జాబ్ క్యాలెండర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.

Update: 2024-07-13 13:28 GMT

తెలంగాణలో జాబ్ క్యాలెండర్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. యూపీఎస్సీ తరహాలో ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. జేఎన్టీయూ ఆధ్వర్యంలో నిర్వహించిన క్వాలిటీ విద్యపై సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి, ఐటి శాఖ మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఇంజనీరింగ్ విద్యపై విద్యాసంస్థల యాజమాన్యాలతో ఇంటరాక్షన్ జరిపారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు కీలక సూచనలు చేశారు. అలాగే తెలంగాణలో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనల పైనా ఆయన స్పందించారు.

తెలంగాణలో పదేళ్లపాటు ఉద్యోగాల కోసం యువత కొట్లాడింది. కానీ ఇప్పుడు పరీక్షలు వాయిదా వేయాలని కొన్ని రాజకీయ శక్తులు కొన్ని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు ఆమరణ దీక్షలు చేస్తున్నారని సీఎం రేవంత్ ఆరోపించారు. ముగ్గురు దీక్ష చేస్తే దాంట్లో ఒక్కరు కూడా ఏ పరీక్ష రాయట్లేదని చెప్పారు. త్వరలోనే జాబ్ క్యాలెండర్ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వానికి భేషజాలు లేవు, నిరుద్యోగులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. నోటిఫికేషన్లు ప్రకారమే ప్రభుత్వం పరీక్షల నిర్వహణ ఉంటుందని, విద్యాసంస్థలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారకూడదు అనేదే మా ప్రభుత్వ విధానమని సీఎం రేవంత్ స్పష్టం చేశారు.

స్వలాభం కోసమే ముగ్గురి దీక్ష...

కోచింగ్ సెంటర్ యజమాని పరీక్ష వాయిదా వేయమని ఆమరణ నిరహార దీక్ష చేస్తున్నాడు. నేను ఆయన ఏ పరీక్ష రాస్తున్నాడని అడిగితే.. ఆయనకి కోచింగ్ సెంటర్ ఉంది రెండు నెలలు డీఎస్సీ పోస్ట్ పోన్ చేస్తే 100 కోట్లు లాభం వస్తుంది అని చెప్తున్నారని సీఎం రేవంత్ తెలిపారు. ఇంకో ఆయన మన పార్టీలోనే ఉండే కదా ఆయన ఏం పరీక్ష రాస్తున్నాడు? దీక్ష ఎందుకు చేస్తున్నాడని అడిగితే.. నువ్వు పార్టీలో ఏం ఉద్యోగం ఇవ్వలేదని, నిన్ను గిల్లటానికి దీక్షకు కూర్చున్నాడు అని చెప్పారన్నారు. నాకు తెలిసిన ఇంకో పిల్లగాడు గాంధీ ఆసుపత్రిలో చేరి దీక్షకి కూర్చున్నాడు, ఏం పరీక్ష రాస్తున్నాడు అవసరమైతే స్పెషల్ కోచింగ్ ఇప్పిదామని అడిగితే.. ఆయన ఏం పరీక్ష రాయట్లేదు. ఒక లీడర్ చెప్పిండు అంట చేస్తే పేరు వస్తదని అందుకు చేశాడంట అని చెప్పారని సీఎం రేవంత్ వెల్లడించారు.

అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లే...

ప్రపంచంలో అద్భుతాలు సృష్టించేది ఇంజనీర్లు మాత్రమేనన్నారు సీఎం. అయితే కాలేజీలు సివిల్ మెకానికల్ ఇంజనీరింగ్ కోర్సులను నిర్లక్ష్యం చేస్తున్నాయని అన్నారు. పుస్తకాల్లో చదువులకు బయట మార్కెట్లో సమాజానికి ఏ మాత్రం పొంతన లేకుండా ప్రస్తుతం అకాడమిక్ సిలబస్ లు ఉన్నాయన్నారు. ప్రపంచ దేశాల విద్యార్థులతో పోటీపడే విధంగా టెక్నికల్ కోర్సుల సిలబస్ మారాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఇంజనీరింగ్ కాలేజీలు అంటే నిరుద్యోగులను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలుగా ఉండకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ ఏఐ సమ్మిట్ హైదరాబాద్ - 2024 లోగోను సీఎం విడుదల చేశారు.

Tags:    

Similar News