బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు రూ.5లక్షల ఎక్స్ గ్రేషియా
బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది.
కర్నూలు స్లీపర్ బస్సు ప్రమాదంలో మృతుల కుటుంబాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియాను ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో కర్నూల్ బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ పౌరులకు రాష్ట్ర ప్రభుత్వం తరుపున రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ,గాయపడిన క్షతగాత్రులకు రూ. 2 లక్షల రూపాయలు ఇస్తామని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి చెప్పారు.
బస్సు ప్రమాదంపై సీఎం సమీక్ష
కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అప్రమత్తమై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు , డీజీపీ శివధర్ రెడ్డి తో పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వం తరఫున తక్షణమే అవసరమైన చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు.కర్నూల్ లో జరిగిన బస్సు సంఘటన దురదృష్టకరమని, చాలా బాధ కలుగుతుందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
అన్ని చర్యలు తీసుకుంటాం...
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ మధ్య ప్రతిరోజు వేలాదిమంది ప్రయాణం చేస్తుంటారని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. త్వరలో ఆంధ్ర ప్రదేశ్ ,కర్ణాటక, తెలంగాణ రవాణా శాఖ మంత్రులం రవాణా శాఖ కమిషనర్లు సమావేశం ఏర్పాటు చేస్తామని ఆయన పేర్కొన్నారు.‘‘స్పీడ్ లిమిట్ ప్రమాదాలను నివారిస్తుంది ఇలాంటి నిబంధనలు కచ్చితత్వం చేస్తాం’’అని పొన్నం వివరించారు.