డీసీపీపై హత్యాయత్నం.. రంగంలోకి సీపీ

డీసీపీ చైతన్య జరిపిన కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయన్న హైదరాబాద్ సీపీ సజ్జనార్.

Update: 2025-10-25 15:10 GMT

హైదరాబాద్ చాదర్‌గాట్ ప్లే గ్రౌండ్ సమీపీంలో డీసీపీ సాయి చైతన్యపై సెల్ దొంగలు కత్తితో దాడికి యత్నించారు. దాంతో వారిపై డీసీపీ కాల్పులు జరిపారు. గాయపడిన నిందితుడికి నాంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. కాగా అంశంపై దర్యాప్తుకు పోలీస్ కమిషనర్ సజ్జనార్ రంగంలోకి దిగారు. ఘటనా స్థిలిని పరిశీలించి, అసలు ఏం జరిగింది అన్న వివరాలను తెలుసుకున్నారు. డీసీపీ జరిపిన కాల్పుల్లో ఇద్దరు దొంగలకు గాయాలయ్యాయని, పోలీసుల చేతికి ఒకరు చిక్కారని తెలిపారు. అతడి పేరు ఒమర్ అని, అతనిపై 25 కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉందని వెల్లడించారు. ఈ కేసుపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. మరో దొంగ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

ఇదిలా ఉంటే శనివారం సాయంత్రం సీపీ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశానికి డీసీపీ సాయి చైతన్య హాజరయ్యారు. మీటింగ్ ముగించుకుని బయటకు వస్తున్న క్రమంలో ఇద్దరు దొంగలు సెల్‌ఫోన్ చోరీ చేసి పారిపోతుండటాన్ని గమనించారు. వెంటనే వారిని పట్టుకోవడం కోసం డీసీపీ సాయి చైతన్య, అతని గన్‌మ్యాన్‌ వెంబడించారు. వెంటనే దొంగల్లో ఒకరు తన దగ్గర ఉన్న కతితో డీసీపీపై దాడికి యత్నించాడు. గన్‌మ్యాన్‌పై దాడి చేశాడు. దాంతో కింద పడిన సాయి చైతన్య వెంటనే తేరుకుని.. నిందితులపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో గాయపడి ఒక దొంగ పోలీసుల చేతికి చిక్కాడు.

ఒమర్‌పై రెండు సార్లు పీడీ యాక్ట్ కేసులు..

ఈ ఘటనలో పోలీసుల చేతికి చిక్కిన ఒమర్ అనే నిందితుడిపై రెండు సార్లు పీడీ చట్టం కింద కేసులు నమోదయ్యాయని సీపీ సజ్జనార్ చెప్పారు. 2016లో కామటిపురం పీఎస్‌లో ఒక పీడీ కేసు నమోదు కాగా.. అతడు ఏడాది జైల్లో ఉన్నాడు. 2020లో హుస్సేనీ ఆలమ్ పీఎస్‌లో రెండో పీడీ యాక్ట్ కేసు నమోదు కావడంతో ఏడాది పాటు చంచల్‌గూడ జైల్లో ఉన్నాడని సజ్జనార్ వెల్లడించారు. ఆ తర్వాత కూడా ఒమర్ ప్రవర్తన మారలేదని, కాలాపత్తర్ పీఎస్‌లో మరో రెండు కేసులు అతడిపై ఉన్నాయని సీపీ తెలిపారు.

Tags:    

Similar News