‘దేశం చూపు తెలంగాణ వైపు’.. కులగణనపై డిప్యూటీ సీఎం భట్టి

సమగ్ర కుటుంబ సర్వేకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించడం కోసం అధికారులు, ప్రభుత్వం సిద్ధమవుతోంది.

Update: 2024-11-09 09:08 GMT

సమగ్ర కుటుంబ సర్వేకు తెలంగాణ సన్నద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ సర్వే నిర్వహించడం కోసం అధికారులు, ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సమగ్ర కుటుంబ సర్వేపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో కూడా సమావేశం నిర్వహించారు. తాజాగా ఈ విషయంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోకస్ పెట్టారు. జిల్లాల కలెక్టర్లు, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ సహా ఇతర శాఖల ఉన్నతాధికారులతో శనివారం ఉదయం ఆయన సమావేశం నిర్వహించారు. ఇందులో సమగ్ర కుటుంబ సర్వేపై సమీక్షించారు. అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. హౌస్ లిస్టింగ్‌ను పూర్తి చేసి శనివారం నుంచే కుటుంబ సర్వే నిర్వహించాలని చేప్పారు. అధికారులు సమన్వయం పాటించాలని, ఎన్యుమరేటర్లతో కలెక్టర్లు విస్తృతంగా మాట్లాడాలని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించాలని, కమ్యునికేషన్ గ్యాప్ లేకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. కుల గణన చేపట్టిన నేపథ్యంలో దేశమంతా కూడా తెలంగాణవైపే చూస్తోందని అన్నారు. సర్వే సమయంలో ప్రజలకు అనేక రకాల సందేహాలు కలుగుతాయిని, వాటన్నింటిని నివారించాల్సిన బాధ్యత అధికారులకే ఉంటుందని, ఎన్యుమరేటర్లకు కలెక్టర్లకు మధ్య పరస్పర కమ్యునికేషన్ ఉంటే ప్రజల సందేహాలను సులభంతా తీర్చొచ్చని భట్టి వివరించారు.

‘‘ప్రజలకు వచ్చే అన్ని సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలి. ప్రజల సందేహాలు వెంటనే నివృత్తి అయ్యేలా చర్యలు చేపట్టాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ సర్వేలు భాగస్వాములు అయ్యేలా చూడాలి. ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుంది. ఈ సర్వేపై ప్రతి అధికారి కూడా విస్తృతమైన ప్రచారం చేయాలి. ఎక్కడా అలసత్వం అనేది లేకుండా సర్వేను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి. ఈ సమగ్ర కుటుంబ సర్వే ద్వారా రాష్ట్ర అభివృద్ధి వేగవంతంమవుతుంది’’ అని భట్టి వివరించారు.

కుల గణన సాగుతుందిలా..

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టి కులగణన.. 6 నవంబర్ 2024 నుంచి ప్రారంభమైంది. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులాల ఆధారంగా ఈ సర్వే జరగనుంది. ఇందులో వీటికి సంబంధించిన అన్న వివరాలను అధికారులు పొందుపర్చనున్నారు. ఈ సర్వేకు ప్రజలు పూర్తి సహకారం అందించాలని ప్రభుత్వం ఇప్పటికే కోరింది. ఎవరూ కూడా తప్పుడు సమాచారం ఇవ్వొద్దని, అలా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇదిలా ఉంటే సర్వేలో భాగంగా తొలి రెండు రోజులు అధికారులు, సిబ్బంది వెళ్లి ప్రతి ఇంటికీ సర్వే స్టిక్కర్ అంటించారు. 9 నవంబర్ 2024 నుంచి పూర్తి స్థాయిలో సర్వేను మొదలుపెట్టారు. ఈ సర్వేలో భాగంగా మొత్తం 75 ప్రశ్నలను ప్రతి కుటుంబ సమాచారాన్ని అధికారులు సేకరిస్తారు. వీటిలో మొత్తం 56 ప్రధాన ప్రశ్నలు ఉండగా, 19 అనుబంధ ప్రశ్నలు ఉంటాయని అధికారులు ఇప్పటికే ప్రకటించారు.

అలా చేస్తే చర్యలు తప్పవు

సమగ్ర కులాల సర్వే ప్రశాంతంగా ఎలాంటి అనుమానాలు లేకుండా జరిగేలా చూడాలని తెలంగాణ బీసీ కమిషన్ కోరింది. రాజకీయ పార్టీలు, విభేదాలకు అతీతంగా సర్వేకు సహకరించాలని కమిషన్ కోరింది.బీసీ కమిషన్ వద్ద సొంతంగా యంత్రాంగం, సిబ్బంది లేనందున ఈ సమగ్ర సర్వేను ప్లానింగ్ శాఖ కు అప్పగించడం జరిగిందని బీసీ కమిషన్ ఛైర్మన్ నిరంజన్ చెప్పారు. ప్లానింగ్ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సమగ్ర కులాల సర్వేలో ఎలాంటి లోపాలు లేకుండా చేయాలని ఆయన ఆదేశించారు. ఎన్యుమరేటర్లు ఏ రోజు, ఏ ప్రాంత కుటుంబాలకు వెళతారో స్పష్టంగా ముందస్తుగా ఆ కుటుంబాలకు సమాచారం అందించేలా సూపర్ వైజర్ లు, ఉన్నతాధికారులు ప్రయత్నించాలని బీసీ కమిషన్ సూచించింది. కనీసం ఒకరోజు ముందే ఆ సమాచారాన్ని అందించాలని ఆదేశించింది.ప్రజలు సర్వేకు , సమాచార సేకరణకు వచ్చే ఎన్యూమరేటర్లకు అన్ని విధాల సహకరించాలని బీసీ కమిషన్ కోరింది. ఎక్కడైనా లోపాలుంటే వారు ఇచ్చిన సమాచారం దుర్వినియోగం అయ్యే పరిస్థితులు ఉంటే జిల్లా కలెక్టర్లకు గాని లేదా బీసీ కమిషన్ కు గాని తెలియజేస్తే తగు చర్యలు తీసుకుంటామని ఛైర్మన్ నిరంజన్ చెప్పారు. ఎక్కడైనా, ఎవరైనా అధికారులు గానీ ఎన్యుమరేటర్లు కానీ ప్రజలు కానీ తప్పుడు సమాచారాన్ని నమోదు చేస్తే వారిపై చట్టబద్ధమైన కఠిన చర్యలు తీసుకుంటామని బీసీ కమిషన్ హెచ్చరించింది.

Tags:    

Similar News