Eatala | ఈటల మెడపై ‘కాళేశ్వరం’ కత్తి ?
ఈటల(Eatala Rajendar)కు కూడా కాళేశ్వరం(Kaleshwaram Project) పాపంలో భాగముందని స్పష్టంగాచెప్పారు;
సీనియర్ నేత, బీజేపీ మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ మెడపై కాళేశ్వరం రిపోర్టు కత్తిలాగ వేలాడుతోంది. ఆ కత్తి ఈటల మెడకు ఎప్పుడు తగులుతుందో తెలీటంలేదు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలపై విచారణ జరిపిన జస్టిస్ పీసీ ఘోష్(Justice PC Ghosh) తన రిపోర్టులో ఈటల పాత్రను కూడా ప్రముఖంగా ప్రస్తావించారు. కేసీఆర్(KCR), ఇరిగేషన్ శాఖ మంత్రిగా పనిచేసిన తన్నీరు హరీష్ రావు(Harish Rao)తో పాటు అప్పట్లో ఆర్ధికశాఖ మంత్రిగా ఉన్న ఈటల(Eatala Rajendar)కు కూడా కాళేశ్వరం(Kaleshwaram Project) పాపంలో భాగముందని స్పష్టంగాచెప్పారు. రాష్ట్రఆర్ధికపరిస్ధితి ఏమాత్రం బాగాలేకపోయినా ప్రాజెక్టుల అంచనాలను సవరించుకుంటు పోయేందుకు ఈటల అనుమతించినట్లు ఘోష్ చెప్పారు. ఘోష్ రిపోర్టుపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయమై ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth) ప్రభుత్వం తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతోంది. అందులో కేసీఆర్, హరీష్ తో పాటు ఈటల మీద కూడా చర్యలు తీసుకోవాలని మెజారిటి సభ్యులు తీర్మానం చేసే అవకాశముంది. అప్పుడు మిగిలిన ఇద్దరితో పాటు ఈటల మీదకూడా ప్రభుత్వం ఫిర్యాదులు చేసి కేసులు నమోదుచేయించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఈటల మీద కేసునమోదైతే పార్టీ ఏ విధంగా రియాక్టవుతుంది ? అసలే ఎంపీకి చాలామంది సీనియర్ నేతలతో పడటంలేదనే ప్రచారం జరుగుతోంది. కేంద్రమంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డితో ఈటలకు పడదని పార్టీలోనే టాక్ వినబడుతోంది. అధ్యక్షపదవి కోసం పోటీపడి ఈటల భంగపడ్డారు. ఈటలకు అధ్యక్షపదవి ఇవ్వకపోవటానికి కేసీఆర్ వైపు మొగ్గుచూపుతున్నారనే ఫిర్యాదులు పార్టీ సీనియర్ల నుండి జాతీయ నాయకత్వానికి అందినట్లు సమాచారం. కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైనపుడు కేసీఆర్ కు అనుకూలంగా ఈటల వాగ్మూలమిచ్చారు. అయితే బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైనపుడు కాళేశ్వరంపై ఈటల అనేక ఫిర్యాదులు చేశారు. అప్పట్లో చేసిన ఫిర్యాదులకు ఇపుడు విరుద్ధంగా వాగ్మూలమిచ్చారు. ఈవిషయాన్ని కొందరు సీనియర్లు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేయటంతోనే అధ్యక్షపదవి రేసు నుండి ఈటలను తప్పించినట్లు తెలుస్తోంది.
నిజానికి ఈటల ఆలోచనలకు బీజేపీ భావజాలానికి పూర్తిగా చుక్కుదురు. విద్యార్ధిదశనుండి పీడీఎస్యూలో పనిచేసిన ఈటలకు బీజేపీ సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధం. అయితే బీఆర్ఎస్ నుండి కేసీఆర్ తనను బహిష్కరించటంతో వేరేదారిలేక బీజేపీలో చేరారు. బీజేపీలో అయితే చేరారుకాని పార్టీలో ఇమడలేకపోతున్నట్లు తెలిసిపోతోంది. కేంద్రమంత్రులు జీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ తో ఈటలకు ఏమాత్రం పడదు. అలాగే పార్టీలోని మరో బీసీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తో కూడా పెద్దగా సఖ్యతలేదు. చేవెళ్ళ, మెదక్ ఎంపీలు కొండా విశ్వేశ్వరరెడ్డి, మాధవనేని రఘునందనరావుతో కూడా సంబంధాలు అంతంతమాత్రమే. ఈటల ఐదుసార్లు అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహించిన హూజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో పదవుల విషయంలో బండి-ఈటల మధ్య బహిరంగంగా ఎంత గొడవైందో అందరు చూసిందే.
బీఆర్ఎస్ నుండి బహిష్కరణకు గురైనపుడు కాళేశ్వరం-కేసీఆర్ ప్రాజెక్టులపై ఈటల తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఘోష్ కమిషన్ విచారణకు హాజరైన ఎంపీ అప్పట్లోచేసిన ఆరోపణలకు విరుద్ధంగా మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్రహ్మాండమని, ప్రాజెక్టు నిబంధనల ప్రకారమే నిర్మించారని, ప్రాజెక్టుకు క్యాబినెట్ అనుమతి ఉందని ఇలా చాలానే మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ నిర్మించటం తెలంగాణ అదృష్టమన్నట్లుగా చెప్పటంతో అందరు ఆశ్చర్యపోయారు. ఈటల కమిషన్ విచారణకు హాజరయ్యే నాలుగురోజుల ముందే పార్టీలోని ఎంపీలు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు మీడియా సమావేశంలో మాట్లాడుతు కాళేశ్వరం ప్రాజెక్టును కేసీఆర్ కుటుంబం ఏటీఎంలాగ వాడుకున్నట్లు ఆరోపించారు. ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలకు పాల్పడిన కేసీఆర్ కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తాము చేసిన డిమాండుకు కమిషన్ విచారణలో ఈటల చెప్పిన మాటలకు విరుద్ధంగా ఉండటంతో పార్టీలోని ప్రజాప్రతినిధులు మండిపోయారు.
అప్పటినుండే ఈటల వైఖరిని పార్టీనేతలు అనుమానించటం మొదలుపెట్టారు. అందుకనే కమిషన్ విచారణలో ఈటల చెప్పిన వాగ్మూలానికి పార్టీకి సంబంధంలేదని కొందరునేతలు మీడియా సమావేశంపెట్టి మరీ వివరణ ఇచ్చుకున్నారు. ఈటల వైఖరిని గమనించిన పార్టీ నేతలకు ఎందుకో అనుమానాలు బయలుదేరినట్లున్నాయి. అందుకనే ఎంపీ వైఖరికి వ్యతిరేకంగా కొందరు నేతలు జాతీయనాయకత్వానికి ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. ఈకారణంగానే అధ్యక్షపదవి రేసు నుండి ఈటలను జాతీయ నాయకత్వం తప్పించి ఎన్ రామచంద్రరావును నియమించింది. జరుగుతున్నది చూస్తుంటే పార్టీలో ఈటల దాదాపు ఒంటరైపోయినట్లు అర్ధమవుతోంది.
సరిగ్గా ఈపరిస్ధితుల్లోనే కమిషన్ రిపోర్టులో కేసీఆర్, హరీష్ తో పాటు ఈటలను కూడా జస్టిస్ ఘోష్ తప్పుపట్టారు. కాళేశ్వరం పాపంలో ఈటలకు కూడా పాత్రఉందని తేల్చారు. కాళేశ్వరం, మేడిగడ్డ ప్రాజెక్టుల నిర్మాణం వల్ల తెలంగాణకు భారీనష్టం వస్తుందని తెలిసినా ఆర్ధికశాఖ మంత్రిగా ఈటల మౌనంగా ప్రతిపాదనలను ఆమోదించటాన్ని కమిషన్ తప్పుపట్టింది. ఈటలను ‘నిశ్శబ్ద నేరస్తుడు’గా జస్టిస్ ఘోష్ అభివర్ణించారు. ఈనేపధ్యంలో తొందరలోనే అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. సమావేశాల్లో కమిషన్ రిపోర్టును ప్రవేశపెట్టి చర్చించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. చర్చల తర్వాత బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న నిర్ణయం జరుగుతుందని అన్నారు. కేసీఆర్, హరీష్ తో పాటు ఎంపీమీదకూడా చర్యలు తీసుకోవాలని అసెంబ్లీ తీర్మానం చేస్తే అప్పుడు బీజేపీలో ఈటల పరిస్ధితి ఏమిటి ? అన్నది ఆసక్తిగా మారింది.