కోనేరు కోనప్ప బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పక తప్పదా ?

కోనప్ప నియోజకవర్గంలో ‘అన్నదానం కోనప్ప’గా బాగా పాపులర్;

Update: 2025-08-24 11:13 GMT
BRS former MLA Koneru Konappa

‘వచ్చే ఎన్నికల్లో సిర్పూర్ నుండే ఎంఎల్ఏగా పోటీచేస్తా’..ఇది తాజాగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన ప్రకటన. అసందర్భంగా ప్రవీణ్(RS Praveen) ప్రకటన చేయటం వెనుక పెద్ద కారణమే ఉంటుందని అనుమానంగా ఉంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా మూడున్నరేళ్ళుంది. ఈ నియోజకవర్గంలో బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంఎల్ఏ కోనేరు కోనప్ప(Koneru konappa) చాలా యాక్టివ్ గా ఉన్నారు. అలాంటిది సడెన్ గా ప్రవీణ్ మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్(BRS) తరపున తానే ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది ? చనిపోయినా నియోజకవర్గంలోనే సమాధి చేయాలని కుటుంబసభ్యులకు చెప్పానని ప్రవీణ్ అన్నారు. అంతేకాకుండా తాను దెయ్యం అయ్యి కూడా నియోజకవర్గాన్ని వదలబోయేది లేదని కూడా చెప్పారు. సిర్పూర్(ఎస్సీ) (Sirpur segment) సీటుపై ఎవరికీ అనుమానాలు అవసరంలేదని, తాను నియోజకవర్గాన్ని వదిలే ప్రశ్నేలేదని స్పష్టంగా ప్రకటించారు.

నిజానికి అసెంబ్లీ టికెట్టు, పోటీ, నియోజకవర్గాన్ని వదిలేదిలేదు, ఇక్కడే సమాధి చేయాలనే సెంటిమెంటు మాటలు చెప్పాల్సినంత అవసరం కూడా ఇపుడు ఏమీలేదు. అయినా ప్రవీణ్ సెంటిమెంటు డైలాగులు పేల్చారంటే వెనుక చాలా పెద్ద కతే ఉన్నట్లు అనుమానంగా ఉంది. ఇంతకీ ఆకత ఏమిటంటే మాజీ ఎంఎల్ఏ, సీనియర్ నేత కోనేరు కోనప్పకు పొగపెట్టడమే అనిపిస్తోంది. చాలాకాలంగా కోనప్ప బీఆర్ఎస్ నే అంటిపెట్టుకుని ఉన్నారు. 2004లో కాంగ్రెస్ ఎంఎల్ఏగా గెలిచిన కోనప్పకు 2009లో టికెట్ రాలేదు. 2014లో కూడా కాంగ్రెస్ టికెట్ దక్కకపోవటంతో కోనప్ప బీఎస్పీలో చేరి టికెట్ తెచ్చుకుని గెలిచారు. తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో బీఆర్ఎస్ లో చేరి 2018లో టికెట్ తెచ్చుకుని గెలిచారు.

అయితే 2023లో పోటీచేసిన కోనేరు, బీజేపీ అభ్యర్ధి పాల్వాయి హరీష్ చేతిలో ఓడిపోయారు. ఓడింది కూడా 3వేల ఓట్ల తేడాతోనే. కోనప్ప ఓటమికి ప్రధాన కారణం ఆర్ఎస్ ప్రవీణ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఐఏఎస్ అధికారిగా ఉద్యోగానికి రాజీనామా చేసిన ప్రవీణ్ రాజకీయాల్లోకి దిగారు. బీఆర్ఎస్ రాష్ట్రఅధ్యక్షుడిగా నియమితులైన ఆర్ఎస్ బీఎస్పీ టికెట్ తెచ్చుకుని సిర్పూరులో పోటీచేశారు. గెలిచిన పాల్వాయికి 63,702 ఓట్లు వస్తే, ఓడిన కోనప్పకు 60,614 ఓట్లొచ్చాయి. మూడో ప్లేసులో నిలిచిన ఆర్ఎస్ ప్రవీణ్ కు 44,646 ఓట్లొచ్చాయి. ప్రవీణ్ గనుక పోటీలో లేకుంటే కోనప్ప గెలిచుండేవారనే విశ్లేషణలు అప్పట్లో వినబడ్డాయి.

ఎందుకంటే కోనప్పకు మంచిపేరుంది. కోనప్ప నియోజకవర్గంలో ‘అన్నదానం కోనప్ప’గా బాగా పాపులర్. చాలాకాలంగా కోనప్ప నియోజకవర్గంలో పేదలకు ప్రతిరోజు అన్నదానం చేస్తున్నారు. అలాగే నియోజకవర్గంలోని అర్హులకు సంక్షేమపథకాలు అందేట్లు చేయటంలో కూడా విశేషంగా కృషిచేశారు. కాబట్టే కోనేరుకు నియోజకవర్గంలో మంచిపేరుంది. మంచిపేరున్నంత మాత్రాన గెలవాలనేమీ లేదు కాబట్టే జనాలు బీజేపీ అభ్యర్ధిని గెలిపించారు. సరే, ఇపుడు విషయం ఏమిటంటే సడెన్ గా రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయేది తానే అన్న ప్రవీణ్ తాజా ప్రకటనతో కోనేరు భవిష్యత్తు ఏమిటనే చర్చ ఒక్కసారిగా పెరిగిపోయింది.

కోనేరుకు పార్టీ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో మంచి సంబంధాలే ఉన్నాయి. అయినా 2023 ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో చేరిన ప్రవీణ్ కు ప్రాముఖ్యత బాగా పెరిగిపోయింది. కేసీఆర్ దగ్గర ఆర్ఎస్ కు మంచిమార్కులుపడుతున్నాయి. రాబోయే ఎన్నికల్లో పోటీచేయబోయేది తానే అని ప్రవీణ్ ఇంత గట్టిగా చెప్పారంటే కేసీఆర్ లేదా కేటీఆర్ నుండి గట్టి భరోసా వచ్చినట్లే ఉంది. రాజకీయాల్లో ఏరోజు ఏమి జరుగుతుందో ఎవరూ చెప్పలేరన్నది నిజమే అయినా కోనేరు లాంటి నేతలకు మాత్రం భవిష్యత్తుపై టెన్షన్ తప్పదు.

ఇపుడు విషయం ఏమిటంటే రాబోయే ఎన్నికల్లో సిర్పూరు టికెట్ ప్రవీణ్ కు ఖాయమైనట్లే ఉంది. ఈ నేపధ్యంలో మరి కోనేరు పరిస్ధితి ఏమిటి ? ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి నేత ఉన్నట్లు లేదు. ఎందుకంటే పోయినఎన్నికల్లో పోటీచేసిన రావిశ్రీనివాస్ కు 8,427 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీన్నిబట్టే రావి ఎంత బలహీనమైన నేతో అర్ధమవుతున్నది. బీఆర్ఎస్ లో టికెట్ రాదు, బీజేపీ సిట్టింగ్ ఎంఎల్ఏ పాల్వాయిని కాదని టికెట్ ఇంకొకరికి ఇవ్వదు. ఇక కోనేరుకు మిగిలిన ఆప్షన్ కాంగ్రెస్ లో చేరటమే అని అర్ధమవుతోంది. అందుకనే రేవంత్ ను కలిసి రాబోయే ఎన్నికల్లో టికెట్ పై హామీతీసుకుని కాంగ్రెస్ లో చేరమని కొందరు మద్దతుదారులు కోనేరుకు గట్టిగా చెబుతున్నారనే ప్రచారం జరుగుతోంది. చివరకు కోనేరు ప్రయాణం ఎటువైపో చూడాలి.

Tags:    

Similar News