ఓట్లచోరీపై కాంగ్రెస్ పార్టీ సేమ్ సైడ్ గోల్
కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ దొంగఓట్లతోనే గెలిచారని మండిపడ్డారు.;
ఓట్ చోరీ పై ఇపుడు దేశవ్యాప్తంగా చర్చలు జరుగుతున్న నేపధ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) చేసిన ఆరోపణలు పార్టీ ‘సేమ్ సైడ్ గోల్’ వేసుకున్నట్లే ఉంది. ఈనెల 26వ తేదీన కరీంనగర్(Karimnagar) లో మొదలైన రెండోవిడత జనహిత యాత్రలో బొమ్మ మాట్లాడుతు తెలంగాణలో గెలిచిన 8 మంది బీజేపీ ఎంపీలు ‘ఓట్ చోరీ’(Vote Chori) వల్లే గెలిచారని ఆరోపించారు. అంతటితో ఆగని బొమ్మ కరీంనగర్ పార్లమెంటు ఎన్నికల్లో గెలిచిన బండి సంజయ్ దొంగఓట్ల(Vote Theft)తోనే గెలిచారని మండిపడ్డారు. తనఆరోపణలకు బొమ్మ ఒక ఉదాహరణ కూడా చెప్పారు. అదేమిటంటే కరీంనగర్ లోని ఒక ఇంట్లో 40 ఓట్లున్నట్లు చెప్పారు. ఇలాంటి ఓట్ చోరీతోనే బండి ఎంపీగా ఎన్నికయ్యారని బొమ్మ ఆరోపించటమే విచిత్రంగా ఉంది.
ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సేమ్ సైడ్ గోల్ వేసుకుంటున్నది అని అన్నది ఎందుకంటే బీహార్ లేకపోతే బెంగుళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గంలో భారీఎత్తున దొంగఓట్లు ఉండవచ్చు. దొంగఓట్ల కారణంగానే బీజేపీ గెలిచి కూడా ఉండచ్చు. పార్లమెంటు లేదా అసెంబ్లీ ఎన్నికల సమయంలో దొంగఓట్లు నమోదు చేయించటం, పోలింగురోజున దొంగఓట్లు వేయించటం అన్నీపార్టీలు అనుసరిస్తున్న విధానాలే. బీహార్, లేదా బెంగుళూరు సెంట్రల్ పార్లమెంటు నియోజకవర్గాల్లో దొంగఓట్లను అప్పట్లో కాంగ్రెస్ పార్టీ అడ్డుకోలేకపోయిందంటే అర్ధముంది. ఎందుకంటే అప్పట్లో కర్నాటకలో అధికారంలో ఉన్నది, ఎన్డేయే కూటమి, బీజేపీ. కాబట్టి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఓట్ చోరీని అడ్డుకోలేకపోయిందంటే అర్ధముంది.
అక్కడి పరిస్ధితులను దృష్టిలో పెట్టుకుని దాన్ని తెలంగాణ పార్లమెంటు ఎన్నికలకు అన్వయించటం బొమ్మ చేసిన తప్పు. దాన్ని పట్టుకుని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడటం ఇంకో తప్పు. కారణం ఏమిటంటే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. తర్వాత కొద్దినెలల వ్యవధిలోనే పార్లమెంటు ఎన్నికలు జరిగాయి. అంటే తెలంగాణలో పార్లమెంటుఎన్నికలు జరిగే నాటికి అధికారంలో ఉన్నది కాంగ్రెస్ పార్టీయే. అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్లజాబితాలతోనే పార్లమెంటు ఎన్నికలను కూడా ఎన్నికల కమీషన్ నిర్వహించింది. అసెంబ్లీఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంటు ఎన్నికలకు ఎన్నికల కమీషన్ ప్రత్యేకంగా ఓటర్ల సవరణను చేయలేదు.
అంటే అసెంబ్లీ ఎన్నికల్లో ఉపయోగించిన ఓటర్ల జాబితాలనే ఎన్నికల కమీషన్ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఉపయోగించింది. పార్లమెంటు ఎన్నికల్లో దొంగఓట్లతోనే బండి సంజయ్ ఎంపీగా గెలిచారంటే అది కాంగ్రెస్ పార్టీ చేతకానితనమే అవుతుంది. ఎలాగంటే కరీంనగర్లోని ఒక ఇంట్లో 40 ఓట్లున్నాయంటే మరి స్ధానిక కాంగ్రెస్ పార్టీ నేతలు ఏమిచేస్తున్నారు. ఒక ఇంట్లో 40 దొంగఓట్లున్నాయని తెలిసినపుడు అప్పట్లోనే ఈవిషయాన్ని ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకెళ్ళి ఓటర్లజాబితాలో నుండి ఎందుకు తీయించలేదు అని ఎవరైనా అడిగితే బొమ్మ ఏమి సమాధానం చెబుతారు ? చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయకుండా ఎన్నికలు జరిగిపోయిన దాదాపు 20 నెలల తర్వాత దొంగఓట్ల గురించి ఆరోపణలు చేస్తే ఏమిటి ఉపయోగం ? ఇప్పటికైనా కరీంనగర్లోని ఆ ఇంట్లోని 40 ఓట్లు దొంగఓట్లా ? సక్రమమైన ఓట్లేనా అని కాంగ్రెస్ పార్టీ నిర్ధారించుకున్నదా ? డౌటే.