పీజీ సీట్లలో స్థానిక కోటా.. సుప్రీంకు తెలంగాణ సర్కార్
పీజీ మెడికల్ సీట్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది.;
పీజీ మెడికల్ సీట్ల కేటాయింపులో స్థానిక కోటాకు వ్యతిరేకవంగా తెలంగాణ హైకోర్టు ఇటీవల తీర్పునిచ్చింది. దీని వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయని, దేశంలో అత్యధిక మెడికల్ కాలేజీలు ఉన్న రాష్ట్రం తెలంగాణనే అని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పీజీ మెడికల్ సీట్ల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం అనుమతించింది. ఈ క్రమంలోనే మెడికల్ సీట్ల విషయంలో స్థానిక కోటా చెల్లదంటూ ఇటీవల జస్టిస్ సుధాంశు దులియా నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును తెలంగాణ ప్రభుత్వం ప్రస్తావించింది.
త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును దృష్టిలో ఉంచుకుని తమ పిటిషన్‌ను విస్తృత ధర్మాసనానికి బదిలీ చేయాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. కాగా అంతకన్నా ముందు తాము విచారణ చేపడతామని గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. అనంతరం తదుపరి విచారణను ఏప్రిల్ 4వ తేదీకి వాయిదా వేసింది.
కొత్త నిబంధనలతో స్థానికత వివాదం...
ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన నిబంధనల వలన స్థానికులకు అన్యాయం జరుగుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఆగస్టు నెల 3న కాళోజి నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఉమ్మడి ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఇక్కడ విద్యాసంస్థల అడ్మిషన్లలో 2014 నుంచి 2024 వరకు ఏపీ విద్యార్థులకు కోటా ఉన్నది. ఈ ఏడాదితో విభజన చట్టంలోని గడువు ముగియడంతో కాళోజి యూనివర్సిటీ తాజా అడ్మిషన్ల ప్రక్రియ కోసం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. వీటిలో స్థానికతపై గతంలో ఉన్న నిబంధనల్లో మార్పులు చేసింది. తెలంగాణ ప్రభుత్వం జులై 19న జారీ చేసిన 33 జీవో ప్రకారం స్థానికత నిబంధనలు మార్చినట్టు నోటిఫికేషన్ లో పేర్కొంది.
33 జీవోతో మాకు అన్యాయం జరిగేలా ఉందని తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 9వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణిస్తామని నోటిఫికేషన్లో పేర్కొనడంతో వివాదం చెలరేగింది. 2023-24 విద్యా సంవత్సరం వరకు 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏడేళ్ల కాలంలో గరిష్ఠంగా నాలుగేళ్లు ఎక్కడ చదివితే అక్కడ స్థానికులుగా పరిగణలోకి తీసుకునేవారు. కానీ ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి స్థానికతలో చేసిన మార్పులతో తెలంగాణ వారికే ఎక్కువ అన్యాయం జరగనుందనే ఆరోపణలు వస్తున్నాయి. 33 జీవో ప్రకారం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో ఏపీ విద్యార్థులకు లాభం చేకూరుతుందని ప్రధానంగా వినిపిస్తోన్న ఆరోపణ. ఈ నిబంధనతో హైదరాబాద్ లో చదివిన ఏపీ విద్యార్థులు తెలంగాణాలో స్థానికులుగా ఉంటారు. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాల్లోని చాలా ప్రాంతాలకి చెందిన విద్యార్థులు గుంటూరు, విజయవాడలో ఇంటర్మీడియట్ చదువుతుంటారు. ఇలా ఇంటర్ చదవడానికి పొరుగు రాష్ట్రాలకి వెళ్లినవారికి కొత్త నిబంధనతో స్థానికత కోటను కోల్పోతారు అని వాదిస్తున్నారు.