ట్రాఫిక్ చలాన్లు చెల్లించకపోతే ఏమిజరుగుతుందో తెలుసా ?
చలాన్లు చెల్లించకపోతే వాహనాన్ని స్పాట్ లోనే స్వాధీనం చేసుకునే అధికారాలను సంబంధిత అధికారులకు చట్టం ఇచ్చింది.
ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఇప్పటివరకు ఒకలెక్క ఇకముందు నుండి మరో లెక్క అన్నట్లుగా చట్టం తయారైంది. మోటారు వాహనాల చట్టానికి కేంద్రప్రభుత్వం సవరణలు చేసింది. సవరణలు ముఖ్యంగా ట్రాఫిక్స్ నిబంధనలను ఉల్లంఘించిన వారికి వేసే చలాన్ల చెల్లింపుకు సంబంధించిందే. ఇప్పటివరకు ట్రాఫిక్స్ చలాన్లు(Traffic challans) చెల్లించకపోయినా పోలీసులు(Traffic police) పెద్దగా పట్టించుకోవటంలేదు. నిజానికి చలాన్లు వేసిన దగ్గరనుండి 90 రోజుల్లోపు వాహనయజమనాలు చలాన్లను చెల్లించాలి. కొందరు చెల్లిస్తుండగా మరికొందరు ఎన్నినెలలైనా చెల్లించటంలేదు. ఎక్కడైనా ట్రాఫిక్ లో పట్టుబడిన యజమానులను పెండింగులో ఉన్న చలాన్లగురించి మాట్లాడితే పోలీసులపైన దాడులు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే.
ఈనేపధ్యంలోనే కేంద్రప్రభుత్వం చలాన్లచెల్లింపు విషయంలో కఠినమైన నిబంధనలను తీసుకొచ్చింది. కొత్త చట్టం డ్రాఫ్టు నోట్ ను కేంద్రం ప్రకటించింది. వివిధ వర్గాలనుండి అభ్యంతరాలను తీసుకున్న తర్వాత అవసరమైతే సవరణలు చేసి తొందరలోనే కొత్తచట్టాన్ని అమల్లోకి తీసుకురాబోతోంది.
సవరించిన కొత్తచట్టంలో నిబంధనలు ఈ క్రిందివిధంగా ఉన్నాయి:
1. మోటారు వాహన చట్టం ప్రకారం వాహనంపై ఐదుకు మించిన చలాన్లు పెండింగులో ఉంటే డ్రైవింగ్ లైసెన్సును సస్పెండ్ చేయచ్చు.
2. చలాన్లను 45 రోజుల్లోగా చెల్లించాల్సిందే.
3. చలాన్లు చెల్లించకపోతే వాహనాన్ని స్పాట్ లోనే స్వాధీనం చేసుకునే అధికారాలను సంబంధిత అధికారులకు చట్టం ఇచ్చింది.
4. 45రోజుల్లోగా చలాన్లు చెల్లించకపోతే వాహనంపై రవాణాశాఖ లావాదేవీలను నిషేధిస్తుంది. అంటే సదరు వాహనాన్ని అమ్మటం, కొనటం జరగదు.
5. లైసెన్సు అడ్రస్, పేరుమార్పుతో వాహనం రిజిస్ట్రేషన్ రెన్యువల్ కూడా కుదరదు.
6. ఇపుడు చలాన్లు వాహనం యజమాని పేరుపైనే జారీ అవుతున్నాయి. యజమాని వాహనాన్ని ఎవరు నడిపినా, నిబంధనలను ఉల్లంఘిస్తే చలాన్లు యజమాని పేరుకే వస్తున్నాయి.
7. నిబంధన ఉల్లంఘించినపుడు తాను బండిని డ్రైవ్ చేయలేదని యజమాని నిరూపిస్తే బండిని ఎవరైతే నడిపారో సదరు వ్యక్తి బాధ్యుడవుతాడు. చలాన్లు కూడా నిబందనలను ఉల్లంఘించిన వ్యక్తే చెల్లించాలి.
చలాన్ల ద్వారా రు. 150 కోట్లు
అందుబాటులోని రికార్డుల ప్రకారం తెలంగాణ మొత్తంమీద 2024లో ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు 1.67 కోట్ల చలాన్లను వాహనదారులు చెల్లించారు. 1.67 కోట్ల చలాన్లచెల్లింపు వల్ల పోలీసు శాఖకు రు. 150 కోట్ల ఆదాయం వచ్చింది. వాహనయజమానులు చెల్లించాల్సిన చలాన్లు ఇంకా లక్షల్లోనే పెండింగులో ఉన్నాయి. హైదరాబాద్, సైబరాబాద్ పరిధిలో వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు 2024లో 1.20 కోట్ల చలాన్లు జారీచేశారు. అలాగే హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో మాత్రమే 96.82 కోట్ల చలాన్లను వాహన యజమానులు డిస్కౌంట్ డ్రైవ్ లో చెల్లించారు. 2025, ఆగష్టు నెలవరకు చలాన్ల రూపంలో పోలీసు శాఖ సుమారు 57కోట్ల రూపాయలు వసూలు చేసింది. గ్రేటర్ పరిధిలో టూవీలర్, ఫోర్ వీలర్, ఆటోలు అన్నీ కలుపుకుని సుమారు 1.5 కోట్ల వాహనాలున్నాయి.
నెంబర్ ప్లేట్లు సరిగా డిస్ ప్లే చేయకపోవటం, రాంగ్ పార్కింగ్, రాంగ్ రూటులో ప్రయాణించటం, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయటం, లైసెన్స్, ఆర్సీ పత్రాలను చూపించకపోవటం, త్రిబుల్ రైడింగ్ లాంటి నిబంధనల ఉల్లంఘనల కారణంగా ట్రాఫిక్ పోలీసులు వాహన యజమానాలకు ఫైన్ వేసి చలాన్లను జారీచేస్తుంటారు. వచ్చిన ఆదాయంలో అత్యధికంగా హైదరాబాద్ పరిధిలో రు. 37.14 కోట్లు వసూలు అయితే అతి తక్కువగా ములుగు జిల్లాలో రు. 19.15 కోట్లు వసూలైంది. కొందరు యజమానులు అయితే సంవత్సరాల తరబడి వందలాది చలాన్లను చెల్లించటంలేదు. కరీంనగర్, మహబూబ్ నగర్, హైదరాబాదులోని ఓల్డ్ సిటిలో కొందరు యజమానులను పోలీసులు ఆపి చలాన్లు చెల్లించమని అడిగినపుడు వాళ్ళు తమవాహనాలను తగులబెట్టిన సంఘటనలు అందరికీ గుర్తుండే ఉంటాయి. యజమానులు అలా వాహనాలను ఎందుకు తగలబెట్టారంటే వాహనం విలువకు మించి కట్టాల్సిన చలాన్ల ఫైన్ ఉండటమే కారణం.