కర్నూలు ప్రమాదం.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలంగాణ సర్కార్

మృతులకు రూ.5 లక్షలు. క్షతగాత్రులకు రూ.2లక్షలు

Update: 2025-10-24 07:49 GMT

కర్నూలు బస్సు ప్రమాదంలో మరణించిన తెలంగాణ వాసులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. ప్రమాదంలో మరణించిన వారిలో తెలంగాణ వారు ఎంతమంది అనేది ఇంకా తెలియలేదు. కానీ ఈ ప్రమాదంలో మరణించిన వారికి రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. అదే విధంగా క్షతగాత్రులకు నాణ్యమైన చికిత్స అందించడానికి అన్ని సదుపాయాలు కల్పిస్తామని పొన్నం పేర్కొన్నారు. ప్రస్తుతం మృతుల వివరాలు తెలుసుకోవడం కోసం అధికారులు చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వైద్య నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం కూడా దృష్టి సారించింది. క్షేత్రస్థాయిలో విచారించాలని ఏపీ సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అదే విధంగా ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తుకు ఆదేశించినట్లు తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

సీఎం రేవంత్ ఆరా..

కర్నూలు బస్సు ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీశారు. సీఎస్, డీజీపీలతో ఈ ఘటనపై చర్చించారు. తక్షణమే హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని, గద్వాల కలెక్టర్, ఎస్పీ ఘటనా స్థలానికి వెళ్లాలని ఆదేశించారు. పూర్తి వివరాలు సేకరించాలని, ఘటనపై దర్యాప్తు చేయాలని చెప్పారు.

భద్రత పెరాల్సిన అవసరం ఉంది: జిష్ణుదేవ్ వర్మ

జాతీయ రహదారులపై భద్రతా చర్యలను పెంచాల్సిన అవసరం ఉందని బెంగళూరు ఘటన స్పష్టం చేస్తుందని తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పేర్కొన్నారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు.

Tags:    

Similar News