పులుల దినోత్సవ వేళ ‘ధృవ’ దత్తత, ఎవరు తీసుకున్నారంటే...
అంతర్జాతీయ పులుల దినోత్సవ వేళ ఓ తెల్లపులికి మహర్దశ పట్టింది.;
By : Saleem Shaik
Update: 2025-07-29 13:20 GMT
హైదరాబాద్ నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ‘ధ్రువ’ పేరిట పెరుగుతున్న విశిష్ఠ తెల్లరంగు పులికి మహర్దశ పట్టింది. హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌లో మంగళవారం అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని పాఠశాల విద్యార్థుల సమక్షంలో వైభవోపేతంగా జరిపారు. పులులను సంరక్షించుకుందామనే నినాదంతో విద్యార్థులు జూపార్కు ఉద్యోగులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలోని వీఐపీ ఇంటర్నషనల్ స్కూలు పీఆర్వో హెచ్ ఎం హనీఫుల్లా జూపార్కులో ధృవ పేరుతో ఉన్న తెల్ల రంగు పులిని ఏడాది పాటు దత్తత(Majestic White Tiger Dhruva Adopted) తీసుకున్నారు.
రూ.3లక్షల చెక్కు ప్రదానం
ధృవ తెల్లరంగు పులికి ఏడాది పాటు ఆహారం, నిర్వహణ కోసం వీఐపీ ఇంటర్నేషనల్ స్కూలు పీఆర్వో హెచ్ ఎం హనీఫుల్లా రూ.3లక్షల చెక్కును జూపారకు డిప్యూటీ క్యూరేటర్ ఎం బర్నోబాకు అందజేశారు. ఈ సందర్భంగా వీఐపీ ఇంటర్నేషనల్ స్కూలుకు చెందిన 500 మంది విద్యార్థులు జూపార్కులోని తెల్లరంగు పులిని చూసి పరవశించిపోయారు.
టైగర్ డే అవార్డులు
గ్లోబల్ టైగర్ డే 2025లో భాగంగా పులుల పరిరక్షణ కోసం విశేష కృషి చేసిన అటవీశాఖ అధికారులకు టైగర్ డే (Tiger Day Awards) అవార్డులను అందజేశారు.టైగర్ ట్రాకింగ్, అగ్గి నుంచి అడవుల రక్షణ, పులుల ఆవాసాల మెరుగుదలకు సమర్ధంగా పనిచేసిన ఉత్తమ బీట్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు, బేస్‌క్యాంప్ వాచర్లకు ప్రశంసా పత్రాలు, నగదు అవార్డులను అందజేశారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్‌కు చెందిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎండీ.ఖాదర్ పాషా నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ నుంచి వైల్డ్‌లైఫ్ హాబిటాట్ మేనేజ్‌మెంట్ విభాగంలో విశిష్ఠ జాతీయ అవార్డును అందుకున్నారు. ఫారెస్ట్ రేంజి ఆఫీసర్లు కె ఈశ్వర్, ఎన్ వీరేష్ లు పులుల వేటను సమర్ధంగా నిరోధించి అవార్డులు పొందారు. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పి కిరణ్ కుమార్, ఎన్ రమేష్, జి అనుషా, మండ్లీ బయ్యన్నలకు అవార్డులను ప్రదానం చేశారు.