కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వును వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 సెక్షన్ 36 ఎ ప్రకారం తదుపరి ఉత్తర్వులు వెలువరించే దాకా జీఓఎంఎస్ నంబరు 49ను నిలిపివేస్తూ జులై 21వతేదీన నంబరు 3602/ఫర్.1/(1)/2025 పేరిట కేవలం మెమోను అటవీశాఖ జారీ చేసింది. మహారాష్ట్రలోని తాడోబా- అంథేరి టైగర్ రిజర్వు నుంచి తెలంగాణలోకి పులులు రాకపోకలు సాగించేలా టైగర్ కారిడార్ ను కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్ గా తెలంగాణ పర్యావరణ,అటవీ, శాస్త్ర సాంకేతిక విభాగం మే 30వతేదీన జీఓఎంఎస్ నంబరు 49 ను జారీ చేసింది.టైగర్ కారిడార్ కు వ్యతిరేకంగా జిల్లాలో ఆదివాసీలు, గిరిజనులు చేసిన ఆందోళనలపై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ ఈ నెల 11వతేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్సీ నంబరు ఈ1 /1086/2025 తో లేఖ రాశారు. ఈ లేఖతోపాటు గిరిజన మంత్రి సీతక్క, గిరిజన ఎమ్మెల్యేలు, ఎంపీలు చేసిన వినతితో స్పందించిన సీఎం జారీ చేసిన ఆదేశాలతో అటవీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీం జీఓ 49ను నిలుపుదల చేస్తున్నట్లు సోమవారం కేవలం మెమో జారీ చేశారు.
నిలుపుదల కాదు రద్దు చేయాలి : కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్
ఆదివాసీలు, గిరిజనులు చేస్తున్న ఆందోళనతో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఉద్యమాన్ని చల్లార్చేందుకు తెలంగాణ అటవీ శాఖ కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వు జీఓ ఎంఎస్ నంబరు 49ను తాత్కాలికంగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకూ నిలుపుదల చేసినట్లు మెమో మాత్రమే జారీ చేశారని కాగజ్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ జీఓను రద్దు చేసేదని, దీన్ని తాత్కాలికంగా కంటితుడుపు చర్యగా నిలిపివేశారని హరీష్ తెలిపారు. పులుల కోసం గిరిజనులను దెబ్బతీసే ఈ జీఓను రద్దు చేసే దాకా తాము పోరాడుతామని ఆయన ప్రకటించారు.
ఉద్యమం కొనసాగిస్తాం : కొట్నాక విజయకుమార్, తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు
కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వు జీఓ 49ను శాశ్వతంగా రద్దు చేసే దాకా తామ ఉద్యమం కొనసాగిస్తామని తెలంగాణ తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు కొట్నాక విజయకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 28వతేదీన ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట గిరిజనులు, ఆదివాసీల సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేస్తామని ఆయన చెప్పారు.జీఓను రద్దు చేసే దాకా భవిష్యత్ లో ఉద్యమ కార్యాచరణ రూపొందించి అమలు చేస్తామని ఆయన తెలిపారు. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 సెక్షన్ 36 ఎ ప్రకారం తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యాన్ని మహారాష్ట్రలోని తడోబా-అంథారీ టైగర్ రిజర్వుతో అనుసంధానిస్తూ కొమురంభీం టైగర్ కారిడార్ ను శాశ్వతంగా రద్దు చేసే వరకూ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గిరిజన సంఘాలు ఆందోళనను కొనసాగిస్తామని ప్రకటించాయి.
సీఎంకు గిరిజన ప్రజాప్రతినిధుల సత్కారం
మరోవైపు కుమురం భీం కన్జర్వేషన్ రిజర్వును నిలిపివేస్తూ జారీ చేసిన మెమో నేపథ్యంలో గిరిజన మంత్రి సీతక్క, గిరిజన ప్రజాప్రతినిధులు వెడ్మ బొజ్జు ఇతర నాయకులు సీఎంను సత్కరించారు. గిరిజనుల మనోభావాలను గౌరవించి జీవోను నిలుపుదల చేశారని వారు పేర్కొన్నారు. వాస్తవానికి మహారాష్ట్రలోని తాడోబా- అంథేరి పులుల అభయారణ్యంలో పులుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. దీంతో ఆ పులులకు కావాల్సిన టెరిటరీ మహారాష్ట్రలో లేదు. మహారాష్ట్ర పులులు కొమురం భీం అటవీ ప్రాంతం గుండా తెలంగాణలోని కవ్వాల్ పులుల అభయారణ్యంలోకి వలస వస్తున్నాయి.