హైడ్రా తర్వాత టార్గెట్ మూసీయేనా ?

తొందరలోనే మూసీ నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రెడీ అవుతున్నది. ఆక్రమణదారులకు నోటీసులు కూడా రెడీ అవుతున్నాయి.

Update: 2024-09-19 05:29 GMT
Hydra and Musi river

ఆక్రమణల తొలగింపులో హైడ్రా స్పష్టమైన టార్గెట్ ఫిక్స్ చేసుకుని ముందుకు వెళుతోంది. మాదాపూర్, దుర్గంచెరువు తదితర ప్రాంతాల్లో దాదాపు రెండునెలలు చెరువులు, కాల్వలు, కుంటల ఆక్రమణలను క్లియర్ చేసిన హైడ్రా తన తర్వాత టార్గెట్ ను ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. తొందరలోనే మూసీ నదికి రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించేందుకు రెడీ అవుతున్నది. ఆక్రమణదారులకు నోటీసులు కూడా రెడీ అవుతున్నాయి. వారంలోగా అందరికీ నోటీసులు అందేట్లుగా హైడ్రా అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఒకపుడు జంటనగరాలకు మంచినీటిని అందించి ఇపుడు మురికికూపంగా తయారైన మూసీ నదిని సుందరీకరించాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. ముసీనది సుందరీకరణకు టాప్ ప్రయారిటి ఇస్తున్నట్లు రేవంత్ చాలాసార్లు ప్రకటించారు. ఈమధ్యనే దక్షిణకొరియా పర్యటనలో కూడా సియోల్ లో సుందరీకరించిన చంగ్ యే చున్ నదిని ప్రత్యక్షంగా చూసొచ్చారు.



 చంగ్ యే చున్ నదికి మన మూసీకి చాలా దగ్గర పోలికలున్నాయి. మూసీలాగే ఒకపుడు సియోల్ జనాలకు మంచినీటిని అందించిన నది తర్వాత మురికికూపంగా మారిపోయింది. దాన్ని అధ్యయనం చేసిన సియోల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ప్రభుత్వ సహకారంతో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. చంగ్ యే చున్ నది సుందరీకరణ జరిగిన విధానానికి సంబంధించిన యాక్షన్ ప్లన్ మొత్తాన్ని రేవంత్ పరిశీలించారు. అదే పద్దతిలో మూసీని కూడా ప్రక్షాళన చేస్తేకాని సుందరీకరణ సాధ్యంకాదని డిసైడ్ అయ్యారు. పైగా వరల్డ్ బ్యాంకు నిధులతో టేకప్ చేయబోయే ప్రాజెక్టు కాబట్టే వరల్డ్ బ్యాంకు నిబంధనలన్నింటినీ పాటించాల్సిందే తప్ప వేరేదారిలేదు. అలాంటి నిబందనల్లో కీలకమైనది ఏమిటంటే మూసీకి రెండువైపులా ఉన్న ఆక్రమణలను తొలగించటం. ప్రపంచబ్యాంకు నుండి అప్పు తీసుకోవాలంటే ఏదైనా గ్యారెంటీ చూపించాలి. అందుకనే మూసీకి రెండువైపులా ఆక్రమణలను తొలగిస్తే ప్రభుత్వానికి కావాల్సినంత భూమి దొరుకుతుంది.



 నగరంలో సుమారు 57 కిలోమీటర్ల మేర మూసీనది ప్రవహిస్తోంది. ఇదంతా మురికికూపమనే చెప్పాలి. దాని పక్కనుండి వెళ్ళే వాళ్ళు ముక్కులు మూసుకుని ప్రయాణం చేయాల్సిందే. ప్రపంచబ్యాంకు నిబంధనల ప్రకారం ఆక్రమణలను తొలగించి ల్యాండ్ బ్యాంకును చూపిస్తేనే రుణం మంజూరవుతుంది. అందుకనే దీనికోసం రేవంత్ ప్రత్యేకంగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎంఆర్ ఎఫ్డీసీఎల్)ను ఏర్పాటు చేశారు. మూసీకి రెండువైపులా ఆక్రమణలను తొలగించే బాధ్యత రేవంత్ హైడ్రాకు అప్పగించారు. మూసీకి రెండువైపులా తాత్కాలిక, శాశ్వత నిర్మాణాలున్నాయి. రెండువైపులా ఆక్రమణలను తొలగిస్తే సుమారు 30 వేల ఎకరాలు ప్రభుత్వం చేతిలోకి వస్తుందని ఒక అంచనా. ఇందులో సుమారు కొంత భాగాన్ని అంటే 120 కోట్ల చదరపు అడుగుల స్ధలాన్ని రియల్ ఎస్టేట్, వాణిజ్య, వర్తక, వినోధ రంగాలకు కేటాయించాలని రేవంత్ ఇప్పటికే డిసైడ్ అయ్యున్నారు. దీని ద్వారానే ప్రభుత్వానికి వేలాది కోట్ల రూపాయలు సమకూరుతుంది.



