ఓటింగ్ పై ‘గ్రేటర్’ దెబ్బ

అందుకనే ఎన్నిక ఎన్నికకు ఓటింగ్ తగ్గిపోతోంది. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటు ఓటింగ్ 55 గా నమోదైంది.

Update: 2024-05-04 03:31 GMT

చాలా దేశాల్లో ఓట్లు వేయటం బాధ్యతగా భావిస్తారు. జనాలు ఓట్లు వేయటాన్ని కొన్ని ప్రభుత్వాలు చట్టాలు చేశాయి. ఏకారణం చేతనైనా ఓట్లు వేయకపోతే సంక్షేమపథకాలు ఆగిపోతాయి. కొన్ని దేశాల్లో అయితే ఓట్లు వేయనివారికి శిక్షలు కూడా విధిస్తారు. ఆస్ట్రేలియా, బెల్జియం, బ్రెజిల్ లాంటి 22 దేశాల్లో పౌరులు ఓట్లేసితీరాలి. ఆస్ట్రేలియాలో అయితే ఓట్లు వేయనివారు 20 డాలర్లు ఫైన్ కట్టాలి. కాని ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా చెప్పుకునే మనదేశంలో మాత్రం ఓటింగ్ విషయంలో చాలా నిర్లిప్తత కనబడుతోంది. ఎందుకంటే ఇక్కడ ఓటింగ్ కంపల్సరీ కాదు. కాబట్టి పోలింగ్ రోజున కేంద్రాలకు వెళ్ళటం, క్యూలైన్లలో నుల్చోవటం, ఓపికగా వెయిట్ చేసి ఓట్లేయటం ఇష్టం ఉండదు.

అందుకనే ఎన్నిక ఎన్నికకు ఓటింగ్ తగ్గిపోతోంది. మొన్ననే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సగటు ఓటింగ్ 55 గా నమోదైంది. తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో అయినా ఓటింగ్ శాతం పెంచటంపై ఎన్నికల కమీషన్ దృష్టిపెట్టింది. ఇందులో భాగంగానే యంగిస్ధాన్ లాంటి అనేక స్వచంధ సంస్ధలు, యువజన సంఘాలతో కలిసి కమీషన్ అనేక చైతన్య కార్యక్రమాలను చేస్తోంది. శుక్రవారం నగరంలోని అనేక ప్రాంతాలు అంటే కాలేజీలు, షాపింగ్ మాల్స్, ట్యూషన్ సెంటర్లు, జనాలు గుమిగూడే ప్రాంతాల్లో మ్యూజిక్ ప్రోగ్రాములు, ఫ్లాష్ మాబ్ లు, ఓటు వేయాలనే విషయమై నినాదాలు రాసిన ప్లకార్డులను ప్రదర్శించింది. అపార్ట్ మెంట్ కాంప్లెక్సులు, గేటెడ్ కమ్యూనిటీ అసోసియేషన్లతో కూడా ఎన్నికల కమీషన్ ఆధ్వర్యంలో స్వచ్చంధ సంస్ధల ప్రతినిధులు, యువజనసంఘాల సమావేశాలు నిర్వహిస్తున్నాయి.

 

2019 లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ ఓటింగ్ శాతం 44.8, సికింద్రాబాద్ 46.5, మల్కాజ్ గిరి 49.5, చేవెళ్ళ 53.2 శాతం నమోదైంది. పై నాలుగు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనే సుమారు 28 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గ్రేటర్ హైదరాబాద్ అంటే చాలా పెద్ద నగరం కాబట్టి జనాలంతా ఓటింగ్ విషయంలో చాలా బాధ్యతగా ఉంటారని, ఎవరికివారుగా స్వచ్చంధంగా వచ్చి ఓట్లేస్తారని అనుకుంటారు. కాని అదిపూర్తిగా తప్పు. చదువుకున్న, ఉద్యోగులున్న గ్రేటర్ పరిధిలోనే ఓటింగ్ శాతం చాలా తక్కువగా నమోదైంది. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో సుమారు 80 లక్షల మంది ఓటర్లున్నారు. గడచిన లోక్ సభ ఎన్నికల్లో ఓటింగ్ కు రాని జనాలు గ్రేటర్లోనే ఎక్కువున్నారు.

పోలింగ్ రోజున ప్రభుత్వం ఎలాగు సెలవు ఇస్తుంది కాబట్టి హ్యాపీగా సినిమాలకు, షాపింగులకు, ఔటింగులకు వెళిపోతున్నారు. ఇవేవీకాదంటే ఇంట్లోనో లేకపోతే ఫ్రెండ్సంతా కలిసి ఎక్కడో కూర్చుని ఎంజాయ్ చేసేస్తున్నారు. అందుకనే ఓటింగ్ కు గైర్హాజరు కాకుండా ప్రతి ఒక్కళ్ళు బాధ్యతగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓట్లేయాలని కేంద్ర ఎన్నికల కమీషన్ మొత్తుకుంటోంది. ఇందులో భాగంగానే ప్రముఖులతో ఓటు విలువగురించి తెలియజేస్తోంది. గ్రేటర్ పరిధిలో మొదటిసారి ఓట్లేయబోతున్న వారి సంఖ్య సుమారు 5 లక్షలుంటుంది. కాబట్టి యువతలో ఓటింగ్ విషయంలో బాగా ఆసక్తి పెరిగేట్లుగా స్వచ్చంధసంస్ధలు, యువజన సంఘాలతో కలిసి ఎన్నికల కమీషన్ చైతన్య కార్యక్రమాలను నిర్వహిస్తోంది.

 

చైతన్య కార్యక్రమాల్లో ఎవరికి ఓట్లేయాలన్న విషయాన్ని ప్రస్తావించటంలేదు. ఎవరికి ఓట్లేయాలన్నది ఎవరిష్టం వాళ్ళదే. ‘ఎవరికైనా ఓటేయండి..కాని ఓటు మాత్రం కచ్చితంగా వేయండి’ అన్నదే ఎన్నికల కమీషన్ నినాదం. మరి తొందరలో జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఓటర్లు ముఖ్యంగా యువత ఏమిచేస్తుందో చూడాలి.

Tags:    

Similar News