Poison mixed | పిల్లల మంచినీటిలో విషం కలిపిన టీచర్
పిల్లలు తాగే మంచినీటిలో విషం(Poison mixed)కలిపి సదరు అధికారిపై కక్షసాధించాలని అనుకున్న టీచర్ బాగోతం బయటపడింది;
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన టీచరే క్రూరంగా ఆలోచించాడు. స్కూలులో ఒక అధికారితో తనకున్న విభేదాలతో పిల్లలను బలిపశులను చేయాలని ప్లాన్ చేశాడు. పిల్లలు తాగే మంచినీటిలో విషం(Poison mixed)కలిపి సదరు అధికారిపై కక్షసాధించాలని అనుకున్న టీచర్ బాగోతం బయటపడింది. ఇంతకీ విషయం ఏమిటంటే భూపాలపల్లి గాంధీనగర్ కాలనీలో గురుకుల స్కూలుంది. ఇందులో 40మంది పిల్లలు(40 Students) చదువుకుంటున్నారు. గురుకుల స్కూల్ ప్రత్యేకాధికారి వెంకన్నతో స్కూలులోని ముగ్గురు టీచర్లకు చాలాకాలంగా పడటంలేదు. వీళ్ళ మధ్య విభేదాలు బాగా పెరిగిపోయాయి.
వెంకన్న మీద కక్షసాధించేందుకు సైన్స్ టీచర్ రాజేందర్ తో కలిసి మరో ఇద్దరు టీచర్లు పెద్ద ప్లాన్ వేశారు. శుక్రవారం రాత్రి పిల్లలు టిఫిన్ తిన్న తర్వాత వంటగదికి పక్కనే ఉన్న స్టీల్ క్యాన్లోని మంచినీటిని తాగారు. నీటిని తాగిన కొద్దిసేపటికే కొందరు పిల్లలు కడుపునొప్పంటు విలవిల్లాడిపోయారు. వీరిలో కొందరికి వాంతులు కూడా మొదలయ్యాయి. ఈవిషయాన్ని గమనించిన సిబ్బంది అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న 11 మంది పిల్లలను దగ్గరలోనే ఉన్న ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు వీళ్ళని పరీక్షించి తాగేనీటిలో ఎవరో విషం కలిపారని అనుమానం వ్యక్తంచేశారు.
11 మంది పిల్లలు ఆసుపత్రిలో చేరారని తెలియగానే ఎంఎల్ఏ గండ్ర సత్యానారాయణ, కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పీ కిరణ్ ఖరే కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న పిల్లలను ఎంఎల్ఏ మాట్లాడినపుడు వెంకన్నతో టీచర్లకు ఉన్న గొడవలను పిల్లలు వివరించారు. వెంటనే కలెక్టర్ ఆదేశాల ప్రకారం సిబ్బంది స్కూలుకు వెళ్ళారు. స్టీల్ ట్యాంకు నీటిలో విషం కలిపారని అర్ధమైంది. పిల్లలు తాగే మంచినీటిలో ఎవరో కావాలనే విషం కలిపినట్లు అర్ధమైంది. అలాగే పిల్లలు కప్పుకునే దుప్పట్లపైన కూడా ఏదో పొడి చల్లినట్లు కనబడింది. దాన్ని డాక్టర్లకు చూపించి ఆరాతీయగా వాసనను బట్టి పురుగుల మందుగా తేల్చారు. వెంటనే కలెక్టర్ రాజేంద్రతో పాటు మరో ఇద్దరు టీచర్లు వేణు, సూర్యకిరణ్, వంట కార్మికురాలు రాజేశ్వరిని సస్పెండ్ చేశారు. ఎంఈవో సేవానాయక్ ఫిర్యాదు ఆధారంగా పై నలుగురిపై కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు భూపాలపల్లి సీఐ నరేష్ కుమార్ తెలిపారు.