గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల మరణ మృదంగం,ట్వీట్లతో రాజుకున్న రాజకీయ రగడ

గాంధీ ఆసుపత్రిలో చిన్నారుల మరణాలు చర్చనీయాంశంగా మారాయి. 50 మంది శిశువులు, 14 మంది తల్లులు మృత్యువాతపై కేటీఆర్, మంత్రి రాజనర్సింహల మధ్య రాజకీయ రగడ రాజుకుంది.

Update: 2024-09-19 02:13 GMT

హైదరాబాద్ నగరంలోని గాంధీ ఆస్పత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో నెల రోజుల్లో 50 మంది చిన్నారులు, 14 మంది తల్లులు మృతి చెందారు.పౌష్టికాహార లోపం వల్ల ఆగస్టు నెలలోనే 14 మంది గర్భిణులు, 50 మంది నవజాత శిశువులు మృతి చెందినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

- అధికారిక సమాచారం ప్రకారం కేవలం గాంధీ ఆసుపత్రిలోనే ఇంతమంది పిల్లల మరణాలు సంభవిస్తే, అనధికారిక సమాచారం ప్రకారం గత 8 నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇంకా ఎంత మంది గర్భిణులు,చిన్న పిల్లలు మరణించారనేది ప్రశ్నార్థకంగా మారింది.


గాంధీ ఆసుపత్రిలో సమస్యలెన్నో...
గాంధీలోని రాజీవ్ ఆరోగ్యశ్రీ మెడికల్ కోఆర్డినేటర్‌గా ప్రొఫెసర్ లేదా సీనియర్ డాక్టర్‌కు బదులుగా రిటైర్డ్ జూనియర్ అసిస్టెంట్ రామయ్యను నియమించారు.కుటుంబ,ఆరోగ్య శాఖ పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలలుగా జీతాలు ఇవ్వలేదు.అనుభవజ్ఞులైన వైద్యులు గ్రామాలకు వలస వెళ్లారు.గాంధీలో హై రిస్క్ కేసులకు వైద్యులు చికిత్స అందించలేక పోతున్నారు. దీని కారణంగా మరణాలు పెరుగుతున్నాయి.కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ 6 నెలల నుంచి నిలిపివేశారు.

హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించండి : కేటీఆర్
గాంధీ ఆసుపత్రిలో 82 మంది మరణించింది వాస్తవం కాదా అని కేటీఆర్ ఎక్స్ పోస్టులో ప్రశ్నించారు.తెలంగాణలో డెంగీ జ్వరాలతో పాటు చిన్నారులు మరణిస్తున్నారని, అందుకే రాష్ట్రంలో హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మందులకు పైసలు లేవు పేద ప్రజల ఆరోగ్యం పట్ల ప్రభుత్వానికి బాధ్యత లేదా? అని ఆయన ప్రశ్నించారు. ‘‘అరాచక కాంగ్రెస్ పాలనలో గురుకులాల్లో పిల్లలకు బువ్వ లేదు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేద ప్రజల ప్రాణాలకు విలువ లేదు’’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు.

గాంధీ ఆసుపత్రిపై బురద చల్లవద్దు : మంత్రి రాజనర్సింహ

గాంధీ ఆస్పత్రిలో శిశు మరణాలు పెరిగాయన్న కేటీఆర్ ఆరోపణల్లో వాస్తవం లేదని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ చెప్పారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లేందుకు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి హామీ ఇచ్చారు. ఈ ఆగస్టులో గాంధీ ఆసుపత్రిలో తల్లులు, పిల్లల మరణాలకు సంబంధించిన డేటాతో కేటీఆర్ చేసిన ట్వీట్‌పై మంత్రి రాజనరసింహ స్పందించారు. గాంధీ హాస్పిటల్‌పై బురద జల్లి, ఇక్కడికి ట్రీట్‌మెంట్ కోసం వచ్చే నిరుపేదల మనో స్థైర్యాన్ని దెబ్బతీయడం బాధాకరమని మంత్రి పేర్కొన్నారు.

బీఆర్ఎస్ హయాంలో ప్రభుత్వ ఆసుపత్రులను దెబ్బతీశారు...

‘‘గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో కార్పొరేట్ హాస్పిటళ్లు ఏ విధంగా ఎదిగాయో ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ దవాఖాన్లను ఎలా దెబ్బతీశారో కూడా జనాలు మర్చిపోలేదు. గాంధీ, ఉస్మానియా వంటి ప్రభుత్వ దవాఖాన్లను పది సంవత్సరాల పాటు నాశనం చేసిన బీఆర్‌‌ఎస్, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి కూడా అదే తరహా కుట్రలు చేయడం సిగ్గుచేటు’’అని మంత్రి రాజనర్సింహ ఎక్స్ లో పేర్కొన్నారు. గాంధీ వంటి హాస్పిటళ్లకు అత్యంత విషమంగా ఉన్న పేషెంట్లు వస్తారు. చివరి నిమిషం వరకూ వాళ్ల రోగాన్ని నయం చేసి, ఎలాగైనా వాళ్లను బ్రతికించేందుకు డాక్టర్లు తమ శక్తిమేర ప్రయత్నిస్తారు. అప్పటికే పరిస్థితి విషమంగా ఉండడం వల్ల కొంత మంది ప్రాణాలు కోల్పోతారు.అందుకే దేశంలోని ఏ టెర్షియరీ కేర్ హాస్పిటల్‌లోనైనా, ప్రతి నెలా పదుల సంఖ్యలో మరణాలు జరుగుతుంటాయని ఆయన వివరించారు.

నేను పాత గాంధీలోనే పుట్టిన...
‘‘గాంధీ దవాఖానకు వచ్చేది దొర జనం కాదు, నా జనం. నేను కూడా పాత గాంధీ హాస్పిటల్‌లోనే పుట్టిన. నా జనాల బాగోగులు చూసుకోవడం నా బాధ్యత అని ఇదివరకే చెప్పాను. మళ్లీ చెబుతున్నాను.బీఆర్‌‌ఎస్ కుట్రలను నమ్మి భయపడకండి. ధైర్యంగా వచ్చి చికిత్స చేయించుకోండి’’ అని మంత్రి రాజనర్సింహ రోగులకు పిలుపునిచ్చారు.


Tags:    

Similar News