్ ఉన్న వ్యక్తిగా బాగా నచ్చుతాడు. తనవరకు చూసుకోకుండా తన కుటుంబానికి చెందిన ఎంతో మందికి చిరంజీవి లిఫ్ట్ ఇచ్చాడు. ఈరోజు మెగా కాంపౌండ్ లో చాలామంది సెలబ్రిటీ హోదాలో వెలిగిపోతున్నారంటే అది చిరంజీవి ప్రోత్సాహం వల్లనే కదా? అటువంటి ఓ పెద్ద కుటుంబానికి పెద్దగా ఉన్న చిరంజీవి తన కుటుంబం విషయంలో ఎలా ఉండాలో కూడా స్వేచ్చగా నిర్ణయం తీసుకోకూడదా? మనవరాలిని ఎంతో ప్రేమిస్తున్న చిరంజీవి ఇప్పుడు మనవడ్ని కోరుకోవడం ఎంత మాత్రం తప్పు కాదు!" అన్నారు. చిరంజీవి వ్యాఖ్యని జనాంతికంగా తీసుకోవాలని కొందరు చెబుతున్నా ఇలాంటి సెలబ్రిటీలు మాట్లాడే మాటల్ని కొందరు పట్టించుకుని కాపురాలు కూల్చుకుంటే పరిస్థితి ఏమిటన్నది ఇంకొందరి ప్రశ్న.
Tags:    

Similar News