జానీ మాస్టర్ పై పోక్సో కేసు
జూనియర్ కోరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు జానీపై పోక్సో చట్టం కూడా ప్రయోగించారు.
సినీ కోరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టు ఉచ్చు మరింత బిగుసుకుంది. తాజాగా జానీపై పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రం సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదైంది. జూనియర్ కోరియోగ్రాఫర్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరిపిన పోలీసులు జానీపై పోక్సో చట్టం కూడా ప్రయోగించారు. జానీని అరెస్టు చేయటానికి ప్రత్యేకంగా నాలుగు బృందాలను ఏర్పాటుచేశారు. నాలుగు రోజులుగా పరారీలో ఉన్న డాన్స్ మాస్టర్ ఉత్తరప్రదేశ్ లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అందుకని నాలుగు బృందాల్లో ఒక బృందం ఉత్తర ప్రదేశ్ కు వెళ్ళారు.
జానీ ఉంటున్నాడని తెలుసుకున్న పోలీసు బృందం సడెన్ గా ఆ నివాసంపై దాడిచేసింది. అయితే పోలీసులు తనకోసం వస్తున్నారని ముందే తెలుసుకున్న జానీ అప్పటికే అక్కడినుండి పారిపోయాడు. అవకాశాలు ఇవ్వాలంటే తనను శాటిస్ ఫై చేయాల్సిందే అని పదేపదే జాని తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, కొన్నిసార్లు అత్యాచర ప్రయత్నాలు కూడా చేసినట్లు సహాయకురాలిగా పనిచేసిన బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే జానీ భార్య తనను మతం మారాలని బాగా ఒత్తిడి చేసిందని, కొన్నిసార్లు తనపైన దాడి కూడా జరిగినట్లు బాధితురాలు ఫిర్యాదులో చెప్పింది. తాను మైనర్ గా ఉన్నప్పటి నుండే జానీ, అతని భార్య తనను బాగా వేధించేవారని బాధితురాలు చెప్పారు.
జానీ వేధింపులకు తట్టుకోలేక బాధితురాలు సొంతంగా కోరియాగ్రఫీ చేసుకోవటం మొదలుపెట్టింది. అయితే తనకున్న పరిచయాల కారణంగా జానీ బాధితురాలి కెరీరపైన దెబ్బకొట్టాడు. జానీ కారణంగానే తనకు అవకాశాలు వచ్చినట్లే వచ్చి చేజారిపోయిందని బాదితురాలు రాయదుర్గం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో చెప్పింది.
జానీ వ్యవహారం ఎప్పుడైతే వెలుగుచూసిందే వెంటనే చిత్రపరిశ్రమలోని కొందరు సీనియర్లు బాధితురాలికి అండగా నిలిచారు. లైగింక వేధింపులపై టాలీవుడ్ లో ఒక ప్యానల్ ఏర్పాటైంది. ఈ ప్యానల్ ఇప్పటికే కొన్ని ఆరోపణలపై విచారణ కూడా జరిపింది. జానీ మాస్టర్ వేధింపులపై కొన్ని ఆధారాలు దొరికినట్లు ప్యానల్ ప్రకటించింది. ఇదే సమయంలో జానీకి వ్యతిరేకంగా కొన్ని మహిళా సంఘాలు రాష్ట్ర మహిళా కమీషన్ ను కలవాలని డిసైడ్ అయ్యాయి. వెంటనే జానీపై కేసులు నమోదుచేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయబోతున్నాయి. జానీ దొరికేంతలోపు కేసు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే.