‘ఇంజినీర్లు ఒత్తిళ్లకు లొంగొద్దు..’
నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు ఇప్పటికీ నీళ్లందిస్తున్నాయి.;
ప్రాజెక్టుల నాణ్యత విషయంలో తమ ప్రభుత్వం రాజీ పడదని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. అదే విధంగా ప్రాజెక్ట్‌ల నిర్మాణ సమయంలో ఎవరి ఒత్తిళ్లకు లొంగొద్దని ఇంజినీర్లకు సూచించారు. ప్రాజెక్ట్‌ల విషయంలో కాంగ్రెస్ ఎప్పుడూ తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. స్వరాజ్యం వచ్చిన తొలినాళ్లలోనే ఏపీకి భారీ ప్రాజెక్ట్‌లను కేటాయించడమే కాకుండా వాటికి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు రేవంత్. హైదరాబాద్ జలసౌధ ప్రాంగణంలో కోలువుల పండగను ప్రభుత్వం నిర్వహించింది. ఇందులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నరు. ఈ సందర్బంగా అతి త్వరలోనే తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగుల నియామకం కూడా జరుగుతుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా నీటిపారుదల శాఖలో ఏఈ, జేటీఓ పోస్టులకు ఎంపికయిన వారికి సీఎం నియామక పత్రాలు అందించారు.
‘‘అప్పట్లో నెహ్రూ శంకుస్థాపన చేసిన నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్ట్‌లు ఇప్పటికీ నీళ్లందిస్తున్నాయి. 50-60 ఏళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్ట్‌లే ఇప్పటికీ తెలంగాణకు కీలకంగా ఉన్నాయి. ఎన్నో వరదలు వచ్చినా వాటన్నింటిని తట్టుకుని నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ నిలిచాయి. కానీ రూ.లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం మాత్రం మూడేళ్లలోనే కూలింది. కట్టిన మూడేళ్లలోనే ప్రాజెక్ట్ కూలడం ప్రపంచంలో ఎక్కడా లేదన్నారు. రూ.లక్ష కోట్లతో కట్టిన కాళేశ్వరం ద్వారా వెయ్యి ఎకరాలకు కూడా నీరు అందలేదు. కనీసం పట్టి పరీక్షలు కూడా చేయకుండా ప్రాజెక్ట్ నిర్మించిన ఘనత మాజీ సీఎం కేసీఆర్‌దే’’ అని ఎద్దేవా చేశారు రేవంత్. అంతేకాకుండా ఎస్‌ఎల్‌బీసీ, దేవాదుల, సీతారామా, నెట్టెంపాడు, సమ్మక్క సారక్క ప్రాజెక్ట్‌లను తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని, వాటన్నింటిని శరవేగంగా పూర్తి చేస్తామని వ్యాఖ్యానించారు. అదే విధంగా కొందరు రాజకీయ లబ్ధి కోసమే గ్రూప్-1 నియామకాలను అడ్డుకుంటున్నారని, వారు ఎవరో ప్రజలకు కూడా తెలుసని అన్నారు. అతి త్వరలోనే గ్రూప్-1 నియామకాలను పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు.
అంతకుముందే తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో పౌర సేవలు, అనుమతుల మంజూరు వంటి అంశాలపై సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో చేపట్టే వివిధ రకాల నిర్మాణాలు, ఇతర సదుపాయాల కల్పనకు సంబంధించిన పౌర సేవలు, అనుమతుల ప్రక్రియ సరళంగా, సులభతరంగా ఉండాలన్నారు. ఇందుకు సంబంధించి సమగ్ర అధ్యయనంతో సాధ్యమైనంత త్వరగా నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఇందులో భాగంగా ఔటర్ రింగు రోడ్డు పరిధిలోని జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్‌లో వివిధ రకాల నిర్మాణాలకు ప్రజలు పలు విభాగాలకు దరఖాస్తులు చేసుకొని ఆయా కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఒకే ప్లాట్‌ఫామ్‌పై దరఖాస్తు చేసుకుని సింగిల్ విండోలో అనుమతి లభించేలా వ్యవస్థ ఉండాలని ఆదేశించారు. ఇందుకు రెవెన్యూ, పురపాలక, జల వనరులు, నీటి సరఫరా, మురుగు నీటి పారుదల, పోలీసు, అగ్నిమాపక, విద్యుత్ తదితర విభాగాలు సంయుక్తంగా పని చేయాలని ముఖ్యమంత్రి గారు సూచించారు. ఆయా శాఖలు వసూలు చేసే బిల్లులు సైతం ఒకేసారి, ఒకే విండో ద్వారా చెల్లించే విధానానికి రూపకల్పన జరగాలన్నారు.
వినియోగదారులు చెల్లించే మొత్తాన్ని ఆయా విభాగాల ఖాతాల్లో జమయ్యే విధానాన్ని రూపొందించాలన్నారు. ఈ క్రమంలో ఆస్తులు, వనరుల గుర్తింపునకు లైడార్ సర్వే చేయాలని, మరింత సులభతర విధానాల అధ్యయనానికి నిపుణుల సలహాలు తీసుకోవాలని సూచించారు. అనుమతుల ప్రక్రియలో అనవసరమైన జాప్యం జరగరాదని, ఏ కారణం లేకుండా అనుమతులను నిరాకరించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఏదైనా కారణం చేత అనుమతులకు ఆలస్యమైతే వివరాలను దరఖాస్తుదారుడి తెలియజేసి వాటి పరిష్కారానికి మార్గాలను కూడా అధికారులే సూచించాలని ఆదేశించారు.