కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలపబోతున్న డీఎంకే

ఈనెల 22వ తేదీన చెన్నైలో జరగబోయే సమావేశంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాల్గొంటున్నారు.;

Update: 2025-03-14 05:31 GMT
DMK leaders with Revanth and KTR

ఇన్నిసంవత్సరాలుగా ఉప్పు-నిప్పుగా ఉన్న అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ మొదటిసారి ఒకేవేదికను పంచుకోబోతున్నాయి. ఈనెల 22వ తేదీన చెన్నైలో జరగబోయే సమావేశంలో రేవంత్ రెడ్డి, కేటీఆర్ పాల్గొంటున్నారు. కేంద్రప్రభుత్వం అమలుచేయబోతున్న డీ లిమిటేషన్(Delimitation) గురించి అందరికీ తెలిసిందే. డీ లిమిటేషన్ అంటే పార్లమెంటు(Parliament) నియోజకవర్గాల సంఖ్య పెరుగుదల లేకపోతే తరుగుదల. జనాభా ఆధారంగా పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్యను పెంచి, తగ్గించబోతున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆప్రకటనపై ఇండియా(INDIA)తో పాటు మరికొన్ని రాజకీయపార్టీలు తీవ్రంగా మండిపోతున్నాయి. కారణం ఏమిటంటే 1970వ దశకంలో అప్పటి కేంద్రప్రభుత్వం ప్రకటించిన జనాభా నియంత్రణ చట్టాన్ని దక్షిణాధి రాష్ట్రాలు పక్కాగా అమలుచేశాయి. ఇదేసమయంలో ఉత్తరాధి రాష్ట్రాలు పెద్దగా పట్టించుకోలేదు.

అప్పటి జనాభా నియంత్ర(Family planning)ణే ఇపుడు దక్షిణాధి రాష్ట్రాల(South States)కు శాపంగా తయారైంది. కారణం ఏమిటంటే జనాభా ఆధారంగా కేంద్రం చేయబోయే డీ లిమిటేషన్ వల్ల దక్షిణాధి రాష్ట్రాల్లో పార్లమెంటు నియోజకవర్గాలు తగ్గిపోయి ఉత్తరాధి రాష్ట్రాల్లో పెరుగుతాయని కొన్నిపార్టీలు పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నాయి. జనాభా నియంత్రణ ఆధారంగా చేయబోతున్న డీలిమిటేషన్ ప్రక్రియను ఇండియా కూటమిలోని పార్టీలతో పాటు మరికొన్ని పార్టీలు కూడా తీవ్రంగా ఆక్షేపిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే దక్షిణాధి రాష్ట్రాల తరపున తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్(TamilNadu CM MK Stalin) చొరవ తీసుకున్నారు. అసలే ఆ రాష్ట్రంలో త్రిభాషా సూత్రం ముఖ్యంగా హిందీని బలవంతంగా రుద్దటంపై బాగా ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీనికి అదనంగా డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా స్టాలిన్ దక్షణాధి రాష్ట్రాలను ఏకంచేసే బాధ్యతను తీసుకున్నారు. అందుకనే సౌత్ స్టేట్స్ ముఖ్యమంత్రులు, ప్రతిపక్షపార్టీలతో 22వ తేదీన సమావేశం నిర్వహిస్తున్నారు.

ఈ సమావేశంలో పాల్గొనాలని ఆహ్వానించేందుకు డీఎంకే(DMK)లోని ఒక బృందం ఢిల్లీ పర్యటనలో రేవంత్(Revanth) ను కలిసింది. అలాగే మరోబృందం హైదరాబాద్ లోని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) తో భేటీఅయ్యింది. 22వ తేదీన జరగబోతున్న సమావేశంలో పాల్గొనేందుకు అటు రేవంత్ ఇటు కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. చెన్నైలో సమావేశానికి తాము హాజరవుతున్నట్లు రేవంత్, కేటీఆర్ ప్రకటించారు. ఇద్దరి తాజా ప్రకటనతో తెలంగాణలో ఉప్పు-నిప్పులాగున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకే వేదికను పంచుకోబోతున్నాయి. స్టాలిన్ తో పాటు కొందరి నిపుణులప్రకారం దక్షిణాధిలో సుమారు 40 సీట్లు తగ్గబోతున్నాయి. ఇందులో తెలంగాణ, ఏపీలో ఎనిమిదేసి పార్లమెంటు సీట్లు తగ్గబోతున్నాయని ప్రచారం జరుగుతోంది.

దక్షిణాధి ప్రాధాన్యత తగ్గించేందుకే : రేవంత్


పార్లమెంటులో దక్షిణాదిరాష్ట్రాల ప్రాధాన్యతను తగ్గించేందుకే నరేంద్రమోడీ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టబోతున్నట్లు రేవంత్ మండిపడ్డారు. మోడీ అనుకుంటున్నట్లు డీలిమిటేషన్ జరిగితే జాతీయ రాజకీయాల్లో లేదా పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రభావం బాగా తగ్గూపోతోందన్నారు. బీజేపీకి దక్షిణాదిరాష్ట్రాల్లో పెద్దగా బలంలేదన్న అక్కసుతోనే మోడీ(Narendra Modi) డీలిమిటేషన్ ప్రక్రియను బీజేపీ(BJP)కి అనుకూలంగా మార్చుకోవాలని కుట్రచేస్తున్నట్లు రేవంత్ ఆరోపించారు. తమ అధిష్ఠానంతో చర్చించి 22వ తేదీన చెన్నైలో సమావేశానికి తాను వెళతానని రేవంత్ ప్రకటించారు.

బీఆర్ఎస్ వాదన వినిపిస్తాం : కేటీఆర్


ఈనెల 22వ తేదీన చెన్నైలో స్టాలిన్ ఆధ్వర్యంలో జరగబోయే సమావేశానికి హాజరవబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. జనాభా ఆధారంగా కేంద్రం చేయాలని అనుకుంటున్న నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజనకు పార్టీలకు అతీతంగా మోడీ నిర్ణయంపై పోరాటాలు చేయాల్సిన అవసరం అందరిపైనా ఉందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. కుటుంబనియంత్రణను పకడ్బందీగా అమలుచేసిన తెలంగాణ, ఏపీ, కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించాలని అనుకోవటం మోడీ దుర్మార్గమైన చర్యగా కేటీఆర్ అభివర్ణించారు. సమావేశంలో పాల్గొని తమ పార్టీవాదాన్ని బలంగా వినిపించబోతున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రేవంత్, కేటీఆర్ ప్రకటనల ప్రకారం రెండుపార్టీలు అంటే ముఖ్యంగా రేవంత్, కేటీఆర్ 22న జరగబోయే సమావేశంలో పాల్గొనబోతున్నట్లు స్పష్టమైంది.

బీఆర్ఎస్ ఎందుకు పాల్గొంటోంది ?


జాతీయ రాజకీయ పరిణామాలను గమనించినపుడు ఒక విషయం స్పష్టంగా తెలుస్తుంది. అదేమిటంటే జాతీయరాజకీయాల్లో బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందని. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు చేతులు కలపటానికి ఇష్టపడలేదు. దీనికి కారణం ఏమిటంటే కేసీఆర్ ను ఎవ్వరూ నమ్మకపోవటమే. బెంగాల్ సీఎం మమతాబెనర్జీ, ఒడిస్సా సీఎం(మాజీ) నవీన్ పట్నాయక్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, ఢిల్లీ సీఎం(మాజీ) అరవింద్ కేజ్రీవాల్ తో కేసీఆర్ భేటీ అయిన విషయం గుర్తుండే ఉంటుంది. ముఖ్యమంత్రిగా వచ్చారు కాబట్టి ఇతర ముఖ్యమంత్రులు కూడా బాగానే రిసీవ్ చేసుకున్నారు. పట్టుశాలువాలు కప్పారు, భోజనాలు పెట్టారు, మీడియా సమావేశాల్లో పాల్గొన్నారు. అంతే, తర్వాత ఎవరు కూడా కేసీఆర్ ను పట్టించుకోలేదు.

నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఆకాశమే హద్దుగా చెలరేగిపోయిన కేసీఆర్ ఎన్డీయే, యూపీఏ కూటములకు ప్రత్యామ్నాయంగా మూడోకూటమిని ఏర్పాటు చేస్తానని, అవకాశం వస్తే ప్రధానమంత్రి అవుతానని కూడా ప్రకటించారు. ఎన్నిసార్లు మోడీకి వ్యతిరేకంగా మాట్లాడినా ఇండియా కూటమిలోని ముఖ్యమంత్రులు, పార్టీలఅధినేతలు కేసీఆర్ తో చేతులు కలపటానికి ఇష్టపడలేదు. దాంతోనే జాతీయ రాజకీయాల్లో తన స్ధానం ఏమిటన్నది కేసీఆర్ కు అర్ధమయ్యుంటుంది. తర్వాత 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత కేసీఆరే ఫామ్ హౌస్ నుండి బయటకు రావటమే మానుకున్నారు. తన ఒంటెత్తు వైఖరి వల్లే జాతీయరాజకీయాల్లో బీఆర్ఎస్ ఒంటరైపోయింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చక్రంతిప్పాలంటే ముందు ఏదో ఒక కూటమిలో చేరాల్సిందే తప్ప వేరేదారిలేదు.

ఎందుకంటే, తెలంగాణలో ఉన్న పార్లమెంటు సీట్లే 17. ఈ 17 సీట్లనూ బీఆర్ఎస్ గెలుచుకున్నా కేసీఆర్ ను ఎవరూ పట్టించుకోరు. కారణం ఏమిటంటే ఇంతకు రెండింతలు, మూడింతల సీట్లున్న రాష్ట్రాలు ఉత్తరాధిలో ఉన్నాయి. మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో అత్యధిక పార్లమెంటు సీట్లు గెలుచుకున్న పార్టీల అధినేతలే జాతీయ రాజకీయాల్లో చక్రంతిప్పుతారు. అంతేకాని అగ్గిపుట్టిస్తాను, భూకంపాలు తెప్పిస్తానని ప్రకటించే అధినేతలు ఏమీ చేయలేరు. రాష్ట్రపతి, ఉపారాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా జరిగిన సమావేశాలకు ఇండియా కూటమి పార్టీలు పిలిచినా కేసీఆర్ హాజరుకాలేదు. ఆ తర్వాత నుండి కేసీఆర్ ను జాతీయ రాజకీయాల్లో ఎవరూ పట్టించుకోవటంలేదు.

డీఎంకే కే క్రెడిట్


కాంగ్రెస్, బీఆర్ఎస్ ను ఒకే వేదికమీదకు తీసుకొస్తున్న క్రెడిట్ డీఎంకేకె దక్కుతుంది. ఇండియాకూటమిపార్టీలు ఎన్నిసార్లు పిలిచిన కేసీఆర్ సమావేశాలకు హాజరుకాలేదు. తర్వాత పరిణామాల్లో కేసీఆర్ ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితమైపోయారు. దాంతో జాతీయస్ధాయిలోని ఏ పార్టీ కూడా బీఆర్ఎస్ ను పట్టించుకోవటంలేదు. నిజానికి ఇపుడు బీఆర్ఎస్ కు లోక్ సభలో బలం సున్నా. అయినా సరే అసెంబ్లీలో బలమైన ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అందుకనే బీఆర్ఎస్ ను కలుపుకుని వెళ్ళాల్సిన అవసరాన్ని స్టాలిన్ గుర్తించారు. అందుకనే ప్రత్యేకంగా తనమంత్రివర్గంలోని కే ఎన్ నెహ్రూ, ఎంపీ ఎన్ ఆర్ ఇళంగోతో పాటు మరికొందరు నేతలను ప్రత్యేకించి కేసీఆర్ దగ్గరకు పంపించారు.

ఇదేసమయంలో కేసీఆర్ పార్టీభవిష్యత్తుపై స్వీయసమీక్ష చేసుకున్నారేమో. డీలిమిటేషన్ రూపంలో అందివచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలని డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే తాను హాజరుకాకపోయినా కొడుకు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకత్వంలో బృందాన్ని చెన్నైకి పంపాలని డిసైడయ్యారు. మంచిదే, ఇతర పార్టీలతో కలిసి నడవాలన్న కేసీఆర్ ఆలోచన మంచిదే. 22వ తేదీ తర్వాత పరిణామాలు ఎలాగ మారుతాయో చూడాలి.

Tags:    

Similar News