అనర్హులకు రేషన్ బియ్యం,రూ.600 కోట్ల అధిక వ్యయం
తెలంగాణలో అనర్హులకు రేషన్‌బియ్యం ఇస్తున్నారా? అంటే అవునంటోంది ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్. బోగస్ రేషన్‌కార్డులను ఏరివేయకుండా, కొత్త రేషన్ కార్డులు ఇస్తామంటున్నారు
By : The Federal
Update: 2024-09-19 15:54 GMT
తెలంగాణ రాష్ట్రంలో వచ్చే నెల నుంచి కొత్త రేషన్ కార్డులు జరీచేసేందుకు వీలుగా ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలు సేకరించి విధివిధానాలు నిర్ణయిస్తామని నీటిపారుదల మరియు సివిల్ సప్లయిస్ శాఖా మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి ప్రకటించారు.
- తెలంగాణ రాష్ట్ర జనాభా 4 కోట్ల మంది కాగా నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం రాష్ట్రంలో 13.74శాతం మంది జనాభా దారిద్య్రరేఖకు దిగువన ఉన్నారు. ఇక ఇతర సర్వేల ప్రకారం తెలంగాణలో పేదల శాతం అంటే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలు రాష్ట్ర జనాభాలో 20శాతం లోపే.
- రాష్ట్రంలోని నాలుగు కోట్ల జనాభాలో 80 లక్షల మంది పేదలు ఉన్నారు.అంటే వీరందరి ఆహార భద్రత కోసం 20 లక్షల రేషన్ కార్డులు ఇవ్వాలి.కానీ 2.84 కోట్ల మందికి 90 లక్షల రేషన్ కార్డులు ప్రస్థుతం ఉన్నాయి. అంటే సుమారు 70 లక్షల రేషన్ కార్డులు రెండు కోట్లమంది అనర్హుల వద్ద ఉన్నాయని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ చెబుతోంది.
- రాష్ట్రంలో ప్రస్థుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి 90 లక్షల రేషన్ కార్డుల ద్వారా 2.84 కోట్ల జనాభాకు బియ్యం ఇస్తున్నామని సాక్షాత్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.
ఇంటింటి సర్వే అవసరం
రాష్ట్రంలోని రెండు కోట్ల మందికి 6 కిలోల చొప్పున మొత్తం 12 కోట్ల కిలోల బియ్యాన్ని ఉచితంగా నెల నెలా ఇస్తున్నారు. అంటే సుమారు రూ.600 కోట్ల విలువ గల బియ్యం అనర్హులకు ఇస్తున్నారని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అంచనా వేసింది.అనర్హుల వద్ద ఉన్న బోగస్ రేషన్ కార్డులను ఏరివేయాల్సిన అవసరముందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు యం పద్మనాభరెడ్డి చెప్పారు.అనర్హులను గుర్తించేందుకు ఇంటింటి సమగ్ర సర్వే జరపాలని ఆయన సూచించారు.
ఓట్ల కోసం అనర్హులకు రేషన్ కార్డులా?
గత ప్రభుత్వం కేవలం ఓట్ల కోసం 75శాతం జనాభాకు రేషన్ కార్డులు ఇచ్చిందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రెసిడెంట్ యం పద్మనాభరెడ్డి ఆరోపించారు.ఈ దుష్ట సంప్రదాయాన్ని ప్రస్థుత ప్రభుత్వం ఆపాలని ఆయన సూచించారు.దారిద్య్రరేఖకు దిగువన ఉన్న పేదలకు ఉచిత బియ్యంతో పాటు ఒక కిలో పప్పు, ఒక లీటరు వంటనూనె కూడ ఇస్తే వారికి ఎంతో సహాయమవుతుందని ఆయన చెప్పారు.
పక్కదారి పడుతున్న రేషన్ బియ్యం
రేషన్ బియ్యాన్ని అనర్హులకు పంపిణీ చేస్తుండటంతో అది పక్కదారి పడుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వార ఉచితంగా ఇచ్చిన బియ్యాన్ని చాలామంది ప్రజలు తక్కువ ధరకు మద్య దళారులకు విక్రయిస్తున్నారు. ఈ రేషన్ బియ్యాన్ని కొన్న దళారులు దీన్ని కోళ్ల ఫారంలకు, అలాగే రోడ్డు పక్కన ఉన్న చిన్న చిన్న హోటళ్లకు అధిక ధరకు విక్రయిస్తున్నారని యం పద్మనాభరెడ్డి చెప్పారు.
బోగస్ కార్డులు ఏరివేయాలి : ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్
మంత్రి ప్రకటనను హైదరాబాద్ కు చెందిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వాగతిస్తూ ఈ విషయంలో పలు సూచనలు చేసింది.రాష్ట్రంలో ఉన్న బోగస్ కార్డులతో పాటు అనర్హుల వద్ద రేషన్ కార్డులను రద్దు చేయాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ డిమాండ్ చేసింది. జనవరి నెల నుంచి రేషన్ కార్డులపై మేలు రకమైన సన్న బియ్యం ఇస్తామని ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు.
ప్రజాధనం దుర్వినియోగం చేయవద్దు
ప్రజలు చెల్లించిన పన్నులతో జమచేసిన డబ్బును సమగ్ర సర్వే చేయకుండా పేదల పేరుతో రాష్ట్రంలోని 75శాతం జనాభాకు ఉచితంగా బియ్యం ఇవ్వడం సరైంది కాదని యం పద్మనాభరెడ్డి చెప్పారు.బోగస్ రేషన్ కార్డులు ఏరివేసి దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 20శాతం జనాభాకు మాత్రమే రేషన్ కార్డులు ఇవ్వాలని ఆయన కోరారు. పేదలకు ఉచిత బియ్యం పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు యం పద్మనాభరెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సమర్పించిన వినతిపత్రంలో కోరారు.