బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల మృతి
ఇద్దరు ఐటి ఉద్యోగుల కుటుంబాలను కూడా శోకసముద్రంలోకి నెట్టేసింది
కర్నూలులో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన బస్సు ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు మరణించారు. బస్సుప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాధాన్ని నింపినట్లే ఇద్దరు ఐటి ఉద్యోగుల కుటుంబాలను కూడా శోకసముద్రంలోకి నెట్టేసింది. విషయం ఏమిటంటే బస్సుప్రమాదంలో ఏపీకి చెందిన గన్నమనేని ధాత్రి(27), తెలంగాణకు చెందిన అనూషారెడ్డి మంటల్లో సజీవదహనమయ్యారు. అందుబాటులోని వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లాలోని యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి బెంగుళూరులో ఉద్యోగం చేస్తోంది.
దీపావళి పండుగ సందర్భంగా హైదరాబాద్ లోని మేనమామ ఇంటికి వచ్చింది. మేనమామ కుటుంబంతో కలిసి పండుగను జరుపుకున్న ధాత్రి గురువారం రాత్రి బెంగుళూరుకు తిరుగుప్రయాణమైంది. ఇక అనూషారెడ్డి విషయం చూస్తే ఈమె యాదాద్రి భువనగిరి జిల్లాలోని గుండాల మండలం వస్తకొండూరు గ్రామానికి చెందిన ఉద్యోగి. అనూషా కూడా దీపావళికి ఇంటికి వచ్చింది. కుటుంబసభ్యులతో కలిసి దీపావళి జరుపుకున్నది. తిరిగి బెంగుళూరుకు వెళ్ళేందుకు హైదరాబాద్ చేరుకుని గురువారం రాత్రి ఖైరతాబాద్ లో బస్సు ఎక్కింది. ఏ రూపంలోను ఇద్దరికి ఎలాంటి సంబంధంలేకపోయినా మృత్యువే ఇద్దరినీ కలిపిందని అనుకోవాలి.
ఈ ఇద్దరు ఎక్కిన బస్సు శుక్రవారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల ప్రాంతంలో కర్నూలు దాటగానే ప్రమాదానికి గురయ్యింది. ఎదురుగా వస్తున్న మోటారుబైకును ఢీకొన్నది. బైకును ఢీకొన్న బస్సు ఆ బైకును సుమారు 300 మీటర్లు రోడ్డుపైన ఈడ్చుకుంటు వెళ్ళటం వల్లే ప్రమాదానికి కారణమైంది. బైకు ట్యాంకు రోడ్డుకు బాగా రాపిడి అవటంతో ట్యాంకు బాగా వేడెక్కిపోయింది. ట్యాంకులో పెట్రోలు ఉండటంతో ట్యాంకు వేడికి వెంటనే మంటలు అంటుకున్నాయి. బైకు ట్యాంకు నుండి ఎగసిన మంటలు బస్సు ఇంజన్ కు అంటుకుని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున కాబట్టి బస్సులోని వాళ్ళంతా మంచి నిద్రలో ఉన్నారు.
మంటలు, పొగ కారణంగా సడెన్ గా మెలకువ వచ్చిన వారు నిద్రలోనుండి మేల్కొని బయటపడే మార్గాలు చూసుకున్నారు. అదృష్టవంతులు బస్సులో నుండి బయటపడగా మిగిలిన వారు మంటల్లో చిక్కుకుని మరణించారు. బస్సులో మరణించిన వారిలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులు అనూషారెడ్డి, ధాత్రి కూడా ఉన్నారు.