 మూసీకి రెండువైపులా తొలగింపులో ముఖ్యంగా దిగువ మధ్య, పేదలే ఎక్కువగా ఉన్నారని ప్రభుత్వం దగ్గర లెక్కలున్నాయి. కాబట్టి ఆక్రమణల తొలగింపులో భాగంగా నివాసితులందరినీ లెక్కేసి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించి ఇవ్వాలని ఇప్పటికే రేవంత్ సంబంధిత ఉన్నతాధికారులను ఆదేశించారు. ఆక్రమణల తొలగింపులో సర్వం కోల్పోయే వాళ్ళ జాబితాను తొందరలోనే ప్రభుత్వం ప్రకటించబోతోంది. ఇలాంటి ఆక్రమణలను తొలగింపు బాధ్యతనే ప్రభుత్వం హైడ్రాకు అప్పగించింది. నదికి రెండువైపులా బఫర్ జోన్, ఫుల్ ట్యాంక్ లెవల్ అన్నదాంతో సంబంధంలేకుండా ఆక్రమణలు నదిలోనే చేసేసుకున్నారు. కాబట్టి వాటన్నింటినీ కూల్చేయాల్సిందే. ఇళ్ళతో పాటు చాలామంది వ్యాపారస్తులు శాశ్వత పద్దతిలో పెద్ద పెద్ద గోదాములను కూడా నిర్మించుకున్నట్లు హైడ్రా ఇప్పటికే నివేదిక రెడీచేసింది. మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పనులు మొదలవ్వాలంటే ముందుగా ఆక్రమణలను క్లియర్ చేయాలి. ఆక్రమణలను క్లియర్ చేయటం కోసమే హైదరాబాద్, రంగారెడ్డి ఉమ్మడి జిల్లాల రెవిన్యు, పంచాయితీరాజ్, ఇరిగేషన్, మూసీ కార్పొరేషన్ అధికారులు సర్వే పూర్తిచేశారు.



 ఈ సర్వే ప్రకారం నార్సింగ్ నుండి నాగోల్ బ్రిడ్జి వరకు 25 కిలోమీటర్ల పరిధిలో 15 వేలకు పైగా ఆక్రమణలున్నట్లు అధికారులు గుర్తించారు. హైదరాబాద్ జిల్లాలోని అసిఫ్ నగర్, అంజర్ పేట్, బహదూర్ పురా, చార్మినార్, గోల్కొండ, హిమాయత్ నగర్, నాంపల్లి, సైదాబాద్ వరకు భారీ ఆక్రమణలను అధికారులు గుర్తించారు. వీటిల్లో కూడా బహదూర్ పుర, సైదాబాద్, అంబర్ పేట మండలాల్లో మ్యాగ్జిమమ్ ఆక్రమణలు జరిగినట్లు తేలింది. పేదలేమో 30-60 గజాల్లోపు స్ధలాలను ఆక్రమించుకుని ఇళ్ళు కట్టుకుంటే పెద్దలేమో ఏకంగా ఏర్పాటుచేసిన కాలనీల్లో ఇళ్ళు కొనేశారు. పెద్ద పెద్ద అపార్టమెంట్లు కూడా ఉన్నాయి.



 రంగారెడ్డి జిల్లాలోని గండిపేట, రాజేంద్రనగర్, సరూర్ నగర్, మేడ్చల్ జిల్లా ఉప్పల్ మండలం పరిధిలోని రామంతపూర్, భగాయత్ తదితర ప్రాంతాల్లో లే అవుట్లు వేసేసి కాలనీలే ఏర్పాటు చేసినట్లు అధికారులు గుర్తించారు. పైన చెప్పిన ప్రాంతాల్లో నదికి రెండువైపులా ఆక్రమణలను తొలగించే బాధ్యతను రేవంత్ హైడ్రాకు అప్పగించారు. పై శాఖలు సంయుక్తంగా నిర్వహించిన ఆక్రమణల జాబితా రిపోర్టు ప్రకారం హైడ్రా తొందరలోనే యాక్షన్లోకి దిగబోతున్నది. దిగితే కాని లోతు తెలీదన్నట్లుగా ఆక్రమణల తొలగింపుకు నడుంబిగిస్తే కాని హైడ్రాకు ఎదురయ్యే సమస్యలేమిటో తెలీవు.

Tags:    

Similar